ఉత్తరాఖండ్ ఎన్నికల్లో 50 శాతం పోలింగ్

21 Jul, 2014 20:28 IST|Sakshi

డెహ్రాడున్: ఉత్తరాఖండ్ లో ఆదివారం జరిగిన ఉప ఎన్నికల్లో 50 శాతం పోలింగ్ నమోదైంది.  మూడు అసెంబ్లీ స్థానాలకు గాను ఇక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో సగం మంది ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ధార్చులా, దోయ్ వాలా, సోమేశ్వర్ అసెంబ్లీ స్థానాల్లో మూడు లక్షల మంది ఓటర్లు పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో ఓటర్లు శాంతియుతంగా ఓటు వినియోగించుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి రాధా రాతూరి తెలిపారు.
 

పోలింగ్ ఏర్పాట్లు ఇక్కడ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన హరీష్ రావత్ కు ఈ ఎన్నికలు అత్యంత ప్రాధాన్యమైనవి. ముఖ్యమంత్రిగా రావత్ తన బలాన్ని నిరూపించుకునే గడువు జూలై 31 తో ముగుస్తున్నసంగతి తెలిసిందే.  విజయ్ బహుగుణ నుంచి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన ఆయన ఫిబ్రవరి 1వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. ధార్చులా అసెంబ్లీ నుంచి బరిలోకి దిగిన రావత్ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.

గత ఏడాది వరదలతో పెను విధ్వంసానికి గురైన ఉత్తరాఖండ్‌లో విజయ్ బహుగుణ సరైన రీతిలో సహాయ, పునరావాస చర్యలు చేపట్టడంలో విఫలమవడంతో ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ తన ప్రతిష్టను కాపాడుకునేందుకు విజయ్ బహుగుణను తొలగించి అప్పటి కేంద్ర జల వనరుల శాఖ మంత్రి 65 యేళ్ళ హరీష్ రావత్ ను ముఖ్యమంత్రిగా నియమించింది. అప్పట్లో కాంగ్రెస్ అధినాయకత్వం చేసిన విజ్ఞప్తి మేరకు విజయ్ బహుగుణ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెల్సిందే.

మరిన్ని వార్తలు