‘సినిమా హాళ్లలో ఉచిత నీరు ఇవ్వాల్సిందే’

12 Sep, 2015 03:41 IST|Sakshi

న్యూఢిల్లీ: మంచినీరు కనీస అవసరమని, సినిమా హాళ్లలో యాజమాన్యాలు ఉచితంగా మంచినీటిని అందుబాటులో ఉంచాలని జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ స్పష్టం చేసింది. థియేటర్లలో అధిక ధరలు పెట్టి మంచినీటిని కొనుక్కునే స్తోమత అందరికీ ఉండదని ఓ వాజ్యం విచారణ సందర్భంగా అభిప్రాయపడింది. సినిమాకు వచ్చేవాళ్లలో పిల్లలు, వృద్ధులు కూడా ఉంటారని, 3 గంటలపాటు నీళ్లు లేకుండా ఉండటం వీరికి సాధ్యపడదని, ఇంటి నుంచే తెచ్చుకునే మంచినీళ్లను థియేటర్లలోకి అనుమతించాలని, లేకపోతే ఉచితంగా అందుబాటులో ఉంచాలని  ఆదేశాలు జారీచేసింది. హాళ్లలోని కేఫెల్లో అధికధరలు పెట్టి మంచినీళ్లు కొనుక్కోవడం మినహా మరోదారిలేని పరిస్థితి కల్పిస్తే, అనుచిత వ్యాపారమార్గాలను అనుసరిస్తున్నట్లుగా పరిగణిస్తామని హెచ్చరించింది.

మరిన్ని వార్తలు