‘ఛత్తీస్’ వెలుగుల వెనుక చీకట్లు!

20 Aug, 2015 01:54 IST|Sakshi
‘ఛత్తీస్’ వెలుగుల వెనుక చీకట్లు!

రాష్ట్రంలో విద్యుత్ కొరతను అధిగమించేందుకు ఛత్తీస్‌గఢ్ నుంచి 1,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోళ్ల కోసం ప్రభుత్వం అక్కడి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఛత్తీస్‌గఢ్ నుంచే మరో 1,000 మె.వా.ను కొనుగోళ్లు చేయాలన్న ప్రతిపాదన సైతం ప్రభుత్వం వద్ద ఉంది. అయితే పరిస్థితులు ‘ఓపెన్ యాక్సెస్’కు మారిన నేపథ్యంలో అక్కడి నుంచి టెండర్లు లేకుండా విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదన్న భావన వ్యక్తమవుతోంది. భవిష్యత్తులో ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ధరలు భారం కానున్నాయి. ఉత్తరాదిన తక్కువ ధరకే విద్యుత్ లభిస్తుండడంతో ఛత్తీస్‌గఢ్ నుంచే ఎందుకు మొగ్గుచూపాలన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
 
టెండర్లు లేకుండా ఆ రాష్ట్రం నుంచి విద్యుత్ కొనుగోలా?
* కాంపిటిటీవ్ బిడ్డింగ్‌కు వెళ్లకపోవడంతో భారీగా చార్జీల భారం
* ఛత్తీస్‌గఢ్‌తో ఎంవోయూపై పునఃపరిశీలన జరపాల్సిన తరుణం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ కొరత ఉన్న సమయంలో ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలన్న ఆలోచన చేసింది. ఇతర ప్రాంతాలతో పోల్చితే.. పొరుగునే ఉన్న ఛత్తీస్‌గఢ్ నుంచి రాష్ట్రానికి విద్యుత్ లైన్ల నిర్మాణానికి వ్యయప్రయాసలు తక్కువ ఉంటాయన్న ఆలోచనే ఇందుకు కారణం. ఛత్తీస్‌గఢ్ నుంచి రాష్ట్రానికి విద్యుత్ లైన్లను నిర్మించాలని అప్పట్లో నిర్ణయం తీసుకుంది. అయితే ఇందుకు రూ.3 వేల కోట్ల ఖర్చు అవుతుందని ట్రాన్స్‌కో తేల్చడంతో ఈ ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకుంది. సీన్ కట్ చేస్తే మొత్తం కథే మారింది.
 
కారిడార్‌పై గ్యారెంటీ లేదు : సొంత లైన్ల నిర్మాణానికి బదులు.. కేంద్ర ప్రభుత్వ సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్(పీజీసీఎల్) నిర్మిస్తున్న వార్దా-డిచ్‌పల్లి-మహేశ్వరం లైన్ల ద్వారా ఛత్తీస్‌గఢ్ నుంచి ‘ఓపెన్ యాక్సెస్’ విధానంలో విద్యుత్ తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లైన్ల నిర్మాణం పూర్తికావడానికి రెండున్నరేళ్లకు పైనే పట్టనుంది. అప్పటి వరకు ఛత్తీస్‌గఢ్ విద్యుత్ రాష్ట్రానికి వచ్చే అవకాశం లేదు. ఈ లైన్‌ను పూర్తిగా తెలంగాణకే కేటాయిస్తారా అంటే.. అందుకు గ్యారెంటీ లేదు. ఈ లైన్ల కోసం ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం కంటే ముందే తమిళనాడు ప్రభుత్వం దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు అవసరాల కోసం దరఖాస్తు చేసుకుంది. నిబంధనల మేరకు ముందు దరఖాస్తు చేసుకున్న వారికే కేటాయింపులు జరగనున్నాయి. దీంతో ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ తీసుకొచ్చేందుకు కారిడార్ లభిస్తుందా అన్నది అనుమానమే.
 
కారిడార్ వస్తే తక్కువ ధరకే కొనొచ్చు..
రెండున్నరేళ్ల తర్వాత ‘ఓపెన్ యాక్సెస్’లో విద్యుత్ కొనుగోలు చేయాలనుకున్నప్పుడు ఛత్తీస్‌గఢ్ నుంచే కరెంటు ఎందుకు కొనుగోలు చేయడం అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఛత్తీస్‌గఢ్ జెన్‌కో నిర్మిస్తున్న ప్రాజెక్టు వ్యయం ఇప్పటికే మెగావాట్‌కు రూ.7 కోట్లు దాటింది. స్థిర, అస్థిర వ్యయాలు, ట్రాన్స్‌మిషన్ చార్జీలు కలుపుకుంటే ఈ ప్రాజెక్టు నుంచి వచ్చే విద్యుత్ వ్యయం యూనిట్‌కు రూ.5పైనే కానుందని అంచనా.

కేవలం రూ.4 నుంచి రూ.4.50 వ్యయంతో విద్యుత్‌ను విక్రయించేందుకు ఉత్తరాదిన పలు విద్యుదుత్పత్తి కేంద్రాలు సిద్ధంగా ఉన్నాయి. కొనుగోళ్లు చేసేవారు లేక వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులు నిరుపయోగంగా మారడంతో ఉత్తరాదిన విద్యుత్ ధరలు భారీగా తగ్గిపోతున్నాయి. ఉత్తర-దక్షిణాది గ్రిడ్‌ల మధ్య కారిడార్ లభ్యత లేకపోవడంతో ఈ విద్యుత్‌ను దక్షిణాదికి తరలించే మార్గం లేకపోవడమే ప్రధాన కారణం. వార్దా-డిచ్‌పల్లి-మహేశ్వరం లైన్లతో ఈ అడ్డంకి తొలగిపోనుంది.

రాష్ట్ర ప్రభుత్వం సొంత కారిడార్ నిర్మాణ ఆలోచనను విరమించుకున్న నేపథ్యంలో... ఛత్తీస్‌గఢ్ నుంచి కాంపిటీటివ్ బిడ్డింగ్ లేకుండా విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరమే లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విద్యుత్ కొనుగోళ్ల కోసం కాంపిటీటివ్ బిడ్డింగ్‌కు వెళ్తే ఛత్తీస్‌గఢ్ కంటే తక్కువ ధరకే విద్యుత్‌ను విక్రయించేందుకు ఉత్తరాది విద్యుత్కేంద్రాలు ముందుకు వచ్చే అవకాశం ఉండడమే ఇందుకు కారణం. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఉత్పత్తి ధరను ఆ రాష్ట్ర ఈఆర్‌సీ నిర్ణయించనుంది. ఆ విద్యుత్‌ను అక్కడి డిస్కంలు కొనుగోలు చేసి తెలంగాణకు అమ్ముతాయి. దీంతో ధరల విషయంలో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఆడిందే ఆట పాడిందే పాట కానుంది.

మరిన్ని వార్తలు