రుణ మాఫీపై పిల్లిమొగ్గలు ఇంకెన్నాళ్లు?

23 Oct, 2014 05:10 IST|Sakshi
రుణ మాఫీపై పిల్లిమొగ్గలు ఇంకెన్నాళ్లు?

రైతు రుణాల రద్దుపై తెలుగుదేశం ప్రభుత్వం తొలి నుంచీ పిల్లిమొగ్గలు వేస్తూ కాలం వెళ్లబుచ్చుతున్నది. ప్రభుత్వం పనిచేస్తున్నది స్వార్థపూరిత రాజకీయ లబ్ధికోసమే తప్ప, తమ సంక్షేమం కోసం కాదనే విషయం ప్రజలకు బోధపడింది. పూర్తిస్థాయిలో రైతుల రుణ మాఫీ ఇప్పటికి లేదనే విషయం స్పష్టంగా తేలిపోయింది. చంద్రబాబు కట్టుకథలతో రైతాంగాన్ని ఇంకా ఎన్నాళ్లు మభ్యపెడతారు?   
 
 ఆకాశమే హద్దు అన్నట్లుగా ఎన్నికల హామీలను గుప్పించిన తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అధికారమిచ్చారు. నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారం చేపట్టగానే మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా తమ రూ. 87,612 కోట్ల రుణాలన్నీ ఒక్క సంతకంతో మాఫీ అయిపోతాయని, ఇతర వర్గాల ప్రజల మాదిరిగానే, రైతులు కూడా ఆశించారు. అయితే రైతులు అనుకున్నదొకటి. అయ్యింది వేరొకటి. రుణ మాఫీ.. కొత్త రుణాల వితరణ సజావుగా జరిగి ఉంటే పంటలకు బీమా రక్షణ లభించేది. కానీ, ప్రభుత్వ నిర్వాకం పుణ్యమా అని బీమా రక్షణ లేని పరిస్థితుల్లో ఉత్తరాంధ్ర రైతులు నిలువునా మునిగిపోయారు. కల్లబొల్లి మాటలతోనే కాలక్షేపం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం పరిపాలనా పగ్గాలు చేపట్టి 5వ నెల కూడా గడచిపోతున్నది. కొండంత ఆశతో రైతులు ఎదురుచూస్తున్న రుణ మాఫీ విషయం మాత్రం నానాటికీ జటిలమవుతున్నదే తప్ప, నిర్దిష్ట పరిష్కార మార్గమేదీ కనుచూపు మేరలో కనబడటం లేదు.
 
ఇదేనా అపారమైన పాలనానుభవం?
 రైతు రుణాల రద్దుపై తెలుగుదేశం ప్రభుత్వం తొలి నుంచీ ఎన్నో పిల్లిమొగ్గలు వేస్తూ కాలం వెళ్లబుచ్చుతున్న తీరు నయవంచన తప్ప మరొకటి కాదు. ‘‘నిపుణులతో చర్చించి, మాకున్న అపారమైన పరిపాలన అనుభవాన్ని జోడించి మేనిఫెస్టోను రూపొందించాం.. దీనిలో పేర్కొన్న ప్రతి ఒక్క హామీని, పథకాన్ని, ప్రణాళికనూ చిత్తశుద్ధితో అమలుచేస్తాం, ఆచరణలో ఆదర్శంగా నిలుస్తాం..’’ ఇదీ తెలుగుదేశం ఎన్నికల నాటి మాట. ‘అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకంతోనే మీ రుణాలన్నీ మాఫీ అయిపోతాయి.. మీరు బ్యాంకులకు రుణాలు చెల్లించవద్దు..’ అని చంద్రబాబు ఎన్నికల సభల్లో ఊదరగొట్టారు. ఈ మాటలు నమ్మి నట్టేట మునిగిపోయామని క్రమేపీ గాని రైతులకు అర్థం కాలేదు. రుణాల పూర్తి మాఫీ కాదు.. రూ. లక్షన్నర మేరకే.. అదికూడా పంట రుణాలు మాత్రమేనని.. బంగారంపై మహిళలు తీసుకున్న వ్యవసాయ రుణాలు మాత్రమేనని.. అది కూడా రూ.50 వేల మేరకే మాఫీ అని.. ఇంటిలో ఒకరి రుణాలే రద్దని.. ఎన్ని విధాలా ఆంక్షలు విధించాలో అన్నిటినీ తెరపైకి తెచ్చారు.
 
బూటకపు వాగ్దానాల అసలు రంగు బట్టబయలు
 తాను చెప్పినట్లు నడచుకునే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిందని, ఆ మంత్రివర్గంలో తెలుగుదేశం పార్టీ కూడా భాగస్వామిగా ఉందని, రుణమాపీ పెద్ద సమస్య కాదని చంద్రబాబు నమ్మబలికారు. తీరా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కుండ బద్దలు కొట్టినట్లు అసలు సంగతి బయటపెట్టారు. వ్యవసాయ రుణాల మాఫీ కేంద్రానికి సంబంధం లేదని, అసలు రుణ మాఫీ విధానమే మంచి సంప్రదాయం కాదని ఆయన ప్రకటించడంతో రాష్ట్ర రైతాంగం నివ్వెరపోయింది. గతంలో డా. వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన మాట ప్రకారం కేంద్ర ప్రభుత్వ సహకారంతో రుణ మాఫీ చేశారు.
 
 ఎన్నికల వాగ్దానాలను తు.చ. తప్పకుండా అమలుచేశారు. అదేమాదిరిగా చంద్రబాబు నాయుడు కూడా చేస్తాడని అతిగా ఊహించుకున్నారు. కానీ, చంద్రబాబు చేసిన రుణ మాఫీ వాగ్దానంలో విశ్వసనీయత లేదని, ఆనాడు అధికారాన్ని చేజిక్కించుకోవడానికి మాత్రమే హామీ ఇచ్చారని, చంద్రబాబు నాయుడు చేసినవి బూటకపు వాగ్దానాలేనని ఈనాడు వాపోతున్నారు. రుణ మాఫీలో జాప్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు రైతుల దృష్టిని చంద్రబాబు బ్యాంకు వైపు, రిజర్వ్ బ్యాంకు వైపు మళ్లించారు. అయితే, వివిధ పరిణామాల అనంతరం రుణ మాఫీకి సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం, బ్యాంకింగ్ వ్యవస్థలు తోసిపుచ్చాయి. ఒక రాజకీయ పార్టీ ఎన్నికల వాగ్దానాల అమలులో బ్యాంకులు భాగస్వాములు కాలేవని, కాకూడదని నిర్మొహమాటంగా తేల్చి చెప్పాయి.  
 
 ఏది వాస్తవం? ఏది అవాస్తవం?!
 అయినా, ఏదో ఒకటి చెప్పి రైతులను మభ్యపెట్టే ప్రయత్నాలను మాత్రం ప్రభుత్వం ఇప్పటికీ మానుకోలేదు. రైతు సాధికార సంస్థను ఏర్పాటు చేయడం కూడా ఈ కోవలోనిదే. ఇది లిమిటెడ్ లయబిలిటీ కార్పొరేషన్. దీనికి రూ.5 వేల కోట్ల మూల ధనం కేటాయించారు. ఆ మేరకు బాండ్లను విడుదల చేయడం వరకే దీని విధి. రైతులకు 10% వడ్డీతో బాండ్లు ఇస్తామని, రైతులపై ఉన్న రుణభారంలో 20% రుణాన్ని ఈ సంవత్సరం మాఫీ చేసి, రాబోయే 4 ఏళ్లలో 10% వడ్డీతో రైతులకు బాండ్లు ఇవ్వడం ద్వారా రుణ మాఫీని పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చెబుతున్నారు. అయితే, ఇప్పుడు బాండ్లు ఇస్తాం.. 2015 జనవరి తర్వాత రైతులు ఈ బాండ్లను సంస్థకు అందజేస్తే 10% వడ్డీతో పూర్తి నగదు ఇస్తారని వనరుల సమీకరణ కమిటీ అధ్యక్షుడు సుజనా చౌదరి అంటున్నారు. ఏది వాస్తవమో? ఏది అవాస్తవమో భగవంతునికే తెలియాలి.
 
 ఇంకెన్నాళ్లు మభ్యపెడతారు?
రైతు సాధికార సంస్థకు ఏటా కేటాయించే రూ. 5 వేల కోట్లు రుణ బకాయిలపై వడ్డీ(ఏటా రూ.13 వేల కోట్లు) చెల్లించడానికి కూడా సరిపోవు. అలాంటప్పుడు రూ. 87,612 కోట్ల రుణ మాఫీ ఎప్పటికి పూర్తయ్యేను? దీని అర్థం ఏమిటంటే.. రుణ మాఫీ కోసం ఎదురుచూస్తున్న రైతాంగం ఎప్పటికీ రుణ విముక్తులయ్యే అవకాశమే లేదు. కాబట్టి రుణ మాఫీ చేస్తామంటూ ప్రభుత్వం రైతులను ఇంకా మభ్యపెట్టడం తగదు. ఎన్నికల వాగ్దానం మేరకు పూర్తి రుణ మాఫీ చేయడం ఇప్పట్లో జరగదని తేలిపోయింది. అయినా.. కట్టుకథలు చెప్పి రైతాంగాన్ని చంద్రబాబు ఇంకెన్నాళ్లు మభ్యపెడతారు? ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలి. రుణ మాఫీపై అనుసరించదలచిన విధానాన్ని ఇప్పటికైనా స్పష్టం చేయాలి.  
 - ప్రొ. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
  వ్యవసాయ రంగ నిపుణులు

మరిన్ని వార్తలు