ఏపీ మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌: లైవ్‌ అప్‌డేట్స్‌

10 Mar, 2021 19:31 IST|Sakshi

Time: 5:00 PM
ఏపీ మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం ఉంటుందని ఎన్నికల అధికారులు తెలిపారు. 

Time: 4:45 PM  
ఏపీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌ కాసేపట్లో ముగియనుంది. క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం ఉంటుందని ఎన్నికల అధికారులు తెలిపారు. మొత్తం 12 కార్పొరేషన్లు, 71 మున్సిపాలిటీల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియనుంది.

Time: 4:30 PM
ప్రకాశం: అద్దంకి 20వ వార్డులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉదయం టీడీపీ చీఫ్ ఏజెంట్ విషయంలో చిన్న వివాదం జరిగింది. ఈ ఘటన నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి  బూత్ వద్దకు వచ్చాడు. దీంతో వైఎస్ఆర్‌సీపీ ఇంఛార్జ్‌ కృష్ణ చైతన్య కూడా అక్కడ చేరుకున్నారు. రెండు వర్గాల అనుచరులతో నేతలు బూత్ బయట కూర్చొన్నారు. దీంతో పోలీసులు రెండు వర్గాల కార్యకర్తలను దూరంగా పంపుతున్నారు. 

Time: 4:20 PM
మచిలీపట్నం: మచిలీపట్నం 25వ డివిజన్‌లో పోలీసులపై కొల్లు రవీంద్ర దౌర్జన్యానికి పాల్పడ్డాడు. పోలింగ్ బూత్‌ల పర్యవేక్షణకు వెళ్లకూడదని,144 సెక్షన్ అమలులో ఉందని పోలీసులు చెబుతున్నా పోలీసులపై చేయి చేసుకుని ఎస్‌ఐని నెట్టివేశాడు.

Time: 4:00 PM
మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 3 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 53.57 పోలింగ్‌ శాతం నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. మరో గంటలో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ముగియనుంది.

Time: 3:00 PM
రాష్ట్ర వ్యాప్తంగా  మధ్యాహ్నం 3 గంటల వరకు జిల్లాల వారీగా పోలింగ్‌ శాతం
శ్రీకాకుళం- 59.9శాతం
విజయనగరం- 53.31శాతం
► కృష్ణా- 52.87 శాతం
► తూర్పుగోదావరి- 53.08 శాతం 
► కర్నూలు- 48.87 శాతం
 అనంతపురం- 56.93 శాతం
చిత్తూరు- 54.12 శాతం
ప్రకాశం- 64.31 శాతం
► కడప- 56.63 శాతం
► నెల్లూరు- 61.03 శాతం
విశాఖపట్నం- 47.86 శాతం
గుంటూరు- 54.42 శాతం
► పశ్చిమ గోదావరి- 53.68 శాతం

Time: 2:30 PM
అనంతపురం: జిల్లాలోని కదిరి 3వ వార్డులోని పోలింగ్ కేంద్రంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Time: 2:00 PM
టీడీపీ దుశ్చర్య
చిత్తూరు: తిరుపతి 43వ డివిజన్‌లో టీడీపీ దుశ్చర్యకు పాల్పడింది. దొంగ ఓట్లు వేయించేందుకు ప్రయత్నం చేసింది. చివరి నిమిషంలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు గుర్తించి అభ్యంతరం తెలిపారు. ఈ  క్రమంలో ఐదుగురు మహిళలు సహా 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా రామచంద్రాపురం మండలం మొండేడుపల్లికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

మధ్యాహ్నం ఒంటి గంట వరకు 42.84% పోలింగ్‌
మధ్యాహ్నం ఒంటి గంట వరకు జిల్లాల వారీగా పోలింగ్ శాతం
శ్రీకాకుళం: 44.38%
విజయనగరం: 45.10%
విశాఖ: 36.75%
తూర్పు గోదావరి: 53.08% 
పశ్చిమ గోదావరి: 45.51%
కృష్ణా: 41.51%
గుంటూరు: 44.69%
ప్రకాశం: 53.19%
నెల్లూరు: 48.89%
అనంతపురం: 45.42%
కర్నూలు: 40.99%
కడప: 46.02%
చిత్తూరు: 41.28% పోలింగ్

