ట్రంప్‌ సంచలన నిర్ణయం

26 Jun, 2017 20:13 IST|Sakshi
ట్రంప్‌ సంచలన నిర్ణయం

వాషింగ్టన్‌: అవకాశం చిక్కినప్పుడల్లా ఇస్లాంపై, ముస్లింలపై విరుచుకుపడే డొనాల్డ్‌ ట్రంప్‌ ఆ వర్గానికి సంబంధించి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రంజాన్‌ పర్వదినం సందర్భంగా అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో ముస్లింలకు విందు ఇచ్చే సంప్రదాయానికి చరమగీతం పాడారు.

రంజాన్‌ సందర్భంగా విదేశాంగ శాఖ మంత్రి రెక్స్‌ టిల్లర్సన్‌ ఆదివారం రాత్రి ఒక ప్రకటన చేశారు. అందులో విందు జోలికి పోకుండా కేవలం ‘ముస్లింలకు శుభాకాంక్షల’తోనే సరిపెట్టారు.

అమెరికాలోని ముస్లింలకు రంజాన్‌ విందు ఇచ్చే సంప్రదాయం సుమారు 200 ఏళ్ల కిందట.. థామస్‌ జెఫర్‌సన్‌ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మొదలైంది. జెఫర్‌సన్‌ అనంతరం ఈ సంప్రదాయాన్ని కొందరు అధ్యక్షులు పాటించగా, మరికొందరు పాటించలేదు. అయితే 1990లో బిల్‌క్లింటన్‌ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ‘ముస్లింలకు విందు’పై ప్రత్యేక శ్రద్ధ వహించారు. అప్పటి ఫస్ట్‌ లేడీ హిల్లరీ క్లింటన్‌ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించేవారు. క్లింటన్‌ తర్వాత అధికారంలోకి వచ్చిన రిపబ్లికన్‌ జార్జ్‌ బుష్‌.. ఒకవైపు ఇస్లామిక్‌ దేశాలపై యుద్ధం చేసినా, వైట్‌హౌస్‌లో రంజాన్‌ విందు ఇవ్వడం మాత్రం మానలేదు. బారక్‌ ఒబామా పాలనలోనూ రంజాన్‌ విందు ఘనంగా జరిగేది. 20 ఏళ్లుగా క్రమం తప్పకుండా కొనసాగుతోన్న ఆచారానికి ట్రంప్‌ తూట్లుపొడిచారు.

మరిన్ని వార్తలు