యూపీలో మాజీ ఎమ్మెల్యే కాల్చివేత, ఉద్రిక్తత

19 Jul, 2013 19:55 IST|Sakshi
యూపీలో మాజీ ఎమ్మెల్యే కాల్చివేత, ఉద్రిక్తత

మాజీ ఎమ్మెల్యే, బీఎస్పీ నాయకుడు సర్వేష్ సింగ్ సీపు, మరొక వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు శుక్రవారం ఉదయం కాల్చిచంపారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిరసనకారులు పోలీసులతో ఘర్షణ పడ్డారు. పోలీసు కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించగా, మరో ఆరుగురు ఘర్షణల్లో గాయపడ్డారు. మాజీ ఎమ్మెల్యే సీపుతో పాటు ఆయన వద్దకు ఏదో పనిమీద వచ్చిన నరద్ రాయ్ (40)ని గుర్తుతెలియని దుండగులు ఆయన ఇంటి ఎదుటే కాల్చిచంపినట్లు పోలీసులు తెలిపారు.

హత్య విషయం తెలియగానే సీపు మద్దతుదారులు ఒక్కసారిగా రోడ్లమీదకు వచ్చారు. జియాన్పూర్ పోలీసు స్టేషన్కు చేరుకుని, అక్కడి పోలీసుల నుంచి తుపాకులు లాక్కున్నారు. రాళ్లు విసురుతూ పోలీసు స్టేషన్ను తగలబెట్టేందుకు కూడా ప్రయత్నించారని శాంతిభద్రతల విభాగం ఐజీ ఆర్కే విశ్వకర్మ లక్నోలో తెలిపారు. రెండు వజ్ర వాహనాలు, ఆరు మోటార్ సైకిళ్లను కూడా వారు తగలబెట్టారన్నారు. దీంతో పోలీసులు వారిని అదుపుచేసేందుకు కాల్పులు జరపక తప్పలేదని వివరించారు.

మాజీ ఎమ్మెల్యేతో పాటు ఇద్దరు మరణించినట్లు విశ్వకర్మ చెప్పినా, మూడో వ్యక్తి పోలీసు కాల్పుల్లో చనిపోయాడా.. లేదా అన్నవిషయాన్నిమాత్రం నిర్ధారించలేదు. పాత కక్షల వల్లే ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. సీపు 2012 వరకు సాగరి స్థానం నుంచి సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ఎన్నికల్లో సదర్ స్థానం నుంచి బీఎస్పీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆయన తండ్రి గతంలో ములాయం సింగ్ సర్కారులో కేబినెట్ మంత్రిగా పనిచేశారు.

మరిన్ని వార్తలు