Time: 1:28 PM
ఏయూ హైస్కూల్‌ బూత్ వద్ద ఎమ్మెల్యే వెలగపూడి హల్‌చల్‌

విశాఖపట్నం: ఏయూ హైస్కూల్‌ బూత్ వద్ద టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు హల్‌చల్‌ సృష్టించారు. అనుచరులతో బూత్‌కు వచ్చిన వెలగపూడిని పోలీసులు అడ్డుకున్నారు. గొడవలు సృష్టించడానికే వెలగపూడి వచ్చారంటూ వైఎస్సార్‌సీపీ ఆందోళన చేసింది.  టీడీపీ కార్యకర్తలు.. బూత్‌ వద్ద నినాదాలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వెలగపూడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Time: 1:17 PM
పోలింగ్ ఏజెంట్ల పేరుతో బూత్‌లోనే టీడీపీ నేతలు..

గుంటూరు: నగరంలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. పోలింగ్ ఏజెంట్ల పేరుతో బూత్‌లోనే టీడీపీ నేతలు తిష్ట వేశారు. స్టాల్ గర్ల్స్‌ హైస్కూల్‌ బూత్‌ లోపలే టీడీపీ నేతలు ఉండిపోయారు. టీడీపీ నేతలు బూత్‌లో ఉన్నారంటూ పోలీసులకు వైఎస్సార్‌సీపీ నేతలు ఫిర్యాదు చేశారు.

Time: 12:45 PM
ఓటు వేసిన మంత్రి బొత్స సత్యనారాయణ

విజయనగరం: మంత్రి బొత్స సత్యనారాయణ తన ఓటు హక్కు వినియోగించు​కున్నారు. మహారాజా కళాశాలలోని పోలింగ్‌ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. అనంతరం మాట్లాడుతూ, ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు. మున్సిపల్‌లో విజయం సాధించిన అభ్యర్థులు మరింత బాధ్యతగా పని చేయాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల కమిషన్‌కు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. పట్టణాభివృద్ధికి తమ వంతు కృషి ఎప్పుడూ ఉంటుందన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం 11వ వార్డు పోలింగ్ కేంద్రంలో కుటుంబ సమేతంగా ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Time: 12:37 PM
సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే చాలు: ఎస్‌ఈసీ
విజయవాడ: ఓటు హక్కు వినియోగించుకోవాలని వచ్చే ఓట్లర్ల వద్ద సెల్‌ఫోన్లు ఉన్నప్పటికీ.. ఎటువంటి అభ్యంతరం వద్దని  రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. అధికారులకు సూచించారు. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే చాలని ఎస్‌ఈసీ తెలిపారు.

Time: 12:06 PM
విశాఖలో టీడీపీ దౌర్జన్యం

విశాఖపట్నం: ఆంధ్రా వర్సిటీ హైస్కూల్‌ బూత్‌లో టీడీపీ దౌర్జన్యానికి దిగింది. ఓటింగ్ అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు గొడవ సృష్టించారు. పోలింగ్‌ అధికారులపై టీడీపీ కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు. మహిళలను భయాందోళనలకు గురిచేశారు. టీడీపీ నేత శ్రీ భరత్‌.. అక్రమంగా పోలింగ్ బూత్‌లోకి చొచ్చుకెళ్లారు.

Time: 11:55 AM
రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 11 గంటల వరకు 32.23 శాతం పోలింగ్‌ నమోదైంది. ఎప్పటికప్పుడు మున్సిపల్‌ ఎన్నికల సరళిని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ద్వారా అధికారులు పరిశీలిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద  ఓటర్లు బారులు తీరారు. జిల్లాల వారీగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ శాతం ఇలా..
కృష్ణా జిల్లా- 32.64 శాతం
చిత్తూరు జిల్లా-30.12 శాతం
ప్రకాశం జిల్లా-36.12 శాతం
వైఎస్సార్‌ జిల్లా -32.82 శాతం
నెల్లూరు జిల్లా-32.67 శాతం
విశాఖ జిల్లా-28.50 శాతం
కర్నూలు జిల్లా -34.12 శాతం
గుంటూరు-33.62 శాతం
శ్రీకాకుళం-24.58 శాతం
తూర్పుగోదావరి-36.31శాతం
అనంతపురం-31.36 శాతం
విజయనగరం-31.97 శాతం
పశ్చిమ గోదావరి-34.14

Time: 11:33 AM
ఓటు హక్కు వినియోగించుకున్న గవర్నర్‌ దంపతులు

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతీ పౌరుడూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రథమ పౌరుడిగా బాధ్యతతో తాను ఓటు హక్కును వినియోగించుకున్నానని ప్రజలంతా ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.  

