చింతామణి నాటకంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

27 Aug, 2022 08:36 IST|Sakshi

అందుకు మేం అంగీకరించం 

జీవనభృతి పేరుతో సామరస్యాన్ని దెబ్బతీయకూడదు 

చింతామణి నాటకంపై  తేల్చిచెప్పిన హైకోర్టు 

తదుపరి విచారణ సెప్టెంబర్‌ 26కి వాయిదా

సాక్షి, అమరావతి : భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఓ వర్గం వారిని మరో వర్గం కించపరిచేందుకు అనుమతినిస్తే ఆ వర్గాల మధ్య ఘర్షణలకు ఆస్కారం కల్పించినట్లేనని, అందుకు తాము అంగీకరించబోమని హైకోర్టు స్పష్టం చేసింది. నాటకంలోని పాత్రల పేరుతో ఓ వర్గాన్ని కించపరిచేందుకు అనుమతించబోమని చెప్పింది. జీవనభృతి పేరుతో సామరస్యాన్ని దెబ్బతీయకూడదని స్పష్టం చేసింది.

చింతామణి నాటకం ఒరిజినల్‌ తెలుగు పుస్తకం ఆన్‌లైన్‌ కాపీని ప్రభుత్వ న్యాయవాదులకు, ఆర్య వైశ్య సంఘాల తరఫు న్యాయవాదులకు అందజేయాలని ఎంపీ రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాదిని ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్‌ 26కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.  చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి పాత్ర ద్వారా ఆర్యవైశ్యులను వేశ్యాలోలురుగా చూపుతున్నారని, అందువల్ల నాటకాన్ని నిషేధించాలన్న ఆర్యవైశ్య సంఘాల వినతి మేరకు ప్రభుత్వం ఆ నాటకం ప్రదర్శనపై నిషేధం విధించింది.

దీనిని సవాలు చేస్తూ నర్సాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు, కళాకారుడు త్రినాథ్‌ హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ రెండు వ్యాజ్యాలు శుక్రవారం సీజే ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి. రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాది పీవీజీ ఉమేశ్‌చంద్ర వాదనలు వినిపిస్తూ.. కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయన్న కారణంతో మొత్తం నాటకంపై నిషేధం తగదన్నారు. దీనివల్ల వేలాది కళాకారుల జీవనభృతి దెబ్బతిందని తెలిపారు. వ్యభిచారం కుటుంబ వ్యవస్థను దెబ్బతీస్తుందని చెప్పడమే ఆ నాటకం ప్రధాన ఉద్దేశమని, సుబ్బిశెట్టి పాత్రతో అదే చెప్పించారని ఉమేశ్‌ వివరించారు.

ఓ వర్గం పేరు ప్రతిబింబించేలా మీరెందుకు నాటకం ప్రదర్శిస్తున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఓ వర్గాన్ని మరో వర్గం కించపరిచేందుకు అనుమతినిస్తే పౌర యుద్ధానికి దారి తీస్తుందని తెలిపింది. త్రినాథ్‌ తరఫు న్యాయవాది జడా శ్రవణ్‌కుమార్‌ స్పందిస్తూ, 2002లో ఈ నాటకంపై విధించిన నిషేధాన్ని ఆ తర్వాత హైకోర్టు ఆదేశాలతో తొలగించారని వివరించారు. ఈ నాటకం కల్పితమని, అభ్యంతరకర డైలాగుల్లేకుండా చూడాలని 2002లో ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశిందన్నారు. నాటకం మొత్తంపై నిషేధం వల్ల కళాకారుల జీవనభృతి దెబ్బతిందన్న శ్రవణ్‌ కుమార్‌ వాదనతో ధర్మాసనం విభేదించింది. పూర్తిస్థాయి వాదనల సమయంలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటామంది.

మరిన్ని వార్తలు