ఎంహెచ్-17కు 25 కిలోమీటర్ల దూరంలో మన విమానం

19 Jul, 2014 09:52 IST|Sakshi
ఎంహెచ్-17కు 25 కిలోమీటర్ల దూరంలో మన విమానం

ఒకళ్లు కారు.. ఇద్దరు కారు.. దాదాపు 126 మంది ప్రయాణికులు. అంతా ఎయిరిండియా విమానం ఏఐ-113లో ఉన్నారు. విషయం తెలియగానే వాళ్లందరికీ గుండెలు ఒక్కసారిగా ఝల్లుమన్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే, బక్ క్షిపణి దాడిలో మలేసియా ఎయిర్లైన్స్కు చెందిన ఎంహెచ్-17 విమానం కూలిపోయినప్పుడు.. దానికి ఈ ఎయిర్ ఇండియా విమానం కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే, ఆ విమానం కొద్ది ఆలస్యమైనా.. ఇది కొంచెం ముందున్నా చాలా దారుణం జరిగేదన్నమాట. సరిగ్గా ఎంహెచ్-17 విమానం రాడార్ నుంచి అదృశ్యం అయిపోయినప్పుడు.. దానికి ఎయిరిండియా విమానం పాతిక కిలోమీటర్ల దూరంలో ఉందని ప్రపంచవ్యాప్తంగా విమానాల రాకపోకలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండే ఫ్లైట్రాడార్24.కామ్ అనే వెబ్సైట్ తెలిపింది.

దుర్ఘటన జరిగిన తర్వాత.. ప్రధాని నరేంద్రమోడీ ప్రయాణిస్తున్న విమానం సహా పలు విమానాలను ఎయిరిండియా మార్గం మార్చింది. యూరప్, ఆసియా ఖండాల మధ్య విమానాలు తిరిగేందుకు ఉక్రెయిన్ గగనతలమే అత్యంత అనుకూలం కావడంతో ఇది ఎప్పుడూ విమానాల రాకపోకలతో బిజీగా ఉంటుంది. అయితే.. ఈ సంఘటన తర్వాత దాదాపుగా ఈ మార్గంలో వెళ్లే విమానాలన్నీ దారిమళ్లించుకున్నాయి. విమానాలు వెళ్లడానికి ఉన్న మరో మార్గం కూడా ప్రమాదకరంగానే ఉంటుంది. అది సింఫెరోపోల్ ఎఫ్ఐఆర్ మార్గం. అయితే.. ఆ మార్గం అటు ఉక్రెయిన్, ఇటు రష్యా.. రెండూ తమదంటే తమదేనని ప్రకటించుకోవడంతో పాటు రెండు ఏటీసీలు ఉండటంతో భద్రతా కారణాల రీత్యా అటు విమానాలు వెళ్లడంలేదు.

యూరప్, అమెరికాలకు మన దేశం నుంచి రెండే విమానయాన సంస్థలు విమానాలు నడుపుతున్నాయి. అవి ఎయిరిండియా, జెట్ ఎయిర్వేస్. ఎంహెచ్-17 దుర్ఘటన తర్వాత తూర్పు ఉక్రెయిన్ మార్గం మీదుగా వెళ్లొద్దని ఈ రెండు సంస్థలకు భారత విమానయాన నియంత్రణ సంస్థ తెలిపింది.

మరిన్ని వార్తలు