Time: 11:25 AM
టీడీపీ నేత కందికుంట ప్రసాద్ దౌర్జన్యం

అనంతపురం: టీడీపీ నేత కందికుంట ప్రసాద్ దౌర్జన్యానికి తెరలేపారు. 29వ వార్డు పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లకు ప్రలోభాలకు గురిచేస్తున్న టీడీపీ నేతలను అడ్డుకున్న పోలీసులపై కందికుంట దురుసుగా ప్రవర్తించారు. సీఐ మధుసూధన్‌ను  కందికుంట ప్రసాద్‌ దుర్భాషలాడారు.

Time: 11:18 AM
ప్రశాంతంగా సాగుతున్న పోలింగ్‌...

ఎప్పటికప్పుడు మున్సిపల్‌ ఎన్నికల సరళిని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ద్వారా అధికారులు పరిశీలిస్తున్నారు. ఎన్నికల అధికారి, కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఆధ్వర్యంలో ప్రతి పోలింగ్ స్టేషన్ లో నిఘా ఏర్పాటు చేశారు. వెబ్ కాస్టింగ్ ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేశారు. రాష్ట్రంలో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయని ఎన్నికల అధికారి ప్రసన్న వెంకటేష్‌ తెలిపారు. ఓటర్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోందన్నారు. పోలింగ్ కేంద్రాల బయట కూడా కెమెరాలు ఏర్పాటు చేశామని,  ఇప్పటివరకూ ఎటువంటి సంఘటనలు లేవన్నారు. ఎక్కడ చిన్న సంఘటన జరిగినా దగ్గరలో ఉన్న ఎన్నికల, పోలీస్ అధికారులను వెంటనే అలెర్ట్ చేస్తామని ప్రసన్న వెంకటేష్‌ పేర్కొన్నారు.

Time: 11:08 AM
ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రులు

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పేర్ని నాని, విశాఖ జిల్లా భీమిలి నేరెళ్లవలసలో అవంతి శ్రీనివాస్‌, వైఎస్సార్‌ జిల్లా కడప 29వ డివిజన్‌లో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 53వ డివిజన్‌లో వెల్లంపల్లి శ్రీనివాస్‌, ప్రకాశం జిల్లా ఒంగోలు 34వ డివిజన్‌లో బాలినేని శ్రీనివాస్‌రెడ్డి తమ ఓటు హక్కులను వినియోగించుకున్నారు.

Time: 11:02 AM
రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 9 గంటల వరకు 13.23 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 9 గంటల వరకు జిల్లాల వారీగా పోలింగ్‌ శాతం ఇలా...
కృష్ణా జిల్లా- 13 శాతం
చిత్తూరు-9 శాతం
ప్రకాశం-14 శాతం, 
వైఎస్సార్‌ జిల్లా- 8 శాతం
నెల్లూరు జిల్లా 12 శాతం
విశాఖ జిల్లా- 14 శాతం
కర్నూలు జిల్లా- 11 శాతం
గుంటూరు జిల్లా 16 శాతం
శ్రీకాకుళం 10 శాతం
తూర్పుగోదావరి- 16 శాతం
పశ్చిమగోదావరి-16 శాతం
అనంతపురం-12 శాతం
విజయనగరం-14 శాతం

Time: 10:51 AM
జనసేన, టీడీపీ ఘర్షణ

గుంటూరు: సత్తెనపల్లి 7వ బూత్‌ వద్ద జనసేన, టీడీపీ మధ్య ఘర్షణ నెలకొంది. టీడీపీ మద్దతు అభ్యర్ధి భర్తపై జనసేన కార్యకర్తల దాడి చేశారు. అయితే ఎల్లో మీడియా మాత్రం.. వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు దాడికి దిగారు అంటూ దుష్ప్రచారం చేస్తోంది.

