‘ఇ-కర్షక్’తో ఎరువుల కష్టాలకు చెక్!

13 Jul, 2015 23:55 IST|Sakshi
‘ఇ-కర్షక్’తో ఎరువుల కష్టాలకు చెక్!

ఖరీఫ్ సీజన్‌లో మీ ఊరికి రావాల్సిన యూరియా దారి మళ్లిందా? వ్యవసాయాధికారులకు తెలిసి కూడా మిన్నకుండి పోయారా? మీకు దక్కాల్సిన ఎరువుల్ని నోరున్నోళ్లు తన్నుకుపోతుంటే చూస్తూ ఊరుకోవాల్సిందేనా? అవసరం లేదు, ఇకపై ఆ పరిస్థితి రాదంటున్నారు ఆంధ్రప్రదేశ్ సహకార శాఖ కమిషనర్, డెరైక్టర్ ఎంవీ శేషగిరి బాబు. ‘ఈ-కర్షక్’తో ఎరువుల కష్టాలకు చెక్ పెట్టొచ్చంటున్నారాయన. అంతేకాదు.. ఏ పొలంలో భూసారం ఎంత? ఎంత ఎరువేశారు? వంటి వివరాలూ తెలుసుకోవచ్చని.. ఇటు ప్రభుత్వానికి, అటు రైతులకూ ఈ- కర్షక్ ఎంతగానో ఉపయోగపడుతుందంటున్నారు.
 
కేంద్ర బడ్జెట్ లెక్కల ప్రకారం ఎరువుల కంపెనీలకు ప్రభుత్వం ప్రతి ఏటా చెల్లిస్తున్న సబ్సిడీ మొత్తం సుమారు రూ. 45 వేల కోట్లు. అందులో మన రాష్ట్ర వాటా దాదాపు రూ. పది వేల కోట్లు. అంత పెద్ద మొత్తంలో సబ్సిడీ చెల్లించి ఎరువుల్ని కొంటున్నా ఎరువుల కోసం ప్రతి ఊళ్లో క్యూలే, కొట్లాటలే. మరేమిటీ దీనికి పరిష్కారం? ఈ ఆలోచనల్లోంచి పుట్టిందే ‘ఎలక్ట్రానిక్-కర్షక్’(ఈ-కర్షక్) విధానం.  రైతుల కష్టాలు, కడగండ్లు, లాఠీచార్జీలతో చలించిన శేషగిరిబాబు మానస పుత్రికే ఈ పద్ధతి.

 ఇదీ ఈ-కర్షక్’ పని తీరు...
 ఊళ్లల్లో ఉండే ఎరువుల షాపులకు మామూలుగా పరిధంటూ ఉండదు. ఎవరైనా రావొచ్చు, ఎంతైనా కొనుక్కోవచ్చు. ఫలితంగా అయిన వాళ్లకు ఆకుల్లో కానివాళ్లకు మూకుళ్లలో... ఈ గడ్డు పరిస్థితిని నివారించి అందరికీ ఎరువుల్ని అందుబాటులోకి తేవాలంటే ఆ షాపులకు నికర పరిధి ఉండాలి. దుకాణం సైజును బట్టి గ్రామాలను, రైతుల సంఖ్యను కేటాయిస్తారు. ఈ వివరాలన్నింటినీ కంప్యూటర్‌లో నమోదు చేసి ఆయా డీలర్లు, వ్యవసాయ విస్తరణాధికారుల మొబైల్ ఫోన్లతో అనుసంధానం చేస్తారు. ఆ షాపు పరిధిని అనుసరించి ఎరువుల్ని సరఫరా చేస్తారు. ఇది జరిగిన వెంటనే ఆ వివరాలన్నీ ఎరువుల వ్యవహారాలను చూసే విభాగం అధికారుల వద్దకు చేరతాయి. వ్యవసాయాధికారులిచ్చే సంకేతం ఆధారంగా ఏయే డీలర్ వద్ద ఎంతెంత సరుకు ఉందో గుర్తించవచ్చు.  రిటైల్ డీలర్లు, మండల, జిల్లా స్థాయి వ్యవసాయాధికారుల మొబైల్ ఫోన్లతో రైతుల వివరాలున్న కంప్యూటర్ సర్వర్లను అనుసంధానం చేసినందున ఎరువులతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ ఎప్పటికప్పుడు సమాచారం చేరుతుంది.

