'మ్యాజిక్' మార్కును దాటిన మహా కూటమి

8 Nov, 2015 16:24 IST|Sakshi
'మ్యాజిక్' మార్కును దాటిన మహా కూటమి

పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో  సీఎం నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ ల మహా లౌకిక కూటమి మ్యాజిక్ మార్కును దాటింది. మొత్తం 243 స్థానాలకు సంబంధించి జరిగిన పోరులో మహా కూటమి ఆది నుంచి ఆధిపత్యం కొనసాగించింది.  సాయంత్రం గం. 4.23  ని.లకు సమయానికి మహా కూటమి 124  సీట్లను సాధించింది.  దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యను దాటేసిన  మహా కూటమి.. మరో 52  సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది.  కాగా, బీజేపీ 35  సీట్లను మాత్రమే సాధించి, 25  సీట్లలో ఆధిక్యంలో ఉంది. 

 

సీఎం నితీశ్ సచ్ఛీలతను, సుపరిపాలనను, లాలూ ప్రసాద్ కుల సమీకరణాలను నమ్ముకుని మహా లౌకిక కూటమి పోటీ చేయగా, మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీనే స్వయంగా రంగంలోకి దిగి ప్రచార బాధ్యతలు చేపట్టిన ఎన్డీయే కూటమి ఆశించిన ఫలితాలను నమోదు చేయలేదు.  బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు విజయం సాధించారు. హెచ్ఏఎం నేత జితన్ రాం మాంఝీ , ఆర్జేడీ నేత, లాలూ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్,  జేడీయూ నేతలు విజయ్ కుమార్ యాదవ్, శ్యామ్ రాజక్ లు గెలుపుబావుటా ఎగురవేశారు.  ఐదు దశల్లో కలిపి రికార్డ్ స్థాయిలో, అత్యధికంగా 56.8% పోలింగ్ నమోదైన సంగతి తెలిసిందే. 272 మంది మహిళలు సహా మొత్తం 3450 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ చేశారు.

మరిన్ని వార్తలు