ఎమ్మెల్సీల రాజీనామా.. సీఎంకు లైన్‌క్లియర్!

29 Jul, 2017 15:46 IST|Sakshi
ఎమ్మెల్సీల రాజీనామా.. సీఎంకు లైన్‌క్లియర్!

లక్నో: ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు లైన్‌ క్లియర్‌ అయింది. ఆయన ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరం లేదు. శాసనమండలిలో ఆయన అడుగుపెట్టేందుకు వీలుగా ఇద్దరు సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎమ్మెల్సీలు రాజీనామా చేసి.. మార్గం సుగమం చేశారు.

శాసనమండలి సభ్యులైన బుక్కాల్‌ నవాబ్‌, యశ్వంత్‌ సింగ్‌ శనివారం తమ పదవులకు రాజీనామా చేశారు. మరింతమంది రాజీనామా చేసే అవకాశం కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. సీఎం ఆదిత్యానాథ్‌, డిప్యూటీ సీఎంలు కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య, దినేశ్‌ శర్మ, మంత్రులు స్వతంత్రదేవ్‌ సింగ్‌, మోసిన్‌ రజాలు శాసనసభకు లేదా శాసనమండలికి ఎన్నికకావాల్సి ఉంది. వీరికి రెండు నెలల గడువు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో వీరు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయడానిక మొగ్గు చూపడం లేదని తెలుస్తోంది. అంతేకాకుండా ఎంపీలుగా ఉన్న సీఎం యోగి, డిప్యూట్యీ సీఎం మౌర్య తమ పదవులకు రాజీనామా చేసి ఎమ్మెల్సీలుగా సభలో అడుగుపెట్టాలని భావిస్తున్నారు. గత ముఖ్యమంత్రులైన మాయావతి, అఖిలేశ్‌ యాదవ్‌ సైతం ఇదేవిధంగా ఎమ్మెల్సీలుగా సభలో అడుగుపెట్టారు.

మరిన్ని వార్తలు