స్వతంత్ర విచారణ అవసరం

16 Oct, 2020 03:35 IST|Sakshi

ముఖ్యమంత్రి సుప్రీం సీజేకు లేఖ రాయటం తప్పు కాదు

ఆ లేఖను బయటపెట్టడం కూడా తప్పేమీ కాదు

లేఖను రహస్యంగా ఉంచటమంటే తొక్కి పట్టేయటమే

‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌భూషణ్‌

ఆరోపణలు తీవ్రమైనవి; స్వతంత్ర కమిటీతో విచారణ జరపాలి

పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులే దాన్లో సభ్యులుగా ఉండాలి

అమరావతి ల్యాండ్‌ స్కామ్‌లో దర్యాప్తు ఆపటానికి కారణమేమీ లేదు

మీడియాలో వార్త రాకుండా గ్యాగ్‌ ఆర్డర్‌ ఇవ్వటం హైకోర్టు పనికాదు

అది భావ ప్రకటన స్వేచ్ఛకు, తెలుసుకునే హక్కుకు వ్యతిరేకం

ఫిర్యాదుల కోసం జ్యుడీషియల్‌ కంప్లయింట్‌ కమిషన్‌ ఏర్పాటు చేయాలి

సాక్షి ప్రత్యేక ప్రతినిధి, న్యూఢిల్లీ: న్యాయమూర్తులపై తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పుడు సుప్రీం కోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తులతో స్వతంత్ర విచారణ జరిపించాలని, ఆరోపణలు ప్రజల్లోకి వెళితేనే చర్యలకు వీలుంటుందని సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ అభిప్రాయపడ్డారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయటంలో కానీ, ఆ లేఖను బయటపెట్టడంలో కానీ ఎలాంటి తప్పూ లేదని చెప్పారాయన. అభిశంసన లాంటి అవసరం వస్తే... ఆరోపణల గురించి తెలిస్తేనే కదా పార్లమెంటు సభ్యులు ముందుకొస్తారని వ్యాఖ్యానించారు. ప్రజల గొంతు నొక్కేయడం ద్వారా న్యాయ వ్యవస్థలో విశ్వసనీయత నిలబడదని స్పష్టంచేశారు. తాజా వ్యవహారంపై ప్రధాన న్యాయమూర్తి తప్పనిసరిగా విచారణ జరుపుతారని తాను భావిస్తున్నట్లు చెప్పారాయన. అమరావతి ల్యాండ్‌ స్కామ్‌ ఎఫ్‌ఐఆర్‌పై హైకోర్టు గ్యాగ్‌ ఆర్డర్‌ ఇవ్వటాన్ని తప్పుపట్టిన ప్రశాంత్‌ భూషణ్‌... పలు అంశాలపై ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలు చెప్పారు. ముఖ్యాంశాలివీ.. 

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌కు లేఖ రాయటం తప్పంటారా? 
నేనైతే తప్పనుకోవటం లేదు. ఎందుకంటే సుప్రీం కోర్టులో సీనియర్‌ న్యాయమూర్తి, వచ్చే ఏప్రిల్‌లో ప్రధాన న్యాయమూర్తి కాబోతున్న వారిపై చేసిన ఈ ఆరోపణలు చాలా తీవ్రమైనవి. ప్రధాన న్యాయమూర్తి తగిన వారు కనుక వారికే లేఖ రాయాలి. ఇంతటి తీవ్రమైన ఆరోపణలొచ్చినప్పుడు  ప్రధాన న్యాయమూర్తి తప్పకుండా విచారణ జరపాలి. అత్యంత నిజాయితీ పరులుగా పేరున్న రిటైర్డ్‌ సుప్రీం కోర్టు న్యాయమూర్తులతో ఒక స్వతంత్ర కమిటీ వేసి విశ్వసనీయమైన విచారణ జరిపించాలి..  

ఈ లేఖను ఏపీ ప్రభుత్వం బహిరంగం చేసింది కదా! ఇది తప్పంటారా? అసలు న్యాయవ్యవస్థపై, న్యాయమూర్తులపై ఆరోపణలొచ్చినప్పుడు వాటిని రహస్యంగా ఉంచాలా? 
అలాంటిదేమీ లేదు. ఆరోపణలొచ్చింది న్యాయమూర్తులపై కదా అని వేరేగా చూడకూడదు. వేరేవాళ్లపై ఆరోపణలొచ్చినప్పుడు ఎలా చూస్తామో.. దీన్నీ అలాగే చూడాలన్నది నా అభిప్రాయం. ప్రజలకు దాన్ని తెలియకుండా ఉంచాలనటానికి ఎలాంటి కారణమూ లేదు. రహస్యంగా ఉంచాలనుకోవడమంటే.. తొక్కి పట్టడమే. ఒకవేళ దాన్ని రహస్యంగా ఉంచితే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గానీ, పార్లమెంటు సభ్యులు గానీ దానిపై ఏమీ చేయలేరు.  

అంటే లేఖలోని విషయాలు బయటకు రాకపోతే చర్యలు తీసుకోలేరా? 
దీనిపై రెండు రకాలుగా చర్యలు తీసుకోవచ్చు. ఒకటి..  సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో అంతర్గత కమిటీ ద్వారా విచారణ జరపడం. రెండోది అభిశంసన. మరి అభిశంసన విషయానికొస్తే దాన్లో పార్లమెంటు సభ్యుల పాత్ర ఉంటుంది. విషయం ప్రజల్లోకి రానప్పుడు పార్లమెంటు సభ్యులు కూడా అభిశంసన తీర్మానంపై సంతకం చేసేందుకు ముందుకు రారు. తాము ఏదో చేయాలనే అభిప్రాయానికి రానిపక్షంలో.. కాబోయే సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తికి ఇబ్బంది తెచ్చిపెట్టాలని ఎవరూ అనుకోరు కదా!. 

