చివర్లో రివ్వున పైకి

19 Sep, 2013 03:54 IST|Sakshi
చివర్లో రివ్వున పైకి
తొలుత లాభాలతో మొదలైన మార్కెట్లు మధ్యలో కొంతమేర వెనక్కు తగ్గినప్పటికీ చివర్లో మళ్లీ పుంజుకున్నాయి. వెరసి సెన్సెక్స్ చివరి అర్థగంటలో పెరిగిన కొనుగోళ్లతో 200 పాయింట్లు ఎగసి గరిష్టంగా 20,013ను తాకింది. ఆపై స్వల్పంగా వెనక్కుతగ్గి 158 పాయింట్ల లాభంతో 19,962 వద్ద ముగిసింది. ఇది వారం రోజుల గరిష్టంకాగా, నిఫ్టీ కూడా ఇంట్రాడేలో 5,900ను అధిగమించింది. చివరికి 49 పాయింట్లు జమ చేసుకుని 5,899 వద్ద స్థిరపడింది. బీఎస్‌ఈలో ప్రధానంగా రియల్టీ, బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ రంగాలు 2-1.3% మధ్య బలపడ్డాయి. అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ సమావేశాలపై దృష్టిపెట్టిన ఆపరేటర్లు, ఇన్వెస్టర్లు ట్రేడింగ్ పట్ల పెద్దగా ఆసక్తిని చూపకపోవడంతో మార్కెట్లు అక్కడక్కడే సంచరిస్తున్నాయని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. అయితే యూరప్ మార్కెట్లు ప్రోత్సాహకరంగా ట్రేడవుతుండటంతో సెంటిమెంట్ సానుకూలంగా మారిందని తెలిపారు. 
 
 24 షేర్లు లాభాల్లోనే : సెన్సెక్స్-30లో 24 షేర్లు లాభాలతోనే ముగియగా, ఎన్‌టీపీసీ, టాటా పవర్ 3%పైగా పురోగమించాయి. మిగిలిన దిగ్గజాలలో ఎస్‌బీఐ, డాక్టర్ రెడ్డీస్, హెచ్‌యూఎల్, ఎల్‌అండ్‌టీ, మారుతీ, ఆర్‌ఐఎల్, ఐటీసీ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 2.4-1.2% మధ్య లాభపడ్డాయి. మరోవైపు భెల్ దాదాపు 5% పతనంకాగా, హీరోమోటో 2.8%, సెసా గోవా 1.6% చొప్పున క్షీణించాయి.  మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.5% బలపడగా, ట్రేడైన షేర్లలో 1,221 లాభపడ్డాయి. 1,112 నష్టపోయాయి. 
 
మరిన్ని వార్తలు