తిరుపతి ఉప ఎన్నికపై పిటిషన్ల కొట్టివేత

1 May, 2021 08:09 IST|Sakshi

సాక్షి అమరావతి: తిరుపతి లోక్‌సభ నియోజకవర్గానికి ఈ నెల 17న నిర్వహించిన ఉప ఎన్నికను రద్దుచేసి రీ పోలింగ్‌ నిర్వహించాలని కోరుతూ బీజేపీ అభ్యర్థి రత్నప్రభ, తెలుగుదేశం అభ్యర్థి పనబాక లక్ష్మి వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు శుక్రవారం కొట్టేసింది. ఈ వ్యాజ్యాలకు విచారణ అర్హత లేదని పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ జాయ్‌మాల్యా బాగ్చి, జస్టిస్‌ మంతోజు గంగారావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది.

ఎన్నికల ప్రక్రియలో న్యాయస్థానాల జోక్యంపై అధికరణ 329 కింద నిషేధం ఉందని తెలిపింది. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని పిటిషనర్లు భావిస్తే అందుకు వారు చట్ట ప్రకారం ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. తిరుపతి ఉప ఎన్నికలో అక్రమాలు జరిగాయని, అందువల్ల ఎన్నికను రద్దుచేయాలని కోరుతూ రత్న ప్రభ, పనబాక లక్ష్మి ఈ పిటిషన్లు దాఖలు చేశారు. 

‘పరిషత్‌’ ఎన్నికలపై విచారణ 3కి వాయిదా
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన వ్యాజ్యాలపై విచారణను హైకోర్టు మే 3వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఉప్మాక దుర్గాప్రసాద్‌రావు శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఎన్నికల తేదీకి 4 వారాల ముందు నుంచి ఎన్నికల నియమావళిని అమలు చేయకపోవడం సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమంటూ.. ఎన్నికల ప్రక్రియను ఆపేస్తూ సింగిల్‌ జడ్జి ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ధర్మాసనం ముందు అప్పీల్‌ చేసింది. విచారణ జరిపిన ధర్మాసనం ఎన్నికల నిర్వహణకు అనుమతి ఇచ్చింది. ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి వద్దని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించిన ధర్మాసనం ఈ వ్యాజ్యాలపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని సింగిల్‌ జడ్జిని కోరింది. శుక్రవారం ఈ పిటిషన్లు విచారణకు రాగా న్యాయమూర్తి సోమవారం విచారణ జరుపుతామని తెలిపారు.

చదవండి: ఏసీబీ కస్టడీకి ధూళిపాళ్ల  
ఆర్టీసీ 'డోర్‌ టు డోర్‌' పార్సిల్‌ సర్వీసు

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు