యూపీ బీజేపీ సర్కారులో వారికి కూడా చాన్స్‌!

13 Mar, 2017 15:10 IST|Sakshi
యూపీ బీజేపీ సర్కారులో వారికి కూడా చాన్స్‌!

ఉత్తరప్రదేశ్‌లో ఏర్పడనున్న బీజేపీ సర్కారులో ముస్లింలకు కూడా ప్రాతినిధ్యం లభించనుంది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒక్క ముస్లిం అభ్యర్థికి కూడా టికెట్‌ ఇవ్వలేదు. దేశంలో రాజకీయంగా అత్యంత కీలకమైన, అత్యధిక జనాభా కలిగిన యూపీలో 403 స్థానాలకుగాను బీజేపీ 312 స్థానాలు గెలుపొంది.. బంపర్‌ మెజారిటీ సాధించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పెద్దసంఖ్యలో ఉన్న ముస్లింలకు చేరువ కావాలని బీజేపీ భావిస్తున్నది. సంప్రదాయంగా ముస్లింలలో తమకు ఓటుబ్యాంకు లేకపోయినా.. ఆ వర్గానికి చెందిన వారిని ప్రభుత్వంలోకి తీసుకోవాలని యోచిస్తున్నది. ముస్లింలలో ముఖ్యంగా మహిళలు, యువత ప్రధాని మోదీ అభివృద్ధి అజెండాను అంగీకరించి.. తమవైపు మొగ్గుచూపారని కమలనాథులు భావిస్తున్నారు. ట్రిపుల్‌ తలాక్‌ వంటి విషయాలతో ముస్లింలలో కొందరికి చేరువయ్యామన్న భావన కూడా వారిలో ఉంది. ఈ నేపథ్యంలో యూపీలో గణనీయంగా ఉన్న ముస్లింలకు చేరువయ్యేందుకు వారిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

'ఎమ్మెల్యే లేకపోతే ఏమిటి.. ఎమ్మెల్సీ ఉంటారు. ప్రభుత్వంలో ముస్లిం ప్రాతినిధ్యం ఉండి తీరుతుంది' అని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మీడియాతో పేర్కొన్నారు. యూపీలో ఏర్పడే బీజేపీ ప్రభుత్వంలో ముస్లింలకు అవకాశముంటుందని ఆయన స్పష్టం చేశారు.
 

మరిన్ని వార్తలు