ఆధార్‌ కార్డు తీసుకుని ఎన్ని రోజులవుతోంది? కేంద్రం కొత్త నిబంధన తెలుసా?

27 Feb, 2023 17:17 IST|Sakshi

సాక్షి, అమరావతి: ‘ఆధార్‌ కార్డు తీసుకుని పదేళ్లు పూర్తయి.. ఇప్పటికీ అదే అడ్రస్‌లో ఉన్నా మీరు విధిగా మీ ఆధార్‌ కార్డును అదే అడ్రస్‌ ప్రూఫ్‌తో అప్‌డేట్‌ చేసుకోవాల్సిందే’.. అంటూ ఆధార్‌ కార్డుల జారీ సంస్థ యూఐడీఏఐ స్పష్టంచేస్తోంది. ఈ విషయమై ఇప్పటికే అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖలు సైతం రాసింది. ఈ మేరకు ఆధార్‌ కార్డు జారీ చట్టంలోనూ మార్పులు చేస్తూ కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ను కూడా ఇచ్చింది.  ‘ఆధార్‌ను ఇప్పుడు అనేక ప్రభుత్వ సేవలు పొందేందుకు ఉపయోగిస్తున్నారు.

ఆధార్‌ కార్డు బయోమెట్రిక్‌ ప్రామాణీకంతోనే సంబంధిత వ్యక్తి గుర్తింపు రుజువుగానూ మారింది. ఎలాంటి సేవలను పొందాలన్నా ప్రతి ఒక్కరూ తమ తాజా వివరాలను యూ­ఐ­డీ­­ఏఐకు సమర్పించాల్సి ఉంటుంది. పదేళ్ల క్రితం ఆధార్‌ను పొందిన వారు, ఇప్పటికీ అదే చిరునామాలో నివసిస్తున్నందునో, లేదా వారి కుటుంబ సభ్యుల వివరాల్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో దానిని అప్‌డేట్‌ చేయకపోవచ్చు.

కానీ, సరైన ధృవీకరణ పత్రాలను అప్‌లోడ్‌ చేయడం ద్వా­రా వారి చిరునామాను మళ్లీ ధృవీకరించుకోవాలి’.. అంటూ ఆధార్‌ కార్డు జారీలో కేంద్రం కొత్తగా తీసు­కొచ్చిన నిబంధనపై కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖ కార్యదర్శి అలెక్స్‌ కుమార్‌ శర్మ ఇప్పటికే అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖ­లో స్పష్టంచేశా­రు. ఆధార్‌ అప్‌డేట్‌ సమయంలో ప్రతి ఆధార్‌ కార్డుదారు­డు తమ చిరునామా ధృవీకరణ పత్రంతో పాటు ఫొటో ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.  

రాష్ట్రంలో అప్‌డేట్‌ కాని కార్డులు 1.65 కోట్లు.. 
2022 డిసెంబరు 31 నాటికి రాష్ట్రంలో మొత్తం 5,19,98,236 మందికి ఆధార్‌ కార్డులు జారీ అయ్యాయి. అయితే, వీరిలో 1,65,47,906 మంది ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన నిబంధన మేరకు ఆధార్‌కార్డు పొందిన పదేళ్లలో కనీసం ఒక్కసారి తమ అడ్రస్‌ వివరాలను అప్‌డేట్‌ చేసుకోని వారుగా యూఏఐడీఏ గుర్తించింది. రాష్ట్రంలో ఈ కొత్త నిబంధన ప్రకారం ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోని వారు అత్యధికంగా కాకినాడ జిల్లాలో 18 లక్షల మందికి పైగా ఉండగా, అత్యల్పంగా బాపట్ల జిల్లాలో 1.78లక్షల మంది ఉన్నట్లు తేల్చారు.  

ప్రత్యేక క్యాంపులు 
ఆధార్‌ కార్డుల జారీలో ఎప్పటికప్పుడు కొత్తగా వస్తున్న మార్పులకు అనుగుణంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారు సైతం ఆధార్‌ సేవలు పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. బ్యాంకు లేదా ప్రత్యేక ఆధార్‌ కార్డు జారీ కేంద్రాలు ఉండే పట్టణాలతో పాటు ఎంపిక చేసుకున్న 2,377 గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రభుత్వ ఆ ఆధార్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

మరోవైపు.. ఇప్పటి 15 ఏళ్లలోపు, 15–17 ఏళ్ల మధ్య వయస్సున్న వారి బయోమెట్రిక్‌ వివరాల అప్‌డేట్‌ కోసం పాఠశాలలు, జూనియర్‌ కాలేజీల్లో గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రతినెలా ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తోంది. అయితే, కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన నిబంధన ప్రకారం అన్ని వయస్సుల వారు తమ ఆధార్‌ను అప్‌డేట్‌ చేసుకోవడానికి వీలుగా ఆయా సచివాలయాల్లో ఈ నెల 27, 28 తేదీల్లో ప్రత్యేక ఆధార్‌ క్యాంపులు ఏర్పాటుచేయాలని నిర్ణయించినట్లు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అధికారులు వెల్లడించారు.  

ఇక రాష్ట్రంలో గ్రామాల వారీగా పదేళ్ల పూర్తయినా ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోని వారి వివరాలను కూడా గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అధికారులు ఇప్పటికే యూఐడీఏఐ నుంచి సేకరించి, ఆ వివరాలను కూడా జిల్లాలకు పంపినట్లు అధికారులు తెలిపారు.  

మరిన్ని వార్తలు