తుంగభద్రలో క‘ర్నాటకం’!

21 Nov, 2016 00:42 IST|Sakshi
తుంగభద్రలో క‘ర్నాటకం’!

భారీ జల దోపిడీకి తెరతీసిన కర్ణాటక ప్రభుత్వం
- టీబీ డ్యాంలో నీటి నిల్వ సామర్థ్యం తగ్గడాన్ని సాకుగా చూపుతోన్న వైనం
- 35 టీఎంసీల సామర్థ్యంతో రూ.5,600 కోట్లతో కొత్త జలాశయం నిర్మాణం
- హెచ్చెల్సీ, రాయచూర్ కెనాల్‌కు సమాంతరంగా వరద కాలువల తవ్వకం
-  ప్ర తిపాదనలకు అంగీకరించాలని ఏపీ సర్కార్‌కు లేఖ
- అంగీకరిస్తే రాయలసీమ ఎడారిగా మారుతుందని నిపుణుల ఆందోళన
 
 సాక్షి, హైదరాబాద్: తుంగభద్ర జలాలను ఇప్పటికే అడ్డగోలుగా తోడేస్తోన్న కర్ణాటక.. జలదోపిడీని నిర్విఘ్నంగా కొనసాగించేందుకు సరి కొత్త నాటకాలకు తెర తీసింది. తుంగభద్ర జలాశయం (టీబీ డ్యాం)లో పూడిక పేరుకుపోవడాన్ని సాకుగా చూపి.. డ్యాం ఎగువన కొప్పళ జిల్లా నవిలే గ్రామం సమీపంలో రూ.5600 కోట్ల అంచనా వ్యయంతో 35 టీఎంసీల సామర్థ్యంతో జలాశయాన్ని నిర్మించడానికి సిద్ధమైంది. ఇందులో 35 శాతం వ్యయాన్ని భరించాలని ఏపీ సర్కార్‌ను కోరింది. టీబీ డ్యాం కుడిగట్టు ఎగువ కాలువ(హెచ్చెల్సీ), ఎడమ గట్టు కాలువ(రాయచూర్ కాలువ)కు సమాంతరంగా వరద కాలువ తవ్వడానికి సహకరించాలని ప్రతిపాదిస్తూ వారం క్రితం ఏపీ సర్కార్‌కు లేఖ రాసింది. కర్ణాటక ప్రతిపాదనలకు అంగీకరిస్తే.. తుంగభద్ర జలాలు ఒక్క చుక్క కూడా రాష్ట్రానికి దక్కవని, రాయలసీమ ఎడారిగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తుంగభద్ర జలాశయంలో 230 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని లెక్క కట్టిన బచావత్ ట్రిబ్యునల్ హెచ్చెల్సీకి 32.50 టీఎంసీలు, ఎల్లెల్సీకి 24, కేసీ కెనాల్‌కు 10, ఆర్డీఎస్(రాజోలిబండ డైవర్షన్ స్కీం)కు 6.91, నీటి ప్రవాహ నష్టాలు 5.50.. వెరసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 78.51 టీఎంసీలు, కర్ణాటకకు 151.49 టీఎంసీలను కేటారుుంచింది. 1953లో టీబీ డ్యాం నీటి నిల్వ సామర్థ్యం 133 టీఎంసీలు. పూడిక పేరుకుపోతోండటంతో ఏటా 53 టీఎంసీల మేర నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతోంది. ప్రస్తుతం జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 100 టీఎంసీలకు తగ్గింది. దాంతో నీటి లభ్యత 151 టీఎంసీలకు పడిపోరుుందని లెక్క కట్టిన టీబీ బోర్డు.. దామాషా పద్ధతిలో రాష్ట్రానికి 48.50 టీఎంసీలు కేటారుుస్తూ వస్తోంది. కానీ మూడేళ్లుగా ఏనాడూ కేటారుుంచిన మేరకు నీటిని విడుదల చేసిన దాఖలాలు లేవు. ఈ ఏడాదీ హెచ్చెల్సీకి 22.50 టీఎంసీలు కేటారుుస్తే 6.5టీఎంసీలు, ఎల్లెల్సీకి 17.45 టీఎంసీలు కేటారుుస్తే 2.49, కేసీ కెనాల్‌కు 1.01 టీఎంసీలు మాత్రమే విడుదల చేయడం గమనార్హం. దాంతో రాయలసీమలో 6.25 లక్షల ఎకరాల ఆయకట్టు బంజరుగా మారింది.