 ఎరువుల వివరాలన్నీ ఒకే చోట..
 రైతు వివరాలు నమోదు చేసేటప్పుడే కిసాన్ కార్డు లేదా ఆధార్ కార్డును కంప్యూటర్‌తో అనుసంధానం చేస్తారు. రైతుకున్న భూమి, నేల స్వరూపం, ఏయే రకం ఎరువులు ఎంతెంత అవసరం, తీసుకున్నారా లేదా? వంటి వివరాలన్నీ తనకు కేటాయించిన షాపుతో పాటు వ్యవసాయాధికారుల వద్ద నమోదై ఉంటాయి. రైతులు దీన్ని బట్టి ఎరువులు కొనుక్కోవచ్చు. మామూలు పరిస్థితుల్లో ప్రతి ఎకరాకు నాలుగున్నర బస్తాల ఎరువు అవసరమవుతుందని ఒక లెక్క. ఒకవేళ ఎవరైనా తనకున్న పొలానికి మించి ఎరువు కొనుక్కుంటే ఇట్టే పసిగట్టేయవచ్చు. ఎందుకు కొనుక్కున్నారో, ఎక్కడ వాడారో తెలుసుకోవచ్చు. ఏదైనా చేలో మోతాదుకు మించి వాడితే దాన్ని కనిపెట్టి రైతుకు అవగాహన కల్పించవచ్చు. తనకు కేటాయించిన దుకాణానికి బదులుగా మరెక్కడైనా రైతు ఎరువు కొనుక్కొని ఉంటే ఆ తర్వాత సరఫరా చేసే సరుకులో సర్దుబాటు చేయవచ్చు. సర్వర్ నుంచి ఎప్పటికప్పుడు ఎస్‌ఎంఎస్ వెళుతుంది. అవసరమైన చోటుకు పంపడం, అవసరం లేని చోటుకు ఆపడం చేయవచ్చు.

 రైతులకేమిటీ ప్రయోజనం?.
 ఏయే డీలర్ వద్ద ఎంతెంత ఎరువు నిల్వలున్నాయో వ్యవసాయ శాఖకు ఎప్పటికప్పుడు తెలుస్తుంది. డీలర్లు ఎరువుల కోసం ఎదురుచూడకుండా వారికిచ్చిన పరిధి మేరకు సరుకు దానంతటదే వస్తుంది. తనకున్న పొలానికి అనుగుణంగా డీలర్ వద్ద సరుకుంటుంది గనుక రైతులు హడావుడి పడాల్సిన అవసరం లేదు. కచ్చితంగా దొరుకుతుందన్న భరోసా ఉన్నప్పుడు సమస్యలు ఎదురుకావు. అతి తక్కువ ఖర్చుతో రూపొందించిన ఈ సాఫ్ట్‌వేర్‌తో రూ. వందల కోట్ల సబ్సిడీ దుర్వినియోగం కాకుండా కాపాడుకోవచ్చు. భూసారం నష్టపోకుండా చూడొచ్చు. భూమి, రైతు, డీలర్లు, షాపులు, ఎరువుల కంపెనీలు, గ్రామాలతో పాటు భూసారం వివరాలన్నీ కూడా ఈ-కర్షక్ వ్యవస్థలో తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది.

 కౌల్దార్లకూ ఎరువులివ్వొచ్చు..
 రుణ అర్హత పత్రాలు కలిగిన కౌలుదారులకు, జాయింట్ లయబిలిటీ గ్రూపులు, రైతు మిత్ర గ్రూపుల్లో ఉండే వారి వివరాలను కూడా కంప్యూటర్‌లో నమోదు చేయవచ్చని శేషగిరిబాబు చెప్పారు. వారి వివరాలు, కౌలుకు తీసుకున్న భూమి ఆధారంగా ఆయా గ్రామాల్లో డీలర్లకు అనుసంధానం చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చని అభిప్రాయపడ్డారు. ఎరువుల బ్లాక్ మార్కెట్‌ను, చట్టవిరుద్ధంగా దాయడాన్ని నివారించవచ్చు. నాబార్డ్ సాయంతో కేవలం రూ. పది లక్షలతో ‘ఈ-కర్షక్’ వ్యవస్థను రూపొందించినట్టు వివరించారు.

 పశ్చిమ గోదావరి నుంచి ప్రస్థానం...
 పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలంలోని 18 ఎరువుల దుకాణాల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టి సత్ఫలితాలను సాధించారు. ఇప్పుడు ఈ-కర్షక్ వ్యవస్థను అన్ని జిల్లాల్లో అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టింది.
 - ఆకుల అమరయ్య, ‘సాక్షి’ ప్రతినిధి
 
 ఎంవీ శేషగిరిబాబు
 
 

మరిన్ని వార్తలు