ఒంటరి పోరుకు సై

8 Mar, 2016 03:27 IST|Sakshi
ఒంటరి పోరుకు సై

* తమిళిసై స్పష్టీకరణ  
* జవదేకర్ అదే వ్యాఖ్య

సాక్షి, చెన్నై: రాష్ట్రంలో ఎన్నికల్ని ఒంటరిగానే ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధం అవుతోంది. 234 స్థానల్లోనూ పోటీకి తాము రెడీ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ స్పష్టం చేశారు. పార్టీ ఎన్నికల ఇన్‌చార్జ్ జవదేకర్ వ్యాఖ్యలూ అదే తరహాలో ఉండడం గమనార్హం. డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించాలన్న కమలనాథుల ఆశలు అడియాశలు అవుతున్నాయి. ప్రాంతీయ పార్టీలు కలిసి రాక పోవడంతో ఒంటరిగా మిగిలే పరిస్థితి చోటు చేసుకుంది.

గతంలో వలే ఒంటరిగానే ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు కమలనాథులు సైతం సిద్ధం అవుతూ, అందుకు తగ్గ కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. డీఎండీకే తమతో కలిసి వస్తుందన్న ఆశాభావం ఎక్కడో మిగిలి ఉన్నా, చివరకు అది కూడా గల్లంతైనట్టే అన్న భావన బయల్దేరి ఉన్నది. ఇందుకు తగ్గట్టుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ తిరునల్వేలిలో సోమవారం స్పందించారు.

ఒంటరిగా ఎన్నికల్ని ఎదుర్కొనే బలం బీజేపీకి రాష్ట్రంలో ఉందని వ్యాఖ్యానించారు. 234 స్థానాల్లో అభ్యర్థుల్ని నిలబెట్టి సత్తాను చాటుకోగలమన్నారు. తమకు యాభై లక్షల మంది సభ్యులు ఉన్నారని, ప్రజాదరణ, ప్రధాని మోదీ ప్రభావంతో కమలం వైపు చూసే ఓటర్లు కోట్లాది మంది ఉన్నారని వ్యాఖ్యానించారు. అయితే, రాష్ట్రంలో ఏళ్ల తరబడి సాగుతూ వస్తున్న పాలనలకు స్వస్తి పలికి, మార్పు అన్నది తీసుకురావాలన్న కాంక్ష బీజేపీకి ఉందన్నారు. ఆ మార్పు అన్నది తమ ద్వారానే సాధ్యం అని, అందుకు తగ్గ ప్రయత్నాలు చేశామని, చేస్తున్నామని వ్యాఖ్యానించడం గమనార్హం.

ఢిల్లీలో డీఎండీకే అధినేత విజయకాంత్ సతీమణి ప్రేమలత తిష్ట వేసి బీజేపీ పెద్దలతో పొత్తు భేరాల్లో ఉన్నట్టుగా వచ్చిన వార్తల్ని రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జ్ ప్రకాష్ జవదేకర్ ఖండించారు. డీఎండీకేతో పొత్తు ప్రయత్నాలేవి జరగ లేదని, ఎన్నికల ఇన్‌చార్జ్‌గా ఉన్న తనకు తెలియకుండా నేరుగా ఢిల్లీలో పార్టీ పెద్దల్ని కలిసేందుకు అవకాశాలు లేవన్నారు. ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు తగ్గ కార్యాచరణతో ముందుకు సాగుతున్నామంటూ పొత్తు ప్రయత్నాలు బెడిసి కొడుతుండడంపై సంధించిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇవ్వడం గమనార్హం.

మరిన్ని వార్తలు