టీడీపీ నేతల దౌర్జన్యం

చిత్తూరు: తిరుపతి 15వ డివిజన్‌లో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. వైఎస్సార్‌ సీపీ అభ్యర్ధి భర్తను దుర్భాషలాడారు. ఓటు హక్కు లేని టీడీపీ నేతలు కూడా పోలింగ్ కేంద్రానికి రావడాన్ని ప్రశ్నించడంతో ఈ విధంగా వైఎ‍స్సార్‌ సీపీ నేతలపై అక్కసు వెళ్లగక్కారు.

బీజేపీ నగదు పంపిణీ!
తూర్పు గోదావరి: రామచంద్రపురంలో బీజేపీ అభ్యర్ధి తరఫున నగదు పంపిణీ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఓటర్ లిస్ట్‌తో పాటు రూ.37వేలు స్వాధీనం చేసుకున్నారు. డబ్బు పంపిణీ చేస్తున్న ఏడుగురిపై కేసు నమోదు చేశారు.

Time: 9:57 AM
రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 9 గంటల వరకు 13.23 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద  ఓటర్లు బారులు తీరారు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాలను ఎప్పటికప్పుడు అధికారులు పరిశీలిస్తున్నారు. రాష్ట్రంలోని 12 నగరపాలక సంస్థలు, 71 పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో ఎన్నికల పోలింగ్‌ జరుగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది.

ఉదయం 9 గంటల వరకు పోలింగ్‌ శాతం..
శ్రీకాకుళం జిల్లా: ఇచ్చాపురం-7.59 శాతం, పలాస - కాశీబుగ్గ- 10.81 శాతం, పాలకొండ- 6.74 శాతం

పశ్చిమగోదావరి: జంగారెడ్డిగూడెం- 15.51 శాతం, కొవ్వూరు-17.48 శాతం, నరసాపురం- 5.51 శాతం, నిడదవోలు-13.52 శాతం

కృష్ణా జిల్లా: మచిలీపట్నం- 12 శాతం, నూజివీడు-10 శాతం, పెడన-  16 శాతం, కృష్ణా: తిరువూరు-17 శాతం

ప్రకాశం జిల్లా: ఒంగోలు- 14 శాతం, కనిగిరి- 16 శాతం, గిద్దలూరు-14 శాతం, చీరాల- 11 శాతం, అద్దంకి-  20.26 శాతం

వైఎస్సార్‌ జిల్లా: కడప-4 శాతం, రాయచోటి-14 శాతం, మైదుకూరు- 15 శాతం, బద్వేల్  12 శాతం, ప్రొద్దుటూరు- 9 శాతం

కర్నూలు జిల్లా: నంద్యాల  9.8 శాతం, ఆదోని- 8.86 శాతం, ఎమ్మిగనూరు- 16.45 శాతం, డోన్‌-11.96 శాతం, ఆత్మకూరులో 17.51 శాతం, ఆళ్లగడ్డ- 21.28 శాతం, నందికొట్కూరు 13.39 శాతం

Time: 9:21 AM
ఎల్లో మీడియా దుష్ప్రచారం
విజయవాడ: 8వ డివిజన్‌లో టీడీపీ కార్యకర్తపై దాడి అంటూ ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. వైఎస్ఆర్‌సీపీ అభ్యర్ధి భర్త దాడి చేశాడంటూ ఎల్లో మీడియా దుష్ప్రచారానికి ఒడిగట్టింది. ఓటర్లను ప్రభావితం చేసేందుకు టీడీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. వారి ప్రలోభాలను వైఎస్సార్‌సీపీ అభ్యర్థి భర్త అడ్డుకున్నారు.

Time: 9:21 AM
సంతృప్తికరంగా భద్రతా ఏర్పాట్లు: ఎస్‌ఈసీ

విజయవాడ: ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ అన్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారని, భద్రతా ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఓటింగ్ శాతం గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నానన్నారు. గతంలో కంటే ఈసారి ఓటింగ్ శాతం ఎక్కువగా చూస్తామని.. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎస్‌ఈసీ పిలుపునిచ్చారు.

