బండెనక బండి కట్టి..

3 Oct, 2021 03:27 IST|Sakshi

క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ దిశగా కదిలిన చెత్త సేకరణ వాహనాలు

చెత్త రహిత గ్రామాలు, పట్టణాలే లక్ష్యంగా స్వచ్ఛ సంకల్ప కార్యక్రమాలు

ఇళ్ల నుంచి చెత్త సేకరణకు 4,097 వాహనాలు అందజేసిన ప్రభుత్వం

జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

ఆటో రిక్షాలు, దోమల నివారణకు ఫాగింగ్‌ మిషన్లూ సరఫరా

సాక్షి, అమరావతి: గ్రామాలు, పట్టణాల్లో మెరుగైన పారిశుధ్యం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించేందుకు జగనన్న స్వచ్ఛ సంకల్పం నినాదంతో ‘క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌’ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రతి రోజూ ఇళ్లలో పోగయ్యే వ్యర్థాలు, ఇతర చెత్తను రోడ్లపై వేయక ముందే వాటిని గ్రామ పంచాయతీ, మున్సిపల్, నగరపాలక సిబ్బంది సేకరించేలా పారిశుధ్య కార్యక్రమాలకు ప్రభుత్వం పూనుకుంది. ఇందుకోసం మున్సిపాలిటీలు, నగరాలు, గ్రామాల్లో చెత్త సేకరణకు 4,097 వాహనాలను కొనుగోలు చేసింది. శనివారం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడలోని బెంజి సర్కిల్‌ వద్ద జెండా ఊపి ఈ వాహనాలను లాంఛనంగా ప్రారంభించారు.

అంతకు ముందు ఆయన వేదిక వద్ద జాతిపిత మహాత్మా గాంధీ, భారత మాజీ ప్రధాని లాల్‌ బహుదూర్‌ శాస్త్రిల జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలు సమర్పించి నివాళులర్పించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద కూడా నివాళులర్పించారు. అనంతరం క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ కార్యక్రమం సందర్భంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ రూపొందించిన ప్రత్యేక సీడీని ఆవిష్కరించారు. దాదాపు 20 నిమిషాల పాటు ఆ వాహనాలు ఒక్కొక్కటిగా సీఎం ఉన్న వేదిక వద్ద నుంచి ముందుకు సాగాయి.
చెత్త సేకరణ మహిళతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 

చెత్త సేకరణ సిబ్బందితో సీఎం మాటా మంతి 
పంచాయతీ, మున్సిపల్, నగర పాలక సిబ్బంది ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను ప్రభుత్వం వర్మీ కంపోస్టు తయారీ, విద్యుత్‌ ఉత్పత్తికి వినియోగించనుంది. ఈ నేపథ్యంలో చెత్త సేకరణ వాహనాలు, డస్ట్‌బిన్లు, చెత్తను ప్రాసెసింగ్‌ చేసే యంత్రాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ స్వయంగా పరిశీలించారు. క్షేత్ర స్థాయిలో చెత్త సేకరణ విధుల్లో పాల్గొనే కొంత మంది సిబ్బందితో మాట్లాడారు. ఈ కార్యక్రమ నిర్వహణలో  విజయవంతంగా ముందుకు సాగాలని వారి భుజం తట్టారు. కాగా, స్వచ్ఛ సంకల్పంలో భాగంగా ఆటో రిక్షాలు, దోమల నివారణకు ఫాగింగ్‌ మిషన్లు కూడా సరఫరా చేస్తారు.

ఈ కార్యక్రమంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు