ల్యాండ్ అవుతున్న విమానంపై కాల్పులు

25 Jun, 2014 08:29 IST|Sakshi
ల్యాండ్ అవుతున్న విమానంపై కాల్పులు

పాకిస్తాన్‌లో ఉగ్రవాదులు మరోసారి తెగబడ్డారు. విమాన ప్రయాణీకులే లక్ష్యంగా విరుచుకుపడ్డారు. పెషావర్‌ విమానాశ్రయంలో పీకే 756 విమానం కిందకు దిగుతుండగా.... టెర్రరిస్టులు కాల్పులు జరిపారు.ఈ ఘటనలో ఒక మహిళా ప్రయాణికురాలు మృతి చెందగా, ముగ్గురు విమాన సిబ్బందికి  తీవ్ర గాయాలయ్యాయి. ఫైలెట్‌ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పుకున్నాడు. మొత్తం ఫ్లైట్‌కు ఆరు బుల్లెట్లు తగిలాయని.. ఒక బుల్లెట్‌ విమాన ఇంజిన్‌లో ఇరుక్కుపోయిందని ఎయిర్‌పోర్టు పోలీసులు తెలిపారు.  

దాదాపు 178 మంది ప్రయాణికులతో విమానం సౌదీ అరేబియా నుంచి  పాకిస్తాన్‌కు వస్తుందని అధికారులు చెప్పారు.  ఊహించని దాడితో బచాఖన్‌ విమానాశ్రయం వద్ద అధికారులు ఎమర్జెన్సీ ప్రకటించారు. దాడి నేపథ్యంలో విమాన రాకపోకలు, కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. జూన్‌ 8న తాలిబన్లు కరాచీ ఎయిర్‌పోర్టుపై విరుచుకుపడి 34 మంది ప్రయాణికుల ప్రాణాలను తీశారు. ఇంతలోనే మరోసారి ఉగ్రమూక కాల్పులకు తెగబడడంతో పాకిస్తాన్‌ ప్రజలు వణికిపోతున్నారు.

మరిన్ని వార్తలు