సెగ పుట్టిస్తున్న ఎండలు.. చిల్‌ అవుదాం.. పద!

17 May, 2023 03:49 IST|Sakshi

వేసవి విడిదికి సై అంటున్న  భారతీయులు 

దేశీయంగా కశ్మిర్‌ వెళ్లేందుకు ఆసక్తి 

మాల్దీవులు, మారిషస్‌ వంటి ద్వీపాలకు పయనం 

అంతర్జాతీయంగా యూరప్‌కు మొగ్గు 

తాజాగా ‘ఇండియా హాలిడే రిపోర్ట్‌–మే 2023’ వెల్లడి 

సాక్షి, అమరావతి: ఎండలు సెగ పుట్టిస్తున్నాయి. ఫ్యాన్‌ కింద కూర్చున్నా ఉక్కపోతే. ఏసీ వేసుకుంటే కొంతసేపే చల్లదనం. పగలంతా ఇదే తీరు. సాయంత్రం సరదాగా నాలుగడుగులు బయటకు వేద్దామంటే భగ్గుమనే వేడిగాలులు... ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి దగ్గర వేసవి సెలవుల్ని ఏం ఎంజాయ్‌ చేస్తామంటూ.. సుదీర్ఘ ప్రయాణాలకు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం వేసవి ట్రిప్‌లను చూస్తే కరోనా మునుపటి స్థితిని అధిగమించేలా కనిపిస్తున్నాయని ప్రముఖ ట్రావెల్‌ ఏజెన్సీ సంస్థ థామస్‌ కుక్‌ (ఇండియా), ఎస్‌ఓటీసీ ట్రావెల్‌ విడుదల చేసిన ‘ఇండియా హాలిడే రిపోర్ట్‌–మే 2023’ వెల్లడించింది.

పర్యాటకుల ప్రయాణాలు చాలాకాలంగా పెండింగ్‌లో ఉండటంతో ఎక్కువ ఖర్చు పెట్టి విదేశాలకు కూడా వెళ్లేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. మెజార్టీ ప్రజలు సులభంగా ప్రయాణ వీసాలు పొందే దేశాలకే మొగ్గు చూపుతున్నారు.  భారతీయులకు అత్యంత ఇష్టమైన విదేశీ వేసవి విడిది ప్రాంతంగా యూరప్‌ అగ్రస్థానంలో నిలుస్తోంది. స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ దేశాలు ప్రాధాన్య గమ్యస్థానాలుగా ఎక్కువ ట్రావెల్‌ బుకింగ్‌లు చేస్తున్నారు.

సుదూర ప్రయాణాలకు సమయం వెచ్చించలేని పర్యాటకులు థాయ్‌లాండ్, సింగపూర్, మలేషియా, ఇండోనేషియా, దుబాయ్, అబుదాబి, ఒమన్‌తో పాటు  మాల్దీవులు, మారిషస్‌ వంటి ద్వీపాల్లో సేద తీరేందుకు రెక్కలు కట్టుకుని వాలిపోతున్నారు. కొత్తగా జపాన్, దక్షిణ కొరియా పర్యటనలపై కూడా ఆసక్తి పెరిగినట్టు సర్వే నివేదిక చెబుతోంది. విచిత్రంగా అమెరికా కంటే ట్రావెల్‌ బుకింగ్‌లలో 20 శాతం అధికంగా ఆస్ట్రేలియాకు ఉంటున్నాయి. వీసాలు  పొందడంలో ఇబ్బందుల ఫలితంగా అమెరికాకు ట్రావెల్‌ బుకింగ్‌లలో తగ్గుదల కనిపిస్తోంది. 

చల్లని కాశ్మిరానికి ఛలో! 
దేశీయంగా వేసవి పర్యటనలకు అనుకూలమైన గమ్యస్థానంగా కశ్మిర్‌కు మద్దతు లభిస్తోంది. ఆ తర్వాత హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, లద్ధాఖ్, ఈశాన్య ప్రాంతాలు, కేరళ, అండమాన్, గోవాతో పాటు భూటాన్‌కు వెళ్లేందుకు లగేజీలు సర్దేస్తున్నారు.

సర్వేలో మెట్రో, మినీ మెట్రో నగరాలు పుణే, చండీగఢ్, కోయంబత్తూర్, టైర్‌ 2, 3 సిటీలైన జైపూర్, ఇండోర్, తిరుచిరాపల్లి, మధురై, నాగ్‌పూర్, సూరత్, బరోడా, భువనేశ్వర్, లక్నో, మైసూర్, విశాఖపట్నం, గౌహతి, పాటా్నలో ఆన్‌లైన్‌ ద్వారా సర్వే చేశారు. ఇందులో 40 శాతం మంది దేశీయంగా, 60 శాతం మంది విదేశాల్లో పర్యటించేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు వెల్లడైంది.  

మరిన్ని వార్తలు