ఈ స్థానం నుంచే ప్రియాంక అరంగేట్రం?

24 Jan, 2017 10:40 IST|Sakshi
ఈ స్థానం నుంచే ప్రియాంక అరంగేట్రం?

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో అధికార సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)తో పొత్తు కుదుర్చుకోవడంలో కీలకపాత్ర పోషించిన ప్రియాంకగాంధీ.. రాజకీయ ఆగమనం ఖాయమని వినిపిస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తన తల్లి సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి ప్రియాంక పోటీ చేసే అవకాశముందని తెలుస్తోంది. సోనియా తప్పుకొని తన నియోజకవర్గం రాయ్‌బరేలీలో ప్రియాంకకు అవకాశమివ్వవచ్చునని కాంగ్రెస్‌ వర్గాల్లో బలంగా వినిపిస్తోందని 'టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా' ఒక కథనంలో తెలిపింది.

ప్రస్తుతం సోనియాగాంధీ అంత ఆరోగ్యంగా లేరు. రాజకీయాలలోనూ అంత చురుగ్గా కనబడటం లేదని పార్టీ వర్గాలు ఉంటున్నాయి. ఈక్రమంలో సోనియా తన బాధ్యతల నుంచి తప్పుకోవాలని భావిస్తుండటంతో.. ఆమేరకు పార్టీలో ప్రియాంక ప్రాధాన్యం, పాత్ర పెరుగుతున్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 'రాహుల్‌ తన సోదరిపైన ఆధారపడటం ఇటీవల బాగా పెరిగింది. సోనియాగాంధీ నిర్వహిస్తున్న అనేక బాధ్యతలను చూసుకోవడమే కాదు.. రాహుల్‌ కార్యాలయం తెరవెనుక బాధ్యతలను కూడా ఆమెనే చక్కబెడుతున్నారు' అని పార్టీ ఇన్‌సైడర్‌ ఒకరు తెలిపారు.

రాజకీయాల్లో ప్రియాంక మరింత పెద్ద పాత్ర పోషించాలని తాము కోరుకుంటున్నట్టు కాంగ్రెస్‌ పార్టీ సోమవారం పేర్కొన్న సంగతి తెలిసిందే. అలాగే ఎస్పీతో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకోవడంలోనూ మేజర్‌ క్రెడిట్‌ ఆమెదేనని ప్రకటించింది. కాంగ్రెస్‌లో ప్రియాంక క్రియాశీలక పాత్రను బాహాటంగా అంగీకరించడం ఇదే తొలిసారి. పార్టీలో ఒక తరం నుంచి మరో తరానికి అధికార మార్పునకు రంగం సిద్ధమైందని, ఈ నేపథ్యంలోనే ప్రియాంక క్రియాశీలక చురుకైన పాత్ర పోషిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మొత్తానికి రానున్న యూపీ ఎన్నికల్లో ఇటు సోదరుడు రాహుల్‌తో కలిసి, సొంతంగా విస్తారంగా ప్రచారం చేయాలని ప్రియాంక భావిస్తున్నారు. అఖిలేశ్‌ భార్య డింపుల్‌తో కలిసి కూడా ఆమె ప్రచారం చేసే అవకాశముందని వినిపిస్తోంది.