Time: 9:12 AM
ఓటు హక్కును వినియోగించుకున్న పవన్‌ కల్యాణ్‌

విజయవాడ: తూర్పు నియోజకవర్గం పటమట లంక  కొమ్మా సీతారామయ్య జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో పోలింగ్‌ బూత్‌లో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతపురం జిల్లా కదిరిలో ఎమ్మెల్యే సిద్దారెడ్డి దంపతులు, గుంటూరు హిందూ కాలేజీలో ఎమ్మెల్యే మద్దాల గిరి దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Time: 8:40 AM
పోలింగ్‌ ప్రక్రియను పరిశీలించిన ఎస్‌ఈసీ
విజయవాడ: రాష్ట్రంలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఓటింగ్ సరళి పరిశీలనలో భాగంగా విజయవాడలోని బిషప్ గ్రేసి హైస్కూల్, సీవీఆర్ పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్ కుమార్  పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ఏ ఎండి ఇంతియాజ్‌తో కలిసి సీవీఆర్ స్కూల్లో మోడల్ పోలింగ్ కేంద్రాన్ని కూడా ఎస్ఈసీ పరిశీలించారు. వృద్ధులు, యువకులు, మహిళా ఓటర్లతో ఆయన మాట్లాడారు. పోలింగ్, క్యూ లైన్లపై ఓటర్ల స్పందన అడిగి తెలుసుకున్నారు ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎస్‌ఈసీ విజ్ణప్తి చేశారు. ఓటు  వేయడానికి 75 సంవత్సరాల టంకాశాల సుబ్బమ్మను ఆయన అభినందించారు. మీ లాంటి వారే సమాజానికి స్ఫూర్తి అని ఎస్‌ఈసీ అన్నారు.

Time: 8:08 AM
ఓటు హక్కు వినియోగించుకున్న ఎంపీ విజయసాయిరెడ్డి

విశాఖపట్నం: మారుతీనగర్ పోలింగ్ బూత్‌లో ఎంపీ విజయసాయిరెడ్డి సతీసమేతంగా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి 50వ నంబర్‌ పోలింగ్ బూత్‌కి వచ్చిన ఎమ్మెల్యే.. గంటసేపు క్యూలో నిల్చుని ఓటు వేశారు..

Time: 7:55 AM
తిరుపతిలో టీడీపీ ఏజెంట్ ఓవరాక్షన్

తిరుపతి: తిరుపతి 50వ డివిజన్‌లో సైకిల్ గుర్తులు ఉన్న షర్ట్ వేసుకుని వచ్చిన టీడీపీ ఏజెంట్ ధనరాజ్ ఓవరాక్షన్ చేశారు. ధనరాజ్‌ను గుర్తించిన వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి అనిల్‌కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైకిల్ గుర్తుల షర్టు వేసుకొచ్చిన ఏజెంట్‌పై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి కోరారు.

Time: 7:34 AM
ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి

అనంతపురం: 
అనంతపురం: మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని నెహ్రూ మున్సిపల్ పాఠశాలలోని పోలింగ్‌ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసి మున్సిపల్ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచాలని ఆయన పిలుపునిచ్చారు.

విజయనగరం: కణపాక యూత్ హాస్టల్ లోని  పోలింగ్‌ బూత్ లో విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని, స్వేచ్ఛగా తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

Time: 7:23 AM
ఏపీ వ్యాప్తంగా మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాల వద్ద  ఓటర్లు బారులు తీరారు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాలను ఎప్పటికప్పుడు అధికారులు పరిశీలిస్తున్నారు. రాష్ట్రంలోని 12 నగరపాలక సంస్థలు, 71 పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో ఎన్నికల పోలింగ్‌ జరుగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది.

Time: 7:05 AM
12 నగరపాలక సంస్థలు, 75 పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్‌ జారీ చేయగా.. వైఎస్సార్‌ జిల్లా పులివెందుల, చిత్తూరు జిల్లా పుంగనూరు, గుంటూరు జిల్లా  పిడుగురాళ్ల, మాచర్ల పురపాలక సంఘాల్లో అన్ని వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దాంతో ఆ నాలుగు పట్టణాల్లో పోలింగ్‌ నిర్వహించాల్సిన అవసరం లేకుండాపోయింది. ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికలను యథాతథంగా నిర్వహించేందుకు హైకోర్టు అనుమతించడంతో సందిగ్ధత తొలగిపోయింది. వివిధ మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ఏకగ్రీవమైన వార్డులు పోనూ మొత్తం 2,214 వార్డులు/డివిజన్లలో 7,549 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొత్తం 77,73,231 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు జరగనుంది. అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు.

