వరల్డ్‌క్లాస్‌కు రెడ్ సిగ్నల్

15 Sep, 2015 10:25 IST|Sakshi
వరల్డ్‌క్లాస్‌కు రెడ్ సిగ్నల్

తిరుపతి రైల్వేస్టేషన్ అభివృద్ధికి అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. నాలుగేళ్ల నుంచి ఊరిస్తూ వచ్చిన వరల్డ్‌క్లాస్ హోదాకు రెడ్‌సిగ్నల్ పడింది. ఇప్పుడు మోడ్రన్‌క్లాస్‌కే పరిమితమైంది. అయినా అభివృద్ధి పనులు నత్తనడకన సాగడం విమర్శలకు తావిస్తోంది.
 
తిరుపతి అర్బన్: స్థానిక రైల్వేస్టేషన్ అభివృద్ధికి  అడుగడుగునా ఆటంకాలే ఎదురవుతున్నాయి. ఇప్పటికే వరల్డ్‌క్లాస్ హోదాకు రెడ్‌సిగ్నల్ పడింది. మోడ్రన్ క్లాస్ పనులూ సజావుగా సాగకపోవడం ప్రయాణికులను అసంతృప్తికి గురిచేస్తోంది.  


వరల్డ్‌క్లాస్ హోదా ఎందుకు పోయిందంటే!
తిరుపతి రైల్వేస్టేషన్‌ను వరల్డ్‌క్లాస్‌గా అభివృద్ధి చేయాలని రైల్వేకి చెందిన కమిటీలు భావించాయి. రెండేళ్ల క్రితం తిరుపతి రైల్వే స్టేషన్‌కు చుట్టుపక్కల 20 కి.మీల వరకు ఉన్న అన్ని స్టేషన్లలో స్థలాలను పరిశీలించాయి. తిరుపతికి అతి దగ్గరలోని వెస్ట్ రైల్వేస్టేషన్‌లో అందుబాటులో ఉన్న 52 ఎకరాల రైల్వే స్థలంతో పాటు ఎస్వీయూ, మహిళా యూనివర్సిటీలకు చెంది న మరో 40 ఎకరాల స్థలాలను రైల్వేకి అప్పగిస్తే తాము పనుల ప్రారంభానికి సిద్ధమని అప్పటి రైల్వే బోర్డు అధికారులు ప్రకటించారు.

అయితే తిరుపతి రైల్వేస్టేషన్ పరిసరాల్లోని హోటల్ నిర్వాహకులు కొందరు తమ వ్యాపారాలు దెబ్బతింటాయని భావించి ఎంపీల ద్వారా కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. వెస్ట్‌లో వరల్డ్‌క్లాస్ పనులు జరగనీయకుండా అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో వరల్డ్ క్లాస్ హోదా దాదాపు కనుమరుగైంది.
 
నత్తనడకన మోడ్రన్‌క్లాస్ పనులు
రైల్వేబోర్డు అధికారులు తిరుపతి రైల్వేస్టేష న్‌ను మోడ్రన్‌క్లాస్‌గా తీర్చిదిద్దతామని హామీ ఇచ్చారు. ఆమేరకు నిధులు మంజూరయ్యేలా చూస్తామని పాలకులూ చెప్పారు. నిధుల మాట ఏమోగానీ ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ పనులు చేపట్టలేదు. 60 ఏళ్ల క్రితం నిర్మించిన భవనాల గోడలకే సోకులు అద్దే కార్యక్రమాన్ని చేపట్టారు.
 
సమస్యల కూత
తిరుపతి రైల్వేస్టేషన్ సమస్యలకు నిలయమైం ది. వెయిటింగ్ హాళ్లు, మరుగుదొడ్లు లేవు.  స్టేషన్‌లో ఎలుకల బెడద ఎక్కువ. స్టేషన్ వెలుపల  వాహనాల పార్కింగ్ స్థలం లేదు. ట్రాఫిక్ సమస్యల విలయతాండవం చేస్తోంది.
 