 వ్యూహాత్మకంగా పావులు.. భారీగా జల దోపిడీ
 టీబీ డ్యాంలో పూడికతీతకు భారీగా ఖర్చు వస్తుందని ఆ ప్రతిపాదనలను కర్ణాటక ప్రభుత్వం పక్కన పెట్టింది. నూతన జలాశయం నిర్మాణం.. హెచ్చెల్సీ, రాయచూర్ కెనాల్‌కు సమాంతరంగా వరద కాలువల తవ్వకానికి టీబీ బోర్డుపై ఒత్తిడి తెచ్చి ఆమోద ముద్ర వేరుుంచింది. హెచ్చెల్సీకి సమాంతరంగా వరద కాలువ తవ్వాలని ఐదు దశాబ్దాలుగా ఏపీ సర్కార్ కోరుతున్నా పట్టించుకోని కర్ణాటక సర్కారు.. ఇప్పుడు ఆ ప్రతిపాదనకు అంగీకరిస్తూనే రాయచూర్ కెనాల్‌కు సమాంతరంగా వరద కాలువ తవ్వకానికి ఏపీ ప్రభుత్వం అంగీకరించాలని మెలిక పెట్టింది. తుంగభద్ర ప్రధాన ఉప నది తుంగపై అప్పర్ తుంగ ప్రాజెక్టు, సింగటలూరు ఎత్తిపోతల పథకం, మరో ఉప నది భద్రపై అప్పర్ భద్ర ప్రాజెక్టును అధికారికంగా చేపట్టి పూర్తి చేసింది.

ఆ ప్రాజెక్టుల దిగువన భారీ ఎత్తున ఎక్కడికక్కడ ఎత్తిపోతల పథకాలను చేపట్టి అడ్డగోలుగా నీటిని తోడేస్తోంది. పర్యవసానంగా తుంగభద్ర జలాశయంలో నీటి లభ్యత తగ్గిపోరుుంది. హెచ్చెల్సీ 196.43 కి.మీలలో 105.487 కి.మీలు కర్ణాటక పరిధిలో ఉంది. ఎల్లెల్సీ 348.2 కి.మీలలో కర్ణాటక పరిధిలో 131.50 కి.మీలు ఉంది. ఏపీ కోటా కింద విడుదల చేసిన నీటిని కర్ణాటక పరిధిలో రైతులు ఎక్కడికక్కడ గండ్లు కొడుతూ నీటిని తరలిస్తోన్నా ఏపీ ప్రభుత్వం తుంగభద్ర బోర్డుకు ఫిర్యాదు చేసిన దాఖలాలు లేవు. ఇదే సమయంలో కర్ణాటక పరిధిలో లోలెవల్ కెనాల్(ఎల్లెల్సీ)పై 118.2 కి.మీల వద్ద అదనంగా మరో డిస్ట్రిబ్యూటరీ ఏర్పాటుకు టీబీ బోర్డు ఆమోదముద్ర వేసినా ఏపీ సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేయలేదు. దీని వల్ల కర్ణాటక జలదోపిడీకి ఏపీ సర్కార్ అధికారికంగా ఆమోదముద్ర వేసినట్లరుుంది.
 
 అంగీకరిస్తే అంతే సంగతి
 కర్ణాటక ప్రభుత్వ ప్రతిపాదనలకు ఏపీ సర్కార్ అంగీకరిస్తే రాయలసీమ ఎడారిగా మారిపోవడం ఖాయమని సాగునీటి రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే రాయచూర్ కెనాల్‌కు ఇష్టారాజ్యంగా నీటిని విడుదల చేస్తూ జలదోపిడీ చేస్తోన్న కర్ణాటక.. వరద కాలువ తవ్వితే జలదోపిడీకి అడ్డే ఉండదు. మరో జలాశయం నిర్మాణం తర్వాత భారీ ఎత్తున ఎత్తిపోతల పథకాలను చేపట్టి నీటిని తరలించడానికి కర్ణాటక ఎత్తులు వేస్తోంది. ఈ ప్రతిపాదనల వల్ల ఏపీ సర్కార్‌కు ఎలాంటి ప్రయోజనం లేదని.. హెచ్చెల్సీ, ఎల్లెల్సీ ఆధునికీకరణతోనే పూర్తి సామర్థ్యం మేరకు నీటిని వినియోగించుకోవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. వీటి ఆధునికీకరణకు కర్ణాటక సర్కార్ ససేమిరా అంటోండటం గమనార్హం. ఈ అంశంపై ఇంజనీర్-ఇన్-చీఫ్ వెంకటేశ్వరరావును ‘సాక్షి’వివరణ కోరగా.. టీబీ డ్యాంకు ఎగువన కొత్త జలాశయం నిర్మాణం, హెచ్చెల్సీ, రాయచూర్ కెనాల్‌కు సమాంతరంగా వరద కాలువల తవ్వకానికి అంగీకరించాలని కోరుతూ కర్ణాటక సర్కార్ లేఖ రాసిందని చెప్పారు. రాయచూర్ కెనాల్ ద్వారా కర్ణాటక ఇప్పటికే భారీ ఎత్తున నీటిని అక్రమంగా వినియోగిస్తోందన్నారు. కర్ణాటక ప్రతిపాదనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి.. నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

>
మరిన్ని వార్తలు