హార్బర్‌ ఆధునికీకరణకు అంకురార్పణ!

27 Mar, 2023 01:56 IST|Sakshi
విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌

సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం ఫిషింగ్‌ హార్బర్‌లో ఆధునికీకరణ పనులు మొదలయ్యాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రపంచ శ్రేణి ఓడరేవుగా రూపాంతరం చెందబోతోంది. ఇన్నాళ్లూ తగినంతగా నాణ్యతా ప్రమాణాలు, సదుపాయాలు లేకపోవడంతో ఇక్కడ నుంచి చేపలు ఆశించిన స్థాయిలో ఎగుమతులు జరగక చేపలకు మంచి ధర లభించడం లేదు. ఈ నేపథ్యంలో ఈ హార్బర్‌ ఆధునికీకరణకు సాగరమాల పథకంలో పీఎం మత్స్య సమృద్ధి యోజన కింద రూ.151.81 కోట్లు మంజూరైన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ పనులకు ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌ విధానంలో శంకుస్థాపన చేశారు. ఈ నిధులతో హార్బర్‌లోని ప్లాట్‌ఫాంల మరమ్మతులు, రెండు పెద్ద ఎయిర్‌ కండిషన్డ్‌ ఆక్షన్‌ హాలు, మత్స్యకారులకు విశ్రాంతి గదులు, అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌, క్యాంటీన్‌, వాహనాల పార్కింగ్‌, చేపల రిటైల్‌ అమ్మకం షాపులు, నెట్‌ మెండింగ్‌ హాలు, కోల్డ్‌ స్టోరేజిలు, అత్యవసర ఫైర్‌ సబ్‌స్టేషన్‌ వగైరా ఏర్పాటు చేస్తారు. విడిగా ప్యాకింగ్‌ షెడ్‌, ఆటోమేషన్‌, లోడింగ్‌, అన్‌లోడింగ్‌ బే, డార్మిటరీలు, ఫుడ్‌కోర్టు, ఆర్‌వో ప్లాంటు, పెద్ద చేపల ఎగుమతికి వీలుగా కన్వేయర్‌ బెల్ట్‌ వంటివి కూడా అందుబాటులోకి వస్తాయి. చేపలను ఎండబెట్టడానికి 20 మెకానికల్‌, 10 సోలార్‌ డ్రయర్లు, అంతర్గత రోడ్లు ఏర్పాటవుతాయి. హార్బర్‌ ఆధునికీకరణలో కీలకమైన డ్రై నేజీ వ్యవస్థను కూడా మెరుగుపరచనున్నారు.

డీపీఆర్‌లో స్వల్ప మార్పులు

మత్స్యకారులు, బోటు యజమానుల అభ్యర్థన మేరకు డీపీఆర్‌లో స్వల్ప మార్పులు చేశారు. ముందుగా ప్రతిపాదించిన 3,4,5 జెట్టీలకు బదులు జీరో జెట్టీకి సమాంతరంగా ఒక ఫ్లోటింగ్‌ జెట్టీ, చేపల వేలం, ప్యాకింగ్‌ ప్రాంతంలో కట్టడాలను తొలగించి కొత్తగా జెట్టీని నిర్మించనున్నారు. బుక్కా కెనాల్‌ వద్ద ఎఫ్ల్యుయెంట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంటు ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న అసోసియేషన్‌ భవనాల స్థానంలో ఏసీ ఆక్షన్‌ హాళ్లు నిర్మించనున్నారు. అత్యవసరంగా బోట్ల మరమ్మతులకు డాక్‌ ఫెసిలిటీని సమకూరుస్తారు.

మొదలైన ఆధునికీకరణ పనులు

మత్స్యకారులు వలలు కుట్టే నెట్‌ మెండింగ్‌ హాలు, వాటర్‌ ట్యాంకు పనులు, పార్కింగ్‌ ఫెసిలిటీ, అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌, అసోసియేషన్ల ఆఫీసు బేరర్ల భవనాల నిర్మాణ పనులు మొదలు పెట్టారు. ఫ్లోటింగ్‌ జెట్టీలకు త్వరలోనే టెండర్లు పిలవడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆధునికీకరణ పనులు మొదలయ్యాయని, మిగిలినవి దశలవారీగా చేపడతారని జిల్లా మత్స్యశాఖ అధికారి జి.విజయ ‘సాక్షి’కి చెప్పారు. ఏడాదిన్నరలోగా ఆధునికీకరణ పనులను పూర్తి చేయాల్సి ఉందని తెలిపారు.

నెట్‌మెండింగ్‌, వాటర్‌ ట్యాంక్‌, పార్కింగ్‌ పనులకు శ్రీకారం

రూ.151.82 కోట్ల వ్యయంతో మారనున్న రూపురేఖలు

మత్స్యకారుల అభ్యర్థనతో డీపీఆర్‌లో స్వల్ప మార్పులు

త్వరలో ఫ్లోటింగ్‌ జెట్టీల నిర్మాణానికి టెండర్లు

మరిన్ని వార్తలు