ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఏకగ్రీవాలు యథాతథం

22 May, 2021 04:09 IST|Sakshi

సాక్షి, అమరావతి: పరిషత్‌ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ఏకగ్రీవమైన ఎంపీటీసీ, జడ్పీటీసీలు యథాతథంగా ఉంటారని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికార వర్గాలు శుక్రవారం స్పష్టం చేశాయి. 2020 మార్చిలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 126 జడ్పీటీసీ స్థానాలు, 2,371 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే. 2020 మార్చిలో జరిగిన నామినేషన్ల ప్రక్రియను హైకోర్టు రద్దు చేయలేదని.. కరోనా అనంతరం మధ్యలో ఆగిపోయిన ఎన్నికలను తిరిగి నిర్వహించడానికి ఇచ్చిన నోటిఫికేషన్‌ను మాత్రమే రద్దు చేసిందని రాష్ట్ర ఎన్నికల సంఘం, పంచాయతీరాజ్‌ శాఖ అధికార వర్గాలు వెల్లడించాయి. హైకోర్టు తీర్పుపై మీడియా, కొన్ని రాజకీయ పార్టీలు తప్పుగా ప్రచారం చేస్తున్నాయని వివరించాయి.

2020 మార్చిలో మధ్యలో ఆగిపోయిన ఎన్నికలను 2021 ఏప్రిల్‌లో తిరిగి నిర్వహించేటప్పుడు నోటిఫికేషన్‌కు, పోలింగ్‌కు మధ్య 4 వారాల గడువును పాటించలేదని మాత్రమే కోర్టు తప్పుపట్టిందని తెలిపాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ 1న జారీ చేసిన నోటిఫికేషన్‌నే కోర్టు రద్దు చేసిందన్నాయి. 2020 మార్చిలో ఇచ్చిన ఎన్నికల నోటిఫికేషన్‌ ప్రకారం.. నామినేషన్ల ఉపసంహరణ వరకు జరిగిన ప్రక్రియంతా చెల్లుబాటులో ఉన్నట్లేనని వెల్లడించాయి. హైకోర్టు తాజా తీర్పు ప్రకారం.. ఏప్రిల్‌ 8న జరిగిన పోలింగ్‌ ప్రక్రియ మాత్రమే రద్దు అయినట్టుగా భావించాలని, అంతకు ముందు జరిగిన నామినేషన్లన్నీ చెల్లుబాటులో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. తాజా తీర్పుపై డివిజన్‌ బెంచ్‌లో సవాల్‌ చేయాలని ఎస్‌ఈసీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు