మహానటి.. దాతృత్వ దివిటీ

6 Dec, 2020 04:42 IST|Sakshi
శ్రీమతి సావిత్రి గణేశన్‌ హైసూ్కల్‌ (ఇన్‌సెట్‌లో) పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సావిత్రి విగ్రహం

గుంటూరు తీరంలో సావిత్రి అడుగు జాడలు నేటికీ సజీవమే

వడ్డివారిపాలెం పాఠశాలతో పెనవేసుకున్న బంధం

నేడు మహానటి సావిత్రి జయంతి

రేపల్లె రూరల్‌ (గుంటూరు): ఆమె వెండి తెర సామ్రాజ్ఞి.. నిజ జీవితంలో మహా దాతృత్వం ఉన్న మహా మనీషి. తమిళ సీమలోనూ ‘నడిగర్‌ తిలగమ్‌’ (మహానటి) బిరుదాంకితురాలైన ఆమె దానధర్మాలు చేయటంలో చేతికి ఎముక లేదనే కీర్తి గడించారు. ఆమె పేరు వింటేనే గుంటూరు జిల్లా తీరం పులకించిపోతుంది. తీరంలోని కుగ్రామమైన వడ్డివారిపాలెం ఆమె తలంపు వస్తేనే మైమరచిపోతుంది. ‘గొప్ప వాళ్లను గౌరవించాలి.. గొప్పవాళ్లు సైతం సావిత్రమ్మను గౌరవించాలి’ అనేంత ఖ్యాతిని మాత్రమే చివరికి మిగుల్చుకున్న మహానటి సావిత్రి అడుగు జాడలు, ఆమె జ్ఞాపకాలు గుంటూరు జిల్లాలో నేటికీ సజీవమే. పేదరికంలో పుట్టి.. పేదరికంలోనే పెరిగి.. అనేక ఒడుదొడుకులు ఎదుర్కొన్న సావిత్రిని.. సాటి వారికి సాయం చేయడంలోనే సంతృప్తి, పరమార్థం ఉందని గ్రహించిన మహావ్యక్తిగా ఇక్కడి వారు కొలుస్తారు.

గుంటూరు తీరంతో అనుబంధం
సావిత్రి తల్లి సుభద్రమ్మ, పెద్దమ్మ దుర్గాంబలది వడ్డివారిపాలెం గ్రామమే. తల్లి సుభద్రమ్మకు తాడేపల్లి మండలం చిర్రావూరు గ్రామానికి చెందిన నిశ్శంకర గురవయ్యతో వివాహమైంది. పెద్దమ్మ దుర్గాంబకు కొమ్మారెడ్డి వెంకట్రామయ్య చౌదరితో వివాహమైంది. వడ్డివారిపాలెం గ్రామంలో పాఠశాల లేకపోవటంతో పెద్దమ్మ దుర్గాంబ కోరికతో తల్లిదండ్రుల జ్ఞాపకార్థం సావిత్రి గ్రామంలో స్థలాన్ని కొనుగోలు చేసి.. రూ.25 వేలు విరాళంగా ఇచ్చి.. 1962లో పాఠశాలను నెలకొల్పారు. పాఠశాల అభివృద్ధికి అనేక పర్యాయాలు సహకారం అందించారు. ఆ పాఠశాల ప్రభుత్వ గుర్తింపు పొందిన తరువాత కొన్ని కారణాల వల్ల ఉపాధ్యాయులకు వేతనాలు అందడంలో ఆలస్యం జరుగుతుండేది. దీనివల్ల ఉపాధ్యాయులు ఎన్నో ఇబ్బందులు పడేవారు. 1975లో ప్రభుత్వం నుంచి గ్రాంట్‌ రాకపోవటంతో ఆరు నెలలైనా ఉపాధ్యాయులకు జీతాలు అందని పరిస్థితులు నెలకొనగా.. సావిత్రి రూ.1,04,000 చెక్కు పంపించారు. అప్పట్లో రూ.1,04,000 అంటే ఇప్పుడు దాని విలువ రూ.కోటికి పైనే ఉంటుంది. ఇలా ఎన్నోసార్లు ఉపాధ్యాయులకు సావిత్రి చేసిన మేలు, పాఠశాల అభివృద్ధికి అందించిన విరాళాలు విద్యారంగంపై ఆమెకు ఉన్న మక్కువకు నిదర్శనాలు. 

అదే సంకల్పంతో ముందుకు..
ఏ సంకల్పంతో సావిత్రి పాఠశాలను స్థాపించారో.. ఆ సంకల్పం దిశగానే శ్రీమతి సావిత్రి జెమినీ గణేశన్‌ హైసూ్కల్‌ పరుగులు పెడుతోంది. ఉపాధ్యాయుల కృషితో పదేళ్లుగా ఈ పాఠశాల నూరు శాతం ఫలితాలు సాధిస్తోంది.  తైక్వాండో, షటిల్, కబడ్డీ, ఖోఖో వంటి క్రీడల్లోనూ ప్రతిభ చాటుతున్నారు. ఈ పాఠశాలలో చదివిన వారెందరో ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు. సావిత్రి జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించిన ‘మహానటి’ చిత్ర నిర్మాతలు ప్రియాంకదత్, స్వప్నదత్, దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఈ పాఠశాలను సందర్శించి.. ఇతర గ్రామాల నుంచి వచ్చే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా బస్సును ఏర్పాటు చేశారు. దీనిని సావిత్రి కుమార్తె  విజయ చాముండేశ్వరి చేతుల మీదుగా ప్రారంభించారు.

నాడు–నేడు పనులతో మరింత అభివృద్ధి
శ్రీమతి సావిత్రి గణేశన్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఇటీవల నాడు–నేడు కార్యక్రమానికి ఎంపికైంది. పాఠశాల అభివృద్ధికి రూ.42 లక్షల నిధులు మంజూరు కాగా.. తరగతి గదుల మరమ్మతులు, విద్యుదీకరణ పనులు, మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీటి ఏర్పాటు, బ్లాక్‌ బోర్డుల ఏర్పాటు పనులు శరవేగంగా సాగుతున్నాయి.

నాణ్యమైన విద్య అందిస్తున్నాం
మహానటి సావిత్రి దాతృత్వంతో ఏర్పాటైన పాఠశాలలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాం. ఉపాధ్యాయులంతా నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. విద్యార్థులు క్రీడల్లోనూ రాణిస్తున్నారు. ప్రభుత్వం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తోంది.     
– మట్టా జ్యోత్స్న, హెచ్‌ఎం  

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు