అన్నాడీఎంకే: గ్రూపుల విలీనం ఖాయం!

20 Aug, 2017 19:30 IST|Sakshi
అన్నాడీఎంకే: గ్రూపుల విలీనం ఖాయం!

చెన్నయ్‌: ఏఐఏడీఎంకే ఐక్యంగా నిలబడుతుందని, పార్టీలో ఏ కుటుంబ (శశికళ) జోక్యం ఉండబోదని పన్నీర్‌సెల్వం తేల్చిచెప్పారు. విలీనం ఖాయమని సంకేతాలు పంపారు. ఇక ఏఐఏడీఎంకేలో పళనిస్వామి, పన్నీర్‌ సెల్వం గ్రూపుల మధ్య రాజీ ఫార్ములా ఖరారు కావడంతో ఎట్టకేలకు విలీన ప్రక్రియ కొలిక్కివచ్చింది. ఇరు పక్షాలు అంగీకారానికి వచ్చిన మేరకు మాజీ సీఎం పన్నీర్‌ సెల్వంకు ఉప ముఖ్యమంత్రి, ఆయన అనుయాయులు కొందరికి మంత్రిపదవులు దక్కనున్నాయి.

మరోవైపు పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళపై వేటు వేయడంతో పాటు పార్టీ నుంచి బహిష్కరించాలన్న పన్నీర​ వర్గీయుల డిమాండ్‌కూ పళనిస్వామి అంగీకరించినట్టు సమాచారం.పార్టీ ఎన్నికలు జరిగే వరకూ స్టీరింగ్‌ కమిటీకి పన్నీర్‌ సెల్వం నేతృత్వం వహించేందుకు ఇరు పక్షాల మధ్య అంగీకారం కుదిరింది. కొద్ది కాలం పార్టీకి ఈపీఎస్‌, ప్రభుత్వానికి ఓపీఎస్‌ నాయకత్వం వహించేలా సర్ధుబాటు చేసుకున్నారు.
 
ఏఐఏడీఎంకేలో ఇరు గ్రూపుల మధ్య ఎలాంటి రాజీ కుదిరినా స్తంభింపచేసిన పార్టీ ఎన్నికల గుర్తును ఎన్నికల కమిషన్‌ పునరుద్ధరించే అవకాశాలు మెరుగవుతాయి.విలీనం అనంతరం పార్టీ జనరల్‌ కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటు చేసి శశికళను తొలగించే తీర్మానం ఆమోదిస్తారని సమాచారం. మరోవైపు ఈపీఎస్‌, ఓపీఎస్‌ గ్రూపుల మధ్య సయోధ్యకు బీజేపీ చొరవ చూపిన క్రమంలో ఈ పరిణామాలు 2019 ఎన్నికల్లో ఎన్‌డీఏకు ఉపకరించనున్నాయని భావిస్తున్నారు.

దినకరన్‌ ఎమ్మెల్యేలతో మంత్రుల చర్చలు
ఏఐఏడీఎంకే విలీనం ఖాయం కావడంతో,  దినకరన్‌ మద్దతుదారులను తమవైపు తిప్పుకొనే దిశగా ఏఐఏడీఎంకే నేతలు పావులు కదుపుతున్నారు. పార్టీలో శశికళ ప్రమేయం లేకుండా చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేపట్టారు. ఇందుకోసం అన్నాడీఎంకే జాయింట్‌ కార్యదర్శి టీటీవీ దినకరన్‌ మద్దతు ఎమ్మెల్యేలతో ఆరుగురు మంత్రులు ఒక ప్రత్యేక గదిలో సుమారు అరగంటపాటు రహస్యంగా చర్చలు జరిపారు.

మరిన్ని వార్తలు