ఇసుక నిల్వకు భూమిని లీజుకివ్వడంపై పిల్‌

22 Sep, 2021 04:03 IST|Sakshi

వివరాలు సమర్పించాలని ఏఎంఆర్‌డీఏకు హైకోర్టు ఆదేశం

విచారణ ఈ నెల 24కి వాయిదా

సాక్షి, అమరావతి: కృష్ణా నదిలో పూడిక తీసిన ఇసుకను నిల్వ చేసేందుకు రాజధాని ప్రాంతంలోని మందడం గ్రామంలో ఉన్న 10 ఎకరాల భూమిని ‘రీచ్‌ డ్రెడ్జింగ్‌ లిమిటెడ్‌’కు మూడు నెలల పాటు లీజుకివ్వడాన్ని సవాల్‌ చేస్తూ రాజధాని రైతుల పరిరక్షణ సమితి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై మంగళవారం విచారణ జరిపిన హైకోర్టు, పూర్తి వివరాలను తమ ముందుంచాలని అమరావతి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఏఎంఆర్‌డీఏ)ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

అంతకు ముందు పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ, లీజుకిచ్చిన ప్రాంతం కృష్ణానదిని ఆనుకుని ఉందన్నారు. ఇది పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతమని, ఇలాంటి చోట ఇసుక నిల్వలకు అనుమతినివ్వడం సీఆర్‌డీఏ చట్ట నిబంధనలకు విరుద్ధమని చెప్పారు. వర్షాల వల్ల నిల్వ చేసిన ఇసుక మొత్తం తిరిగి నదిలోకి వెళ్లే అవకాశం ఉందన్నారు. ఏఎంఆర్‌డీఏ తరఫు న్యాయవాది కాసా జగన్‌మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, కేవలం మూడు నెలల కాలానికే ఆ ప్రాంతంలో భూమిని లీజుకివ్వడం జరిగిందన్నారు.

ఇక్కడ నిల్వ చేసిన ఇసుక కొంత ఎండిన తరువాత ఇతర అవసరాలకు, ఇతర ప్రాంతాలకు తరలించడం జరుగుతుందన్నారు. ఇసుకను ఇక్కడ శాశ్వతంగా నిల్వ చేయడం లేదని తెలిపారు. తగిన గడువునిస్తే పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతానని చెప్పారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, ఇసుక నిల్వ చేస్తున్న ప్రాంతం కృష్ణానదికి ఎంత దూరంలో ఉంది? కొంత ఎండిన తరువాత నిల్వ చేసిన ఇసుకను ఎక్కడికి తరలిస్తున్నారు? తదితర వివరాలను తమ ముందుంచాలని ఏఎంఆర్‌డీఏను ఆదేశించింది. 

మరిన్ని వార్తలు