ఆర్థిక సంవత్సరం మారబోతుందా..?

7 Jul, 2016 12:34 IST|Sakshi
ఆర్థిక సంవత్సరం మారబోతుందా..?

న్యూఢిల్లీ : ప్రస్తుతమున్న ఆర్థిక సంవత్సరం మారబోతుందా..? అంటే దీనికి కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీనే సమాధానం చెప్పాల్సి ఉంది. ప్రస్తుతమున్న ఏప్రిల్-మార్చి ఆర్థిక సంవత్సర మార్పుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని కేంద్రప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. కొత్త ఆర్థిక సంవత్సరానికి వివిధ తేదీలను పరిశీలించి, ఆ తేదీలతో ఉపయోగాలు, నష్టాలపై నివేదికను డిసెంబర్ లోగా ఆర్థిక మంత్రిత్వ శాఖకు సమర్పించనుంది.

మాజీ సీఈఏ శంకర్ ఆచార్య అధ్యక్షతన ప్రభుత్వం ఈ కమిటీని నియమించింది. ఆచార్యతో పాటు ఈ కమిటీలో మాజీ కేబినెట్ కార్యదర్శి కేఎమ్ చంద్రశేఖర్, తమిళనాడు మాజీ ఆర్థిక కార్యదర్శి పీవీ రాజరామన్, సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ సీనియర్ ఫెలోగా ఉన్న రాజీవ్ కుమార్ సభ్యులుగా ఉన్నారు.

ఆర్థిక సంవత్సర మార్పుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను కమిటీ పరిశీలిస్తుందని ఆర్థిక మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయ, వ్యయాలకు సంబంధించి కమిటీ సరియైన అంచనాలను చేపట్టి, తన ప్రతిపాదనను ప్రభుత్వానికి సమర్పించనుంది. వివిధ వ్యవసాయ పంట కాలానికి అనుగుణంగా ఆర్థిక సంవత్సర మార్పు ప్రతిపాదనలను కమిటీ చేపట్టనుంది.

వ్యాపారాలు, పన్ను విధానం, గణాంకాలు, డేటా సేకరణ, బడ్జెట్ పనులపై శాసన సభ్యుల సౌలభ్యం వంటి అన్ని అంశాలను కూడా కమిటీ పరిశీలించనుంది. అన్ని అంశాలను పరిశీలించిన అనంతరం కమిటీ ప్రతిపాదించే ఆర్థిక సంవత్సర తేదీలు, దేశానికి అనుకూలంగా ఉంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో వెల్లడించింది. కమిటీ తన నివేదిక రూపకల్పన కోసం వివిధ రకాల నిపుణులను, ఇన్ స్టిట్యూషన్స్ ను, ప్రభుత్వ కార్యాలయాలను సంప్రదించనుంది.

మరిన్ని వార్తలు