రూ.118.64 కోట్లతో కృష్ణానదికి రక్షణగోడ

29 Oct, 2022 13:02 IST|Sakshi

పద్మావతి ఘాట్‌ నుంచి కనకదుర్గమ్మ వారధి వరకు

టెండర్‌ నోటిఫికేషన్‌ జారీచేసిన ప్రభుత్వం

రెండేళ్లలో పూర్తిచేయాలని షరతు

ఇప్పటికే యనమలకుదురు నుంచి వారధి వరకు గోడ నిర్మాణం

కృష్ణానదికి 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా విజయవాడలో లోతట్టు ప్రాంతాల ప్రజలకు బేఫికర్‌

సాక్షి, అమరావతి: కృష్ణానదికి విజయవాడలో పద్మావతి ఘాట్‌ నుంచి కనకదుర్గమ్మ వారధి వరకు రూ.118.64 కోట్లతో రక్షణగోడ నిర్మాణానికి ప్రభుత్వం టెండర్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది. ఈ పనులను రెండేళ్లలో పూర్తిచేయాలని షరతు విధించింది. టెండర్‌ షెడ్యూలు దాఖలుకు నవంబర్‌ 10వ తేదీని గడువుగా నిర్ణయించింది. నవంబర్‌ 15న ఆర్థిక బిడ్‌ను తెరిచి.. అదేరోజున రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించి, కనిష్ట ధరకు పనులు చేయడానికి ఆసక్తిచూపిన కాంట్రాక్టర్‌కు పనులు అప్పగిస్తుంది.
చదవండి: టీడీపీ కార్యాలయంలో రికార్డింగ్‌ డ్యాన్స్‌లు.. ఐటమ్‌ సాంగ్‌లతో రెచ్చిపోయారు

ఈ గోడ నిర్మాణం పూర్తయితే కృష్ణానదికి గరిష్టంగా 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా.. విజయవాడలోని లోతట్టు ప్రాంతాల్లోకి చుక్కనీరు కూడా చేరదు. కృష్ణానదికి కేవలం మూడులక్షల క్యూసెక్కుల వరద వస్తే చాలు.. విజయవాడలో కృష్ణలంక నుంచి యనమలకుదురు వరకు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యేవి. కృష్ణానదికి వరదలు వచ్చాయంటే లోతట్టు  ప్రాంతాల ప్రజలు వణికిపోయేవారు.

రక్షణగోడలు నిర్మిస్తామని ఎన్నికల్లో హామీలివ్వడం, తర్వాత వాటిని బుట్టదాఖలు చేయడం రివాజుగా మారిపోయింది. కానీ.. 2004 ఎన్నికల్లో మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఇచ్చిన హామీ మేరకు యనమలకుదురు నుంచి కోటినగర్‌ వరకు కృష్ణానదికి 2.28 కిలోమీటర్ల పొడవున రక్షణగోడలు నిర్మించారు. మహానేత హఠాన్మరణం తర్వాత మిగిలిన లోతట్టు ప్రాంతాలకు రక్షణగోడ నిరి్మంచడంపై ఆ తర్వాతి ప్రభుత్వాలు దృష్టిపెట్టలేదు. 

రక్షణగోడ రెండోదశ.. రికార్డు సమయంలో పూర్తి  
పాదయాత్రలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు కోటినగర్‌ నుంచి తారకరామనగర్‌ వరకు 1.56 కిలోమీటర్ల పొడవున రక్షణగోడ నిర్మాణ పనులను రూ.125 కోట్లతో 2021 మే 31న ప్రారంభించి రికార్డు సమయంలో పూర్తిచేశారు. ప్రకాశం బ్యారేజ్‌ నుంచి 12 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేసినా లోతట్టు ప్రాంతాలకు వరద చేరకుండా పటిష్టంగా రక్షణగోడ నిర్మించారు. దీంతో కృష్ణానదికి ఇటీవల సుమారు ఆరులక్షల క్యూసెక్కుల వరద వచి్చనా విజయవాడలో లోతట్టు ప్రాంతాల్లోకి చుక్కనీరు కూడా చేరలేదు.

ముంపు ఇబ్బందులు ఉండవు 
విజయవాడలో కృష్ణానది పరిసర ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలకు పూర్తిస్థాయిలో రక్షణ కల్పించేందుకు పద్మావతి ఘాట్‌ నుంచి కనకదుర్గమ్మ వారధి వరకు రక్షణగోడ నిర్మించే పనులకు సీఎం వైఎస్‌ జగన్‌ రూ.135 కోట్లు మంజూరు చేశారు. ఈ పనులకు రూ.118.64 కోట్లతో ఓపెన్‌ విధానంలో జలవనరుల శాఖ అధికారులు టెండర్‌ నోటిఫికేషన్‌ జారీచేశారు. ఈ పనులు పూర్తయితే ప్రకాశం బ్యారేజ్‌ నుంచి దిగువకు గరిష్టంగా 12 లక్షల క్యూసెక్కుల వరదను విడుదల చేసినా.. విజయవాడలోని లోతట్టు ప్రాంతాలైన కృష్ణలంక నుంచి యనమలకుదురు వరకు ప్రజలకు ఎలాంటి ముంపు ముప్పు ఉండదని ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి చెప్పారు.  

మరిన్ని వార్తలు