కాలేజీల్లో నాణ్యతకు పెద్దపీట

29 Sep, 2020 04:21 IST|Sakshi
జాతీయ విద్యా విధానంలో భాగంగా రాష్ట్రంలో ఉన్నత విద్యా విధానంపై సోమవారం క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

ఎన్‌ఏసీ, ఎన్‌బీఏ అక్రిడిటేషన్‌ తప్పనిసరి .. మూడేళ్లలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ కాలేజీలు ఈ ప్రమాణాలు సాధించాలి 

ఉన్నత విద్య విధానంపై సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌  

అన్ని కాలేజీలలో రెగ్యులర్‌గా తనిఖీలు చేయాలి 

అడ్వాన్స్‌డ్‌ టాపిక్స్‌తో ఉన్నత విద్య కోర్సులు 

ఇక నుంచి ఏడాది లేక రెండేళ్ల పీజీ ప్రోగ్రాములు 

మూడు లేక నాలుగేళ్ల డిగ్రీ ప్రోగ్రాములు 

నాలుగేళ్ల డిగ్రీ చేసిన వారికి పీహెచ్‌డీలో నేరుగా అడ్మిషన్లు 

కాలేజీల్లో ప్రమాణాలపై ఎస్‌ఓపీ (స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్‌)లు ఖరారు చేయాలి. అన్ని కాలేజీలలో రెగ్యులర్‌గా తనిఖీలు చేసేందుకు 30 మందితో 10 బృందాలు ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా టీచర్‌ ట్రైనింగ్‌  కాలేజీలపై దృష్టి పెట్టాలి. వాటిలో ప్రమాణాలు లేకపోతే నోటీసులు ఇవ్వాలి. అయినా మార్పు రాకపోతే ఆ కాలేజీలను మూసి వేయాలి.
– సీఎం వైఎస్‌ జగన్‌ 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని కాలేజీలు మూడేళ్లలో పూర్తి ప్రమాణాలు సాధించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. తప్పనిసరిగా ఎన్‌ఏసీ, ఎన్‌బీఏ అక్రిడిటేషన్‌ పొందాలని, ప్రభుత్వ కాలేజీలు కూడా ఆ ప్రమాణాలు సాధించాలని స్పష్టం చేశారు. జాతీయ విద్యా విధానంలో భాగంగా రాష్ట్రంలో ఉన్నత విద్య విధానంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం సూచనలు, ఆదేశాలు ఇలా ఉన్నాయి.  

► రాష్ట్రంలోని అన్ని కాలేజీలు వచ్చే 3 ఏళ్లలో నేషనల్‌ బోర్డు ఆఫ్‌ అక్రిడిటేషన్‌ (ఎన్‌బీఏ), నేషనల్‌ అక్రిడిటేషన్‌ కౌన్సిల్‌ (ఎన్‌ఏసీ–న్యాక్‌) సర్టిఫికెట్లు సాధించాలి. అన్ని ప్రభుత్వ కాలేజీలు కూడా తప్పనిసరిగా ఈ గుర్తింపు పొందాలి.  
► ప్రమాణాలు లేని ఇంజనీరింగ్, ఇతర కాలేజీలు అన్నింటికీ నోటీసులు జారీ చేయాలి. మూడేళ్లలో కాలేజీల్లో మార్పు రాకపోతే చర్యలు తప్పవని చెప్పాలి. ప్రమాణాలు పాటించని ఇంటర్మీడియెట్‌ కాలేజీలపై చర్యలు తీసుకోవాలి.  

 ప్రత్యేక బృందాలతో తనిఖీలు 
► బీఈడీ కాలేజీలు కచ్చితంగా ప్రమాణాలు పాటించి తీరాలి. టీచర్‌ ట్రైనింగ్‌ సంస్థల్లో క్వాలిటీ లేకపోతే నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాలి. టీచర్ల శిక్షణలోనే నాణ్యత లేకపోతే వారు పిల్లలకు పాఠాలు ఎలా చెబుతారు? 
► కాలేజీలలో తనిఖీ కోసం నియమించిన బృందాలు శాశ్వత స్వా్కడ్‌ మాదిరిగా ఉండాలి. ప్రమాణాలు, నాణ్యత లేని కాలేజీలకు కొంత సమయం ఇచ్చి వాటిని మార్చుకోమని చెప్పాలి. ఈ తనిఖీల ప్రక్రియ నిరంతరం కొనసాగాలి. 

