రెండు రోజులపాటు మోస్తరు వర్షాలు

25 Apr, 2021 04:38 IST|Sakshi

మహారాణిపేట(విశాఖ దక్షిణ): ఉత్తర ఒడిశా, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం క్రమంగా వ్యాపిస్తోంది. ఇది మరట్వాడా, ఉత్తర కర్ణాటక, తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు తీర ప్రాంతం వరకు వ్యాపించి ఉందని, దీని ప్రభావం వల్ల రానున్న 48 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని విశాఖలోని వాతావరణ శాఖ అధికారులు శనివారం తెలిపారు.

ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రలతోపాటు రాయలసీమలోని పలు చోట్ల వర్షాలు కురిసే వీలుందని పేర్కొన్నారు.  కర్నూలు జిల్లాలోని పాములపాడు, కొత్తపల్లి, జూపాడుబంగ్లా, ఓర్వకల్లు, మిడుతూరు మండలాల్లో శనివారం అకాల వర్షాలు పడ్డాయి. నందికొట్కూరు మండలం నాగటూరులో పిడుగుపాటుతో ఓ మహిళ మృతిచెందింది. తూర్పుగోదావరి జిల్లాలోని రాజవొమ్మంగి మండలంలోని తంటికొండ గ్రామ సమీపాన ఈదురుగాలులతో కురిసిన వర్షానికి భారీ వృక్షం కూలడంతో రాకపోకలు నిలిచిపోయాయి. 

మరిన్ని వార్తలు