ప్రభుత్వ ప్రతిష్టకు ఆస్పత్రులు వన్నెతేవాలి

17 May, 2023 03:53 IST|Sakshi

వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని 

సాక్షి, అమరావతి: వైద్య, ఆరోగ్యరంగం పరంగా రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తున్న మొత్తానికి అనుగుణంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు బాగుండాలని సీఎం జగన్‌ ఆశిస్తున్నారని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. ఆమె మంగళవారం మంగళగిరిలోని వైద్యశాఖ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆస్పత్రిలోకి అడుగుపెట్టగానే రోగికి తాను పొందబోయే సౌకర్యాల గురించిన నాలుగైదు ప్రాధాన్యాంశాల పోస్టర్లను ప్రతి ఆస్పత్రిలో ప్రదర్శించాలని సూచించారు.

రోగి ఆస్పత్రిలో వైద్యం పొందాక డిశ్చార్జి అయినప్పుడు సంతోషంతో ఇంటికి వెళ్లాలని, సేవల పట్ల సంతృప్తి వ్యక్తపరచాలని చెప్పారు. ముఖ్యంగా పారిశుధ్యం విషయంలో చాలా మా­ర్పు­­లు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నా­రు. పారిశుధ్యం, పరిపాలన, ఆస్పత్రుల నిర్వహణ, రోగులకు బలవర్థకమైన ఆహారం పంపిణీ ఇవన్నీ సరిగా అమలవుతున్నదీ లేనిదీ అధికారులు తరచూ చూడాలని చెప్పారు. తనిఖీల్లో అవకతవకలు వెలుగు చూస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రతి ఆస్పత్రిలో మాతాశిశు సంరక్షణ వార్డుల్లో పింక్‌ కలర్‌ కర్టెన్లు ఏర్పాటు చేసి, పాలిచ్చే తల్లులకు తగినంత మరుగు ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మహి­ళా వార్డుల వద్ద క్లోజ్డ్‌ డస్ట్‌బిన్లు ఏర్పాటు చేయాలన్నారు. ఆస్పత్రుల పనితీరుపై కేటాయించే మార్కుల విషయంలో పారదర్శకత ఉండాలని, పనితీరు అన్నివిధాలా బాగున్నప్పుడే మార్కులు ఇవ్వాలని చెప్పారు. ప్రభుత్వ నిధులతో, సీఎస్‌ఆర్‌ సహకారాన్ని తీసుకుని, 16 బోధనాస్పత్రుల్లో ఇన్సినిరేటర్స్‌ ఏర్పాటు చేసి, వ్యర్థాల ప్రక్షాళన చేపట్టాలని సూచించారు. రోగులకు బలవర్ధక ఆహారాన్ని అందించాలన్న లక్ష్యంతో గతంలో రూ.40గా ఉన్న డైట్‌చార్జీలను రూ.80కి పెంచిన నేపథ్యంలో మెనూలో మార్పు రావాలన్నారు.

గిరిజన ప్రాంతాలు, ఒడిశాకు సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాలకు విశాఖ, విజయ­నగరం ఆస్పత్రుల్లో మహాప్రస్థానం వాహనాలను పెంచాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సీటీ, ఎమ్మారై యంత్రాలు ఎలా పనిచేస్తున్నా­యో పరిశీలించాలన్నారు. ఈవెనింగ్‌ క్లినిక్‌లను బోధనాస్పత్రుల్లో పక్కాగా అమలు చేయా­లని చెప్పారు. ఉదయం ఓపీలకు హాజరైన రోగుల వైద్యపరీక్షల ఫలితాల పరిశీలన, ఇతర సేవలను ఈవెనింగ్‌ క్లినిక్‌లలో అందించాలని ఆమె సూచించారు. డీఎంఈ డాక్టర్‌ నరసింహం పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు