కీలక ఉగ్రవాది కోసం వెళ్లి నేలకొరిగాడు

8 Oct, 2015 11:47 IST|Sakshi
కీలక ఉగ్రవాది కోసం వెళ్లి నేలకొరిగాడు

శ్రీనగర్: ఉగ్రవాదుల ఎత్తులకు పై ఎత్తులకు వేసి వారి ఆటకట్టించగల జమ్మూకశ్మీర్కు చెందిన ఓ పోలీసు ప్రాణాలు కోల్పోయాడు. కశ్మీర్లోని బందిపోర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్లో  అల్తాఫ్ అహ్మద్ అనే సబ్ ఇన్స్పెక్టర్ నేలకొరిగాడు. ఈ విషయం తెలిసి రాష్ట్ర పోలీసు శాఖ ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెందింది. ఎందుకంటే చనిపోయిన అల్తాఫ్కు కర్తవ్యం అంటే ప్రాణం. ఎంతటి క్లిష్ల పరిస్థితులమధ్యనైనా విధులు నిర్వర్తించడంలో ముందుంటాడు. అలాంటి అధికారి ఉగ్రవాదులతో జరిపిన ఎదురుకాల్పుల్లో ప్రాణాలు కోల్పోవడంతో పోలీసుశాఖకు తీరని లోటు ఏర్పడినట్లయింది. 'నేను మీ కెమెరా ముందు ఏం మాట్లాడలేకపోతున్నాను.

బహుషా నాకు ఏడ్పుకూడా రావొచ్చు' అని అక్కడి డీజీపీ కే రాజేంద్ర కుమార్ అన్నారు. మరో ఇద్దరు సహోద్యోగులతో కలిసి అల్తాఫ్ బందిపూర్కు కోవర్ట్ మిషన్ లో భాగంగా వెళ్లాడని, అక్కడ పాకిస్థాన్ ఉగ్రవాది లష్కరే తోయిబా కమాండర్ అబూ ఖాసింను గుర్తించి అరెస్టు చేసేందుకు ప్రయత్నించాడని, ఆ ప్రయత్నంలో జరిగిన ఎన్ కౌంటర్లో ప్రాణాలు కోల్పోయాడని చెప్పారు. ఈ ఏడాది ఆగస్టు 5న ఉదంపూర్ వద్ద బీఎస్ఎఫ్ కాన్వాయ్పై భారీ ఎత్తున దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈదాడి ప్రధాన సూత్రదారుడు ఖాసీం అని గుర్తించిన అధికారులు అతడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక విధుల్లో భాగంగా బందిపోర్ జిల్లాకు అల్తాఫ్ను పంపించారు. కానీ, టార్గెట్కు దగ్గరవుతుండగానే వాళ్లు ఎదురుకాల్పులు జరపగా తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో కన్నుమూశాడు. ఇప్పటి వరకు సైన్యం నిర్వహించిన పలు ఆపరేషన్లకు ఆల్తాఫ్ ఎనలేని సేవలను అందించాడు.
 

మరిన్ని వార్తలు