డిగ్రీ, పీజీ కోర్సుల్లో మార్పులు 
1 ఇక మీదట రాష్ట్రంలో ఏడాది లేదా రెండేళ్ల పీజీ ప్రోగ్రాములు.. మూడు లేదా నాలుగేళ్ల డిగ్రీ ప్రోగ్రాములు ఉంటాయి. ఈ ఏడాది నుంచే అవి ప్రారంభం అవుతాయి. 4 ఏళ్ల డిగ్రీ పూర్తి చేసిన వారికి నేరుగా పీహెచ్‌డీ  అడ్మిషన్లు ఇస్తారు.  
2 వచ్చే ఏడాది నుంచి 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్‌ పీజీ ప్రోగ్రామ్స్, 4 ఏళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ ప్రోగ్రామ్‌ ఉంటుంది. 

అటానమస్‌ కాలేజీల సంఖ్య పెరగాలి 
► విద్యార్థులకు భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఉన్నత విద్యలో అడ్వాన్స్‌డ్‌ టాపిక్స్‌తో కోర్సులు రూపొందించాలి. ఆ దిశలో విద్యార్థులు చదివేలా కృషి చేయాలి.  
► రోబోటిక్స్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్‌ వంటి కొత్త కోర్సులు ప్రారంభించాలి. బీకామ్‌లో సెక్యూరిటీ (స్టాక్‌) అనాలిసిస్, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ వంటి అంశాలు కూడా ఉండాలి.  
► రాష్ట్రంలో దాదాపు 3 వేల కాలేజీలు ఉండగా, వాటిలో 104 మాత్రమే అటానమస్‌గా పని చేస్తున్నందున వీటి సంఖ్య గణనీయంగా పెరగాల్సి ఉంది.  
► జాతీయ అక్రిడిటేషన్‌ సంస్థలతో అనుబంధంగా రాష్ట్రంలో అక్రిడిటేషన్‌ విభాగాన్ని తయారు చేయాలి. విద్యా సంస్థలన్నింటినీ అక్రిడిటేషన్‌ వైపు నడిపించాలి.
► విజయనగరంలో ఇంజనీరింగ్‌ విద్య ఫోకస్‌గా మల్టీ డిసిప్లినరీ వర్సిటీ, టీచర్‌ ఎడ్యుకేషన్‌ ఫోకస్‌గా ఒంగోలు వర్సిటీ ఏర్పాటు.  
► కాలేజీలలో ప్రమాణాలపై ఇప్పటికే దృష్టి పెట్టామని, ఈ దిశగా 200 కాలేజీలకు నోటీసులు ఇచ్చామని అధికారులు సీఎంకు వివరించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌–రీసెర్చ్‌ ఓరియెంటేషన్‌ ప్రధాన లక్ష్యంగా ఈ విద్యా సంవత్సరం నుంచే నాలుగేళ్ల ఆనర్స్‌ డిగ్రీ కోర్సు ప్రారంభిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. (ఇంటర్‌ తర్వాత నాలుగేండ్ల డిగ్రీ కోర్సు పూర్తి చేస్తేనే విదేశాల్లో ఉన్నత చదువుకు అవకాశం ఉంటుంది. ఈ దృష్ట్యా నాలుగేళ్ల ఆనర్స్‌ డిగ్రీ ప్రవేశ పెట్టనున్నారు)  
► ఈ సమీక్షలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నత విద్యా శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సతీష్‌ చంద్ర, ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి, హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ అండ్‌ మానిటరింగ్‌ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ వి.ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా