విక్రమ్‌ గౌడ్‌ను కాల్చిందెవరు?

28 Jul, 2017 09:56 IST|Sakshi
విక్రమ్‌ కాల్పుల ఘటనలో పలు అనుమానాలు!

హైదరాబాద్‌ : మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ముఖేష్‌ గౌడ్‌ కుమారుడు విక్రమ్‌ గౌడ్‌పై కాల్పుల ఘటనలో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విక్రమ్‌ గౌడ్‌కు అసలు లైసెన్స్‌ ఆయుధమే లేదని పోలీసులు చెబుతున్నారు. పటిష్టమైన భద్రత ఉన్న ఇంట్లోకి బయటి నుంచి దుండగులు వచ్చినట్లు ఆనవాళ్లు లభించలేదు. అంతేకాకుండా సంఘటనా స్థలంలో భార్యాభర్తలే ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. కాల్పుల సమయంలో ఔట్‌ హౌస్‌లో సెక్యూరిటీ గార్డు ఉన్నట్లు తెలుస్తోంది.

విక్రమ్‌ గౌడ్‌పై కాల్పులు జరిపిందెవరు?. బయట నుంచి ఎవరు రాకుంటే లోపల ఉన్నదెవరు? ఇంట్లోనే ఉన్నవారు కాల్పులు జరిపారా? లేక విక్రమ్‌ గౌడ్‌ ఆత్మహత్యాయత్నం చేసుకున్నారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. దీంతో పోలీసులు ఆ కోణంలో విచారణ జరుపుతున్నారు. ఇక తన ఫిర్యాదులో కూడా విక్రమ్‌ భార్య శిఫాలీ ఎవరిపైనా అనుమానాలు వ్యక్తం చేయలేదు. అలాగే ఘటనా స్థలంలో రక్తం మరకలు తుడిచేయడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  

కాల్పుల గురించి ఇప్పుడే ఏం చెప్పలేం..
కాల్పుల ఘటనపై విచారణ చేస్తున్నామని వెస్ట్‌ జోన్‌ డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు. ‘కాల్పులు జరిగిన సమయంలో ఇంట్లో ఇద్దరు (భార్యభర్తలు) మాత్రమే ఉన్నారు. బయట వ్యక్తులు వచ్చి కాల్పులు జరపటానికి అవకాశాలు లేవు.  కాల్పులకు వాడింది...7.9 ఎమ్‌ఎమ్‌ పిస్తోలుగా అనుమానిస్తున్నాం. ఘటనా స్థలంలో క్లూస్‌ టీమ్‌ ఆధారాలు సేకరిస్తోంది. ఇక కాల్పుల గురించి ఇప్పుడే ఏం చెప్పలేం. విక్రమ్‌ గౌడ్‌కు ఆయుధాల లైసెన్స్ లేదు.

ఇక దాడి ఎలా జరిగిందనే విషయాన్ని విక్రమ్‌ చెప్పలేకపోతున్నారు’ అని డీసీపీ వెల్లడించారు. కాగా విక్రమ్ పలు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  కాల్పుల ఘటనలో గాయపడిన విక్రమ్‌ గౌడ్‌ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాల్పుల్లో విక్రమ్‌ గౌడ్‌ చేయి, పొట్టలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. అతడి శరీరం నుంచి రెండు బుల్లెట్లను వైద్యులు వెలికితీశారు. ప్రస్తుతం విక్రమ్‌ ఆరోగ్యపరిస్ధితి నిలకడగా ఉంది.

ఆధారాలు సేకరిస్తున్న క్లూస్‌ టీమ్‌
మరోవైపు సంఘటనా స్థలంలో క్లూస్‌ టీమ్‌ ఆధారాలు సేకరిస్తున్నారు. షార్ట్‌ వెపన్‌కు సంబంధించి రెండు ఖాళీ బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఘటనా స్థలం నుంచి ఎటువంటి ఆయుధాలు స్వాధీనం చేసుకోలేదని డీసీపీ చెప్పడం గమనార్హం. అలాగే డాగ్‌ స్క్వాడ్‌ కూడా విక్రమ్‌ గౌడ్‌ ఇంటి పరిసరాల్లోనే తచ్చాడినట్లు సమాచారం.

స్నానం చేసి వచ్చేసరికి కాల్పులు: శిఫాలీ
ఈ కాల్పుల సంఘటనపై విక్రమ్‌ గౌడ్‌ భార్య శిఫాలీ మాట్లాడుతూ...‘శ్రావణ శుక్రవారం సందర్భంగా ఉదయమే గుడికి వెళ్లాలనుకున్నాం. నేను స్నానం చేసి వచ్చేసరికి కాల్పులు జరిగాయి. వెంటనే ఆస్పత్రికి తీసుకువచ్చాను.’ అని తెలిపారు. గత తొమ్మిది నెలలుగా ఫిల్మ్‌నగర్‌లో ఉంటున్నట్లు ఆమె పేర్కొన్నారు. కాగా, తమ కుటుంబంలో ఎవరికీ కలహాలు లేవని విక్రమ్‌ బాబాయ్‌ మధు గౌడ్‌ చెప్పారు. కాల్పులకు పాల్పడిన వారు ఎవరో తెలియదని అన్నారు.