విశాఖలో ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్‌ ప్రారంభం

11 Mar, 2021 05:28 IST|Sakshi

20 ఎకరాల్లో రూ.133 కోట్లతో ఏర్పాటు

ఢిల్లీ నుంచి ‘వర్చువల్‌’ విధానంలో ప్రారంభించిన కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ

విజయవాడ నుంచి పాల్గొన్న రాష్ట్ర పరిశ్రమల మంత్రి గౌతమ్‌రెడ్డి

రూ.350 కోట్లతో ఎంఎస్‌ఎంఈల అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్టు వెల్లడి 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రూ.350 కోట్లతో సూక్ష్మ, చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమ(ఎంఎస్‌ఎంఈ)ల అభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విశాఖలో 20 ఎకరాల్లో రూ.133 కోట్లతో ఏర్పాటు చేసిన ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్‌ను కేంద్ర ఉపరితల రవాణా, ఎంఎస్‌ఎంఈ శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ బుధవారం ఢిల్లీ నుంచి వర్చువల్‌ సమావేశం ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి విజయవాడ నుంచి పాల్గొన్నారు. ఢిల్లీ నుంచి ఎంఎస్‌ఎంఈ కేంద్ర సహాయమంత్రి ప్రతాప్‌చంద్ర సారంగి, కేంద్ర ఎంఎస్‌ఎంఈ శాఖ కార్యదర్శి బి.బి.స్పెయిన్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేకపాటి మాట్లాడుతూ పారిశ్రామికాభివృద్ధికి ఎంఎస్‌ఎంఈలే వెన్నెముక అని పేర్కొన్నారు. కామన్‌ ఫెసిలిటీ సెంటర్లు, మౌలికాభివృద్ధి కేంద్రాలు, ఫ్లాటెడ్‌ ఫ్యాక్టరీ టెర్మినళ్ల ఏర్పాటు దిశగా ఏపీ ముందడుగు వేస్తోందన్నారు. టెక్నాలజీ సెంటర్ల ద్వారా చిన్న పరిశ్రమలకు మరింత ఊతమివ్వనున్నట్లు తెలిపారు. నౌకా నిర్మాణం, వెల్డింగ్, ఫాబ్రికేషన్, ఉక్కు ఉత్పత్తి, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలున్న నేపథ్యంలో విశాఖలో టెక్నాలజీ సెంటర్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇంజనీరింగ్‌ పరిశ్రమలకు అవసరమైన నిపుణులైన మానవ వనరుల(స్కిల్డ్‌ మ్యాన్‌పవర్‌)ను ఏటా 8,500 మంది చొప్పున రాబోయే ఐదేళ్లపాటు తీర్చిదిద్దడమే ఈ సెంటర్‌ ఏర్పాటు లక్ష్యమని మంత్రి వివరించారు. 

కోవిడ్‌ సమయంలో ఎంఎస్‌ఎంఈలకు అండగా నిలిచాం 
కోవిడ్‌–19 సమయంలో రీస్టార్ట్‌ ప్యాకేజీ ఇచ్చి ఎంఎస్‌ఎంఈలకు అండగా నిలిచామని మంత్రి మేకపాటి చెప్పారు. కరోనా లాక్‌డౌన్‌ వల్ల ఏపీలో ఒక్క పరిశ్రమ కూడా మూతపడకూడదనే లక్ష్యంగా కృషి చేశామన్నారు. 11,238 యూనిట్లకు రూ.905 కోట్ల ప్రోత్సాహక బకాయిలను చెల్లించామని చెప్పారు. లాక్‌డౌన్‌లో పరిశ్రమలకు విద్యుత్‌ చార్జీలను రద్దు చేశామన్నారు. మూడేళ్లలో తిరిగి చెల్లించుకునేలా తక్కువ వడ్డీకి ఎంఎస్‌ఎంఈలకు రుణాలిచ్చేందుకు రూ.200 కోట్లతో నిధి ఏర్పాటు చేశామన్నారు. ‘వైఎస్సార్‌ నవోదయం’ పథకం ద్వారా వన్‌ టైమ్‌ రీ స్ట్రక్చరింగ్‌ విధానంలో ఒకేసారి లక్షకుపైగా యూనిట్లకు రూ.2,807 కోట్ల విలువైన రుణాలను అందించి ఎంఎస్‌ఎంఈల్లో జవసత్వం నింపామని తెలిపారు. సరసమైన ధరకే ఎంఎస్‌ఎంఈలకు భూమిని అందించి రాష్ట్రవ్యాప్తంగా 31 ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీ సత్యవతి, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి, ప్రత్యేక కార్యదర్శి సుందర్, ఎంఎస్‌ఎంఈ సీఈవో పవనమూర్తి తదితరులు ఏపీ తరఫున పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు