తప్పిన వాయు‘గండం’

12 Sep, 2022 04:11 IST|Sakshi

వర్షాలు తగ్గుముఖం

ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌  వైపు కదులుతున్న వాయుగుండం

నేడు, రేపు మోస్తరు వానలు 

సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ఆదివారం వాయుగుండంగా బలపడి ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ వైపు కదులుతోంది. దీంతో రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఈ వాయుగుండం ఆదివారం సాయంత్రానికి ఒడిశాలోని భవానీపటా్ననికి 80 కిలోమీటర్లు, గోపాల్‌పూర్‌కు 110 కిలోమీటర్లు, ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌కు 210 కిలోమీటర్లు, కంకేర్‌కి 260 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. 

ఇది దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ మీదుగా ప్రయాణిస్తూ సోమవారానికి అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం అక్కడక్కడా భారీవర్షాలు కురవగా చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. సోమ, మంగళవారాల్లో మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉందని, తీరం వెంబడి గంటకు 40 నుంచి 50కిలోమీటర్లు.. గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

మత్స్యకారులు సముద్రంలోకి చేపలవేటకు వెళ్లవద్దని సూచించింది. గడచిన 24 గంటల్లో పాలకోడేరులో 14 సెంటీమీటర్లు, నూజివీడులో 11, సెట్టిగుంటలో 10.3, పూసపాటిరేగ, బలిజపేటల్లో 9, భీమడోలు, భీమవరం, కళింగపటా్నల్లో 8, ఆళ్లగడ్డలో 7.8, ఇబ్రహీంపట్నంలో 7.4, చింతలపూడి, తెర్లాం, జియ్యమ్మవలసల్లో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.  

మరిన్ని వార్తలు