మా నాయకుల వైఫల్యం వల్లే: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు | Sakshi
Sakshi News home page

మా నాయకుల వైఫల్యం వల్లే: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

Published Mon, Mar 13 2017 3:07 PM

మా నాయకుల వైఫల్యం వల్లే: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు - Sakshi

పణాజి: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైనందుకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇందుకు పార్టీ అగ్రశ్రేణి నాయకులే కారణమని నిందిస్తున్నారు. 40 స్థానాలున్న గోవాలో కాంగ్రెస్ 17 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రోహన్ కాంటె కూడా కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు.

'గోవాలో అత్యధిక సీట్లు గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. అయితే మా పార్టీ నాయకులు సరైన సమయంలో నిర్ణయం తీసుకోలేకపోయారు. ఫలితాలు వెలువడిన తర్వాత మా నాయకులు అనుసరించిన వైఖరి నన్ను మనస్తాపానికి గురి చేసింది. పార్టీ నాయకులు సరిగా వ్యవహరించలేదు. సీఎల్పీ నాయకుడిని ఎన్నుకోవడంలో ఆలస్యం చేశారు' అని వాల్పోయి నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే విశ్వజిత్ రాణె నిందించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోవడానికి కారణం తమ నాయకులేనని కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే జెన్నిఫర్ మాన్సెరట్టె విమర్శించారు. ప్రజలు తమకు అనుకూలం తీర్పు ఇచ్చారని, దీన్ని గౌరవించడంలో తమ నాయకులు విఫలమయ్యారని, పూర్తిగా వారి తప్పిదమని నిందించారు. ప్రజలు బీజేపీని తిరస్కరించి తమకు అవకాశం ఇచ్చారని, అయితే తమ బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమయ్యామని ఇతరులను నిందించాల్సిన పనిలేదని కాంగ్రెస్ సీనియర్ నేత లారెన్కో అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ దృష్టికి ఈ విషయం రావడంతో అసంతృప్త  ఎమ్మెల్యేలతో మాట్లాడుతానని ఆయన చెప్పారు.

గోవాలో అధికార బీజేపీ 13 సీట్లకే పరిమితం కాగా ఇతరులు 10 సీట్లు గెల్చుకున్నారు. కాగా బీజేపీకి చిన్నాచితక పార్టీల ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వడంతో ఆ పార్టీకి ఎమ్మెల్యేల బలం 22కు పెరిగింది. బీజేపీ ఎమ్మెల్యేలు కోరడంతో అధిష్టానం సూచన మేరకు కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ గోవా ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఇప్పటికే ఆయన గవర్నర్‌ను కలసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. గవర్నర్ ఆహ్వానం మేరకు పారికర్ గోవా సీఎంగా మంగళవారం ప్రమాణం చేయనున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement