రాయల్‌ స్టాగ్‌ రూ.1,050 !

2 Feb, 2018 12:48 IST|Sakshi

వరంగల్‌: మేడారం జాతరలో మద్యం ధరలకు రెక్కలు వచ్చాయి. జాతరలో అధికారికంగా 22 మద్యం షాపులు ఏర్పాటుచేయగా.. యజమానులు సిండికేట్‌ అయి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. సిండికేట్‌ వద్ద భారీ మొత్తంలో అధికారులు మాముళ్లు మాట్లాడుకున్నందునే పట్టించుకోవడం లేదని భక్తులు ఆరోపణలు చేస్తున్నారు. జాతరలోని హోల్‌సేల్‌ షాపుల నిర్వహకులు ఎంఆర్‌పీ రూ. 560 ఉన్న రాయల్‌స్టాగ్‌ బాటిల్‌ను చిరు వ్యాపారులకు రూ. 900 – 950కు ఇవ్వగా వారు రూ.100 కలిపి విక్రయిస్తున్నారు. ఇక ఆఫీసర్స్‌ ఛాయిస్‌ ఎమ్‌ఆర్‌పీ 110 అయితే.. ఇద్దరు చేతులు మారాక రూ.150, బీరు ధర రూ.150 చేరినా అధికారులు పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం విశేషం. 

కొబ్బరికాయ రూ. 40 .. కొత్తిమీర రూ.50 
ములుగు రూరల్‌/వెంకటాపురం(కె): మండలంలోని గట్టమ్మ వద్ద టెండరు దక్కించుకొని దుకాణాలు ఏర్పాటు చేసుకున్న వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు విక్రయాలు నిర్వహిస్తున్నారు. సంబంధిత అధికారులు ఇదంతా చూస్తూ తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. మేడారం జాతరకు వెళ్తున్న భక్తులు గట్టమ్మకు మొక్కులు చెల్లించడం ఆనవాయితీ. ఈ క్రమంలో నెల రోజులుగా భక్తుల సంఖ్యలో పెరిగింది. ఇదే అదనుగా కొబ్బరికాయల దుకాణదారుడు ఉదయం రూ. 40 చొప్పున, సాయంత్రం వరకు రూ.35 చొప్పున విక్రయిస్తున్నాడు. కాగా మేడారం మహాజాతరలో కొత్తిమీర కట్ట రూ.50కు విక్రయిస్తున్నారు. జాతరకు లక్షలాది మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకొని మేకలు, కోళ్లతో మొక్కులు చెల్లిస్తున్నారు. అనంతరం మాంసం కూర వండుకుంటున్నారు. వాటిలో వేసుకునే కొత్తమీర కొనాలం టే ధర భారీగా ఉండటంతో ఆశ్చర్యపోతున్నారు. అయినా తప్పడం లేదని భక్తులు వాపోతున్నారు. 

(కొత్తిమీర విక్రయిస్తున్న వ్యాపారులు )


ఏస్కో కల్లు సారా.. 
మేడారం జాతర అంటేనే కోళ్లు, యాటలు, కల్లు, మందుతో మజా చేసే ఉత్సవం. నాలుగు రోజులపాటు జరిగే జాతరలో చిన్నా, పెద్ద, ఆడ, మగ తేడా లేకుండా అందరూ ఎంజాయ్‌ చేస్తూంటారు.  తొలుత వనదేవతలు శ్రీసమ్మక్క, సారలమ్మను దర్శించుకుంటారు. అనంతరం విడిది చేసే ప్రాంతంలో కోళ్లు, యాటలు కోసుకుని సరదాగా గడుపుతుంటారు. అయితే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మేడారం సమీపంలోని కొంతమంది ప్రజలు చీప్‌లిక్కర్‌ మందు, తాటికల్లు, గుడాలను తీసుకొచ్చి విక్రయిస్తున్నారు.   

మరిన్ని వార్తలు