బంగ్లాదేశ్ వైపు తరలిన అల్పపీడనం

10 Oct, 2015 22:50 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో కొనసాగిన అల్పపీడనం బంగ్లాదేశ్ వైపు తరలిపోయింది. ఇంకోవైపు, తూర్పు మధ్య అరేబియా సముద్రంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం మరింత బలపడనుంది. ఇది వాయవ్య దిశగా పయనిస్తూ ఆదివారం నాటికి తుపానుగా మారనుంది. ఈ నెల 12 నుంచి బలహీన పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ తుపానుకు బంగ్లాదేశ్ సూచించిన ‘చపల’ అనే పేరు పెట్టే అవకాశం ఉంది.

అయితే ఈ తుపాను ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉండబోదని వాతావరణ నిపుణులు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా బిహార్ నుంచి ఉత్తరాంధ్ర వరకు ఉపరితల ద్రోణి, ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతున్నాయి. వీటి ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు గాని, ఉరుములతో కూడిన జల్లులు గాని కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

మరిన్ని వార్తలు