వరల్డ్ క్లాస్ వచ్చి ఉంటే..
బహుళ అంతస్తుల మల్టీప్లెక్స్ కాంప్లెక్స్‌లు వస్తాయి.
ప్రయాణికుల్లోని అన్ని వర్గాలకు అనువుగా హోటళ్లు, సినిమా     థియేటర్లు, షాపింగ్ మాల్స్, అన్ని విధాలా సౌకర్యాలతో కూడిన వాణిజ్య సముదాయాలు ఏర్పాటవుతాయి.
డివిజన్ కేంద్రం ఏర్పాటవుతుంది.
జిల్లాలోని నిరుద్యోగ యువతలో సుమారు 30 వేల మందికి ప్రత్యక్ష, మరో లక్ష మందికి పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
ఉద్యోగులందరికీ సౌకర్యంగా రెస్ట్‌రూమ్‌లు, ప్రయాణికులకు పూర్తి స్థాయిలో వెయిటింగ్ హాళ్లు,
అవసరమైన ప్రతి చోటా మరుగు దొడ్లు, స్నానపు గదులు అందుబాటులోకి వస్తాయి.
పార్కింగ్ సమస్యకు ఫుల్‌స్టాప్ పడుతుంది.
 
 
 మోడ్రన్ క్లాస్‌తో
ప్లాట్‌ఫారాలపై దశాబ్దాల క్రితం వేసిన టైల్స్‌ని  తొలగించి అధునాతన టైల్స్ ఏర్పాటు చేస్తారు.
రిజర్వేషన్ ప్రయాణికులకు సౌకర్యవంతం గా బటన్ సిస్టమ్ పొయెట్ మిషన్ల స్థానంలో టచ్ స్క్రీన్లు ఏర్పాటవు తాయి.
స్టేషన్ ఆవరణలో ఆటోమేటిక్ రిజర్వేషన్ చార్టు  స్క్రోలింగ్ వీడియో సిస్టమ్‌ను అమర్చుతారు.
జనరల్, ప్లాట్‌ఫాం టికెట్ల కోసం ఆటోమేటిక్ వెండింగ్ మిషన్లు ఏర్పాటు చేస్తారు.
సఫాయివాలాలకు (మహిళా స్వీపర్లకు) అధునాతన స్వీపింగ్ కిట్లను అందుబాటులోకి తెస్తారు.
లగేజీ తనిఖీ కోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన స్కానర్‌ను అమర్చుతారు.
లిఫ్ట్‌లు, ప్లాట్‌ఫారాలకు ఎస్కలేటర్లు ఏర్పాటు చేస్తారు.
 
తిరుపతి రైల్వేస్టేషన్ అభివృద్ధి .. తీరుతెన్నులు
 ప్రపంచ స్థాయి అభివృద్ధి ప్రకటన : 2004 సెప్టెంబర్‌లో
 ప్రపంచ స్థాయి అభివృద్ధికి  అవసరమైన స్థలం : 300 ఎకరాలు (రైల్వే ప్యాసింజర్స్ అమినిటీస్ కమిటీ, రైల్వే ఇంజినీరింగ్ అత్యున్నత స్థాయి అధికారుల బృందం ద్వారా మంత్రిత్వ శాఖకు నివేదిక)
 ప్రస్తుత(ఈస్ట్) రైల్వేస్టేషన్ విస్తీర్ణం :  34 ఎకరాలు (ఖాళీస్థలంతో కలిపి)
 వెస్ట్ రైల్వేస్టేషన్‌లో అందుబాటులో ఉన్నది : 52 ఎకరాలు
 ప్రపంచ స్థాయి పనులకు పరిశీలించిన ప్రాంతాలు : పూడి, ఏర్పేడు, చంద్రగిరి రైల్వేస్టేషన్ల పరిసరాలు
 తిరుపతిలోనే అభివృద్ధి చేయాలన్న కారణం : శ్రీవారి దర్శనం  కోసం దేశం నలుమూలల నుంచి వచ్చే యాత్రికుల సెంటిమెంట్ దెబ్బ తినకుండా చూడాలన్న అంశానికి ప్రాధాన్యత ఇవ్వడం.
 వరల్డ్‌క్లాస్ అభివృద్ధికి ఎదురైన ఆటంకాలు : ప్రస్తుత రైల్వేస్టేషన్ పరిసరాల్లోని బడా హోటల్ నిర్వాహకులు తమ  వ్యాపారం దెబ్బ తింటుందని అడ్డుపడ్డారు. వీరికి స్థానిక ప్రజాప్రతినిధులు వత్తాసు పలికారు.

మరిన్ని వార్తలు