డెల్టాను ఎడారిగా మారుస్తున్న చంద్రబాబు | Sakshi
Sakshi News home page

డెల్టాను ఎడారిగా మారుస్తున్న చంద్రబాబు

Published Thu, Aug 20 2015 1:55 AM

డెల్టాను ఎడారిగా మారుస్తున్న చంద్రబాబు - Sakshi

♦ సాగునీటిని వదలకపోతే ఉద్యమిస్తాం
♦ వైఎస్సార్ సీపీ నాయకులు నాగార్జున, శివకుమార్ హెచ్చరిక

 మారీసుపేట(తెనాలి) : కృష్ణా డెల్టా ప్రాంతానికి సాగునీటిని విడుదల చేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎడారిగా మారుస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున విమర్శించారు. డెల్టా ప్రాంతానికి వెంటనే సాగునీటిని విడుదల చేయాలని కోరుతూ పార్టీ తెనాలి, వేమూరు నియోజకవర్గాల నాయకుల ఆధ్వర్యంలో స్థానిక మార్కెట్ వద్ద బుధవారం సాయంత్రం రాస్తా రోకో నిర్వహించారు.   నాగార్జున మాట్లాడుతూ  డెల్టాకు వచ్చే నీటిని రాష్ట్ర జలవనరుల శాఖమంత్రి దేవినేని ఉమ కృష్ణా జిల్లాలో అడ్డుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు విధానాల వల్ల కృష్ణా డెల్టా ప్రాంతం నాశనమవుతోందన్నారు. 

పార్టీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ డెల్టా ప్రాంతంలోని పొలాలు బీడులుగా మారుతూ దిక్కుతోచని స్థితిలో రైతాంగం ఉన్నారని తెలిపారు. రైతులపై ప్రేమ ఉంటే వెంటనే సాగునీటిని విడుదల చేసి తన నిజాయితీని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. నీటి విడుదలలో జాప్యం జరిగితే సహించేది లేదని, ఉద్యమించడానికి వైఎస్సార్ సీపీ సిద్ధంగా ఉందన్నారు.

 సీఐ అత్యుత్సాహం...
వైఎస్సార్‌సీపీ నాయకులు మార్కెట్ వంతెన వద్దకు చేరుకోగానే త్రీటౌన్ సీఐ వై.శ్రీనివాసరావు రాస్తా రోకో చేస్తే కేసులు బుక్ చేస్తానంటూ బెదిరింపులకు దిగారు.  ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని నాయకులను కోరారు. దానికి వారు అంగీకరించకుండా రాస్తారోకోకు దిగడంతో పట్టణంలోని పోలీసు బలగాలను పిలిపించి బెదిరింపు సంకేతాలను పంపారు. సీఐ వైఖరిపై పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. కార్యక్రమంలో చుండూరు ఎంపీపీ వుయ్యూరు అప్పిరెడ్డి, కౌన్సిలర్ తాడిబోయిన రమేష్, వలివేరు సర్పంచ్ గాదె శివరామకృష్ణారెడ్డి, పార్టీ జిల్లా కార్యదర్శి భీమవరపు సంజీవరెడ్డి, పార్టీ నాయకులు శివనాగేశ్వరరావు, బూరెల దుర్గా, పెరికల కాంతారావు, గాలి అరవింద  తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement