సత్వరం పోలవరం పూర్తిచేయడమే అజెండా 

16 Nov, 2022 04:02 IST|Sakshi

నేడు పీపీఏ సర్వసభ్య సమావేశం 

సవరించిన అంచనాల మేరకు నిధులు ఇవ్వాలని పట్టుబట్టనున్న రాష్ట్ర ప్రభుత్వం 

సకాలంలో నిధుల విడుదలకు డిమాండ్‌  

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ(పీపీఏ) సర్వసభ్య సమావేశం బుధవారం నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన మేరకు పోలవరం ప్రాజెక్ట్‌ను సత్వరమే పూర్తి చేయడమే అజెండాగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. పీపీఏ సీఈవో చంద్రశేఖర్‌ అయ్యర్‌ అధ్యక్షతన హైదరాబాద్‌లోని పీపీఏ కార్యాలయంలో నిర్వహించనున్న ఈ సమావేశంలో రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి తదితరులు పాల్గొంటారు. పీపీఏ గెజిట్‌ నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనల ప్రకారం ఏడాదికి రెండుసార్లు సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించాలి.

ప్రాజెక్ట్‌ పనుల పురోగతిని సమీక్షించి, సమస్యలను పరిష్కరించడం ద్వారా సత్వరమే పూర్తి చేయడానికి ఈ సమావేశాలు దోహదపడాలనేది కేంద్రం ఉద్దేశం. కానీ, ఏడాదిగా సర్వసభ్య సమావేశం నిర్వహించాలని కోరుతున్నా పీపీఏ సీఈవో చంద్రశేఖర్‌ అయ్యర్‌ స్పందించడం లేదు. ఇటీవల రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ రాసిన లేఖకు ఎట్టకేలకు స్పందించిన అయ్యర్‌... పీపీఏ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

పోలవరం ప్రాజెక్ట్‌ను సత్వరమే పూర్తి చేయడం కోసం 2017–18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లను ఆమోదించి.. ఆ మేరకు సకాలంలో నిధులు విడుదల చేయాలని ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పనుంది. నిర్వాసితులకు పునరావాసం కింద చెల్లించాల్సిన పరిహారాన్ని ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) విధానంలో వారి ఖాతాల్లో జమ చేయాలని తాము చేసిన ప్రతిపాదనను అమల్లోకి తేవాలని కోరనుంది.

గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, పనుల వల్ల దెబ్బతిన్న డయాఫ్రమ్‌ వాల్‌ భవితవ్యం, ఈసీఆర్‌ఎఫ్‌ నిర్మాణ ప్రాంతంలో ఏర్పడిన గోతులను పూడ్చే విధానాలను తక్షణమే తేల్చి... ఈ సీజన్‌లో చేపట్టాల్సిన పనులపై చర్చించనుంది. ఈ సీజన్‌లో దిగువ కాఫర్‌ డ్యామ్‌ను పూర్తిచేయడంతోపాటు వరద ప్రారంభమయ్యేలోగా ఈసీఆర్‌ఎఫ్‌ నిర్మాణాన్ని ప్రారంభించి, శరవేగంగా పూర్తి చేయడానికి అవసరమైన అన్ని అనుమతులు సత్వరమే వచ్చేలా చేయాలని డిమాండ్‌ చేయనుంది.  

మరిన్ని వార్తలు