దుర్గాశక్తి.. యూపీ సర్కారు - ఓ దుమారం

5 Aug, 2013 12:29 IST|Sakshi
దుర్గాశక్తి.. యూపీ సర్కారు - ఓ దుమారం

ఉత్తరప్రదేశ్‌లోని గౌతమబుద్ధ నగర్ ప్రాంతంలో ఇసుక మాఫియాకు ముచ్చెమటలు పోయించి, అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహానికి గురై చివరకు సస్పెండైన యువ ఐఏఎస్ అధికారి దుర్గాశక్తి నాగ్‌పాల్ ఉదంతంపై రాజకీయ దుమారం రేగుతోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కూడా ఈ విషయంలో కలగజేసుకుని, ఆమెకు సరైన న్యాయం జరిగేలా చూడాలని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు ఓ లేఖ రాయడంతో ప్రధాని రంగంలోకి దిగారు.

ఈ విషయమై తాము ఉత్తరప్రదేశ్ అధికార యంత్రాంగాన్ని తాము నిరంతరం సంప్రదిస్తున్నామని, వాళ్లు కూడా నియమ నిబంధనలను కచ్చితంగా పాటిస్తారని తెలిపారు. అసలు ఈ విషయంలో ఏం జరిగిందో తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నామని పార్లమెంటు వెలుపల ఆయన విలేకరులకు చెప్పారు. ఐఏఎస్ అధికారుల విషయంలో కొన్ని కచ్చితమైన నియమ నిబంధనలున్నాయని, వాటిని అక్కడ కూడా పాటిస్తారని ఆయన చెప్పారు.

దుర్గాశక్తి వ్యవహారంపై వెనువెంటనే సమగ్ర నివేదిక ఇవ్వాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాన్ని కేంద్రం కోరింది. జూలై 27వ తేదీన దుర్గాశక్తి సస్పెండ్ కాగా, అప్పటినుంచి ఇప్పటివరకు మూడుసార్లు ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇలాంటి లేఖలు రాసినట్లు సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.నారాయణస్వామి తెలిపారు. అయితే యూపీ ప్రభుత్వం మాత్రం ఇదేమీ పట్టించుకోకుండా తన దారిలో తాను పోతోంది. దుర్గాశక్తికి పది పేజీల చార్జిషీటు కూడా పంపింది. ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపిన యువ ఐఏఎస్ అధికారిణి, ఓ మసీదు గోడను తగిన పద్ధతి పాటించకుండా కూల్చేశారంటూ ఆమెను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. చార్జిషీటుకు స్పందించేందుకు ఆమెకు 15 రోజుల గడువు ఇచ్చినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు