గోదావరిలో పెరిగిన వరద ఉధృతి 

26 Jul, 2021 02:29 IST|Sakshi
ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలోకి విడుదలవుతున్న గోదావరి మిగులు జలాలు

పోలవరం ప్రాజెక్టు వద్దకు 9.01 లక్షల క్యూసెక్కుల వరద 

ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ 

బ్యారేజీలోకి 10.14 లక్షల క్యూసెక్కుల ప్రవాహం

సాక్షి, అమరావతి/ధవళేశ్వరం: వర్షాల ప్రభావం వల్ల ఎగువన ఉప నదులు ఉప్పొంగుతుండటంతో గోదావరిలో వరద ఉధృతి పెరిగింది. పోలవరం ప్రాజెక్టు వద్ద ఆదివారం సాయంత్రం 6 గంటలకు 9.01 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా.. స్పిల్‌వే వద్ద నీటిమట్టం 32.94 మీటర్లకు చేరింది. 48 గేట్ల ద్వారా అంతే స్థాయిలో ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్దకు 10,14,385 క్యూసెక్కులు చేరుతుండటంతో వరద నీటిమట్టం 11.75 అడుగులు దాటింది. దాంతో ఆదివారం రాత్రి 7.30 గంటలకు బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసి ఉభయ గోదావరి జిల్లాల్లోని లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గోదావరి డెల్టాకు 5,700 క్యూసెక్కులు ఇచ్చి మిగులుగా ఉన్న 10,08,685 క్యూసెక్కులు (87.16 టీఎంసీలు)ను 175 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఆదివారం పరీవాహక ప్రాంతంలో వర్షాలు తెరిపి ఇవ్వడంతో వరద తగ్గుముఖం పడుతోంది.

లంకల్ని చుట్టేస్తున్న వరద
ధవళేశ్వరం బ్యారేజీకి దిగువన కోనసీమలోని లంక గ్రామాలను వరద నీరు చుట్టుముడుతోంది. పి.గన్నవరం మండలం చాకలిపాలెం గ్రామాన్ని ఆనుకుని పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో ఉన్న కనకాయలంక కాజ్‌వే ఆదివారం వరద ఉధృతికి నీట మునిగింది. ప్రజలు ప్రమాదకర పరిస్థితుల్లో రాకపోకలు సాగిస్తుండటంతో అధికారులు పడవలు ఏర్పాటు చేశారు. జి.పెదపూడి రేవులో రహదారి కొట్టుకుపోవడంతో ఊడిమూడిలంక, జి.పెదపూడిలంక, అరిగెలవారిలంక, బూరుగులంక గ్రామాల ప్రజలు పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు. గోదావరి జిల్లాల సరిహద్దున గల అనగారలంక, పెదమల్లంలంక, సిర్రావారిలంక, అయోధ్యలంకలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. 

మరిన్ని వార్తలు