జిల్లాకో నోడల్‌ అధికారి పర్యవేక్షణ
ఎన్నికలను సక్రమంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. పోలింగ్‌ ప్రక్రియను సక్రమంగా పూర్తి చేసేందుకు అన్ని చర్యలు చేపట్టింది. ఎన్నికలను పర్యవేక్షించేందుకు జిల్లాకు ఓ నోడల్‌ అధికారి చొప్పున ప్రత్యేకంగా నియమించింది. ఓటర్ల ఫొటోలతో కూడిన ఓటర్‌ స్లిప్పుల పంపిణీ పూర్తయ్యింది. సకాలంలో పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రాల జారీని పూర్తి చేసింది. పోలింగ్‌ నిర్వహణకు అవసమైన బ్యాలెట్‌ పత్రాలు, బ్యాలెట్‌ బాక్సులు, ఇతర సామగ్రిని పోలింగ్‌ సిబ్బందికి మంగళవారం పంపిణీ చేశారు. వారిని ప్రత్యేక వాహనాల్లో పోలింగ్‌ కేంద్రాలకు తరలించారు. పోలింగ్‌ కేంద్రాల్లో విద్యుత్, తాగునీరు, టాయిలెట్లు, ఇతర సౌకర్యాలు కల్పించారు. వైద్య సిబ్బందిని సైతం అందుబాటులో ఉంచారు. 

పోలింగ్‌కు పటిష్ట ఏర్పాట్లు
పోలింగ్‌ సందర్భంగా అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ప్రభుత్వం పటిష్ట ఏర్పాట్లు చేసింది. సున్నిత, అత్యంత సున్నితమైన పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి ఆ ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉంది. మొత్తం 7,915 పోలింగ్‌ కేంద్రాల్లో 4,788 పోలింగ్‌ కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. వాటిలో 12 నరగపాలక సంస్థల పరిధిలో 2,468 (1,235 సున్నితమైనవి, 1,233 అత్యంత సున్నితమైనవి) ఉన్నాయి. 71 పురపాలక సంఘాలు /నగరపాలక సంస్థల పరిధిలో 2,320 (సున్నితమైనవి 1,151, అత్యంత సున్నితమైనవి 1,169) ఉన్నట్టు గుర్తించారు. వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా పోలింగ్‌ తీరును పర్యవేక్షించనున్నారు. సునిశిత పరిశీలనలకు మైక్రో అబ్జర్వర్లను నియమించడంతోపాటు పోలింగ్‌ ప్రక్రియను ఫొటోలు, వీడియోలు తీయనున్నారు. పట్టణ ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని పురపాలక శాఖ కోరింది. 

పోలింగ్‌ నిర్వహణకు రూ.30 కోట్లు
ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం 48,723 మంది అధికారులు, సిబ్బందిని ప్రభుత్వం నియమించింది. వారికి  పారితోషికం, ఇతర వ్యయం కోసం రూ.30 కోట్లు విడుదల చేసింది. జోనల్‌ అధికారులు, రూట్‌ అధికారులు, సెక్టోరల్‌ అధికారులు ఒక్కొక్కరికీ రోజుకు రూ.1,500, ప్రిసైడింగ్‌ అధికారులు, కౌంటింగ్‌ సూపర్‌వైజర్లకు రోజుకు రూ.350 చొప్పున చెల్లిస్తారు. పోలింగ్‌ అధికారులు, కౌంటింగ్‌ అసిస్టెంట్లకు రోజుకు రూ.250, ఆఫీసు సబార్డినేట్లకు రోజుకు రూ.150, పోలింగ్‌ కేంద్రాలు, కౌంటింగ్‌ కేంద్రాల్లో అధికారులు, సిబ్బందికి మధ్యాహ్న భోజనం, అల్పాహారం నిమిత్తం ఒక్కొక్కరికి రోజుకు రూ.150 చొప్పున చెల్లిస్తారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు