15న డిజిటల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్చ్సేంజ్‌ ప్రారంభం

23 Jul, 2021 03:29 IST|Sakshi

ప్రతి జిల్లాలో నెలకు రెండుసార్లు మెగా జాబ్‌మేళా 

మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి    

సాక్షి, అమరావతి: వచ్చేనెల 15న డిజిటల్‌ ఎంప్లాయిమెంట్‌ ఎక్స్చేంజ్‌ని ప్రారంభించాలని పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, శిక్షణశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఉపాధి కల్పన, శిక్షణ డైరెక్టర్‌ లావణ్యవేణిని ఆదేశించారు. ఇకపై ప్రతి జిల్లాలో నెలకు రెండుసార్లు జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ జాబ్‌మేళాలను వైఎస్సార్‌ కడప జిల్లా నుంచి ప్రారంభించాలని ఆదేశించారు. నైపుణ్యాభివృద్ధి, శిక్షణ, ఐటీ, ఎలక్ట్రానిక్‌ పాలసీ అమలుపై మంత్రి గురువారం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు.

స్కిల్‌ కాలేజీల పనుల పురోగతికి అవసరమైన నిధుల సమీకరణలో వేగంగా చర్యలు తీసుకోవాలని, బ్యాంకులతో సంప్రదించి నిధులు తెచ్చుకునే మార్గాలపై అన్వేషించాలని సూచించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌తో ఎంప్లాయ్‌మెంట్, ట్రైనింగ్‌ని అనుసంధానం చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి, కర్నూలు జిల్లా డోన్‌ స్కిల్‌ కాలేజీల భూసేకరణ పనుల పురోగతిపై మంత్రి ఆరా తీశారు. అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గంలో స్కిల్‌ కాలేజీ భూసేకరణను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. 

మూడేళ్లలో 55 వేల ఐటీ ఉద్యోగాలు లక్ష్యం
వచ్చే మూడేళ్లలో 55 వేల ఐటీ ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యమని మంత్రి చెప్పారు. విశాఖలో ఐకానిక్‌ టవర్ల ఏర్పాటుపై అధికారులకు పలు సూచనలిచ్చారు.  

మరిన్ని వార్తలు