బిరబిరా కదిలొస్తున్న కృష్ణమ్మ

26 Jul, 2021 02:40 IST|Sakshi

శ్రీశైలంలోకి 4.05 లక్షల క్యూసెక్కుల ప్రవాహం 

24 గంటల్లో 27.37 టీఎంసీలు రాక 

తుంగభద్ర డ్యామ్‌ గేట్లు ఎత్తివేత 

సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్‌/బళ్లారి/జూపాడు బంగ్లా: కృష్ణా నదిలో వరద ఉధృతి మరింత పెరిగింది. శ్రీశైలం ప్రాజెక్టులోకి 4.05 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతుండగా.. గడచిన 24 గంటల్లో ప్రాజెక్టులోకి 27.37 టీఎంసీలు చేరాయి. శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రాజెక్టులో 93.58 టీఎంసీలు నిల్వ ఉండగా.. ఆదివారం సాయంత్రం 6 గంటలకు 120.95 టీఎంసీలకు చేరింది. మరోవైపు తుంగభద్ర పరవళ్లు తొక్కుతుండటంతో తుంగభద్ర డ్యామ్‌లోకి 1.81 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. నీటి నిల్వ 88.66 టీఎంసీలకు చేరుకోవడంతో డ్యామ్‌ గేట్లు ఎత్తివేసి దిగువకు 46.5వేల క్యూసెక్కులు వదులుతున్నారు.

ఆదివారం అర్ధరాత్రికి దిగువకు విడుదల చేసే ప్రవాహాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచుతామని తుంగభద్ర బోర్డు వర్గాలు శ్రీశైలం ప్రాజెక్టు అధికారులకు సమాచారం ఇచ్చాయి. శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రంలో తెలంగాణ సర్కార్‌ విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ వదులుతున్న నీటిలో సాగర్‌కు 31,784 క్యూసెక్కులు చేరుతున్నాయి. మూసీ నుంచి పులిచింతల ప్రాజెక్టులోకి 13,800 క్యూసెక్కులు చేరుతుండగా.. తెలంగాణ సర్కార్‌ విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ అంతే స్థాయిలో దిగువకు నీటిని వదిలేస్తోంది. ఆ ప్రవాహానికి కట్టలేరు, మున్నేరు, వైరా వరద తోడవడంతో ప్రకాశం బ్యారేజీలోకి 55,571 క్యూసెక్కులు చేరుతోంది. కృష్ణా డెల్టా కాలువలకు 3,631 క్యూసెక్కులు వదలుతూ.. మిగులుగా ఉన్న 51,940 క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజీ 70 గేట్లను అడుగు మేర ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నామని ఈఈ స్వరూప్‌ తెలిపారు. 

పోతిరెడ్డిపాడు నుంచి నీరు విడుదల
కర్నూలు జిల్లా జూపాడు బంగ్లా మండలంలోని పోతిరెడ్డిపాడు నూతన హెడ్‌ రెగ్యులేటర్‌ 4, 5, 6 గేట్లను అడుగుమేర ఎత్తి 4 వేల క్యూసెక్కుల నీటిని ఆదివారం దిగువకు విడుదల చేశారు. ఈ నీటిని బానకచర్ల నీటి నియంత్రణ సముదాయం నుంచి తెలుగు గంగ కాల్వకు మళ్లిస్తున్నట్టు అధికారులు తెలిపారు.  

మరిన్ని వార్తలు