కొందరైతే ఇలా న్యాయమూర్తులపై ఆరోపణలు చేయడాన్ని కోర్టు ధిక్కరణగా వ్యాఖ్యానిస్తున్నారు. అత్యున్నతస్థాయి వ్యక్తులపై ఆరోపణలొస్తే అసలెలా పరిష్కరించాలి? 
ఆరోపణలు చేయటమంటే కోర్టును అపకీర్తి పాలు చేయడమనే వ్యాఖ్యలు కొందరు చేస్తుంటారు. ఇది పురాతన చట్టం. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఇలాగే ఉంది. వలస పాలన నాటి సంప్రదాయాన్ని కొనసాగించేందుకు తగిన కారణాలైతే ఏమీ లేవు. చక్రవర్తుల కాలంలోనైతే న్యాయమూర్తుల్ని రాజుల ప్రతినిధులుగా పరిగణించేవారు. న్యాయవ్యవస్థలోని అవినీతిపై ప్రజల నోళ్లు నొక్కేయడం ద్వారా న్యాయవ్యవస్థలో ఉన్న వారి విశ్వసనీయతను కాపాడలేం. న్యాయవ్యవస్థలోని అవినీతి లేదా ఇతర అంశాలపై కూడా చర్చించేందుకు ప్రజలకు స్వేచ్ఛ ఉండాలి. 

అమరావతి భూకుంభకోణంలో ఎఫ్‌ఐఆర్‌ను మీడియా రిపోర్ట్‌ చేయకుండా ఏపీ హైకోర్టు గ్యాగ్‌ ఆర్డర్‌ ఇవ్వడం, దర్యాప్తు నిలిపివేయటంపై ఏమంటారు? 
ఎఫ్‌ఐఆర్‌ను రిపోర్ట్‌చేయకుండా మీడియాపై గ్యాగ్‌ ఆర్డర్‌ జారీచేయడం హైకోర్టు పనికాదు. ఇలాంటి చర్యలన్నీ భావ ప్రకటనా స్వేచ్ఛకు వ్యతిరేకం. సమాచారం తెలుసుకునే ప్రజల హక్కుకు వ్యతిరేకం. ఏం జరుగుతోందో తెలుసుకునే అవసరం ప్రజలకుంది. 

అత్యంత పలుకుబడి కలిగిన వ్యక్తులపై ఆరోపణలొచ్చినప్పుడు దర్యాప్తు జరగాలా... వద్దా? 
తప్పనిసరిగా జరగాలి. అవినీతి, లేదా ఇతరత్రా అక్రమాలు జరిగినట్లు ఆరోపణలొస్తే తప్పకుండా దర్యాప్తు జరగాల్సిందే. ఎఫ్‌ఐఆర్‌లో పొందుపరిచిన ప్రకారం అమరావతి భూకుంభకోణంలో దర్యాప్తు జరపాలి. అలా చేయొద్దనటానికి కారణమేమీ లేదు. దర్యాప్తు నిలిపివేయాల్సిన అవసరమూ లేదు.  

న్యాయవ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనానికి ఎలాంటి వ్యవస్థ ఉండాలంటారు? 
న్యాయ వ్యవస్థపై ఫిర్యాదులకు జ్యుడీషియల్‌ కంప్లయింట్‌ కమిషన్‌ అవసరం. న్యాయమూర్తులపై ఎవరికి ఫిర్యాదు చేయాలన్న అంశాన్ని స్పష్టం చేయాలి. కమిషన్‌లో కనీసం ఐదుగురు సభ్యులుండాలి. పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులు గానీ, ఇతరులు గానీ ఉండాలి. కానీ న్యాయ వ్యవస్థ నుంచి, ప్రభుత్వం నుంచి స్వతంత్రంగా ఉండాలి. ఎంపిక విషయంలో కూడా ప్రభుత్వం, న్యాయవ్యవస్థ పెత్తనం ఉండకుండా చూడాలి. ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయమూర్తులపై స్వతంత్ర విచారణ జరిగేలా ఉండాలి. విచారణ అనంతరం తొలగింపు లేదా ఏ ఇతర సిఫారసులైనా పార్లమెంటుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చూడాలి. 

ఏపీ హైకోర్టు నిష్పాక్షికంగా వ్యవహరించాలన్న ముఖ్యమంత్రి విజ్ఞాపనకు ఎలాంటి పరిష్కారం ఉండాలని భావిస్తున్నారు?
ప్రధాన న్యాయమూర్తి దాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటారు.  

ఈ వ్యవహారంలో రాజ్యాంగం ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు?
ప్రధాన న్యాయమూర్తి ముగ్గురు సుప్రీం కోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తులతో విచారణ జరిపించాలి. సుప్రీం కోర్టు ప్రవర్తన నియమావళి ప్రకారం సిట్టింగ్‌ న్యాయమూర్తులతోనే విచారణ జరిపించాలి. కానీ ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయమూర్తి సీనియర్‌. ఆయనకంటే జూనియర్‌ న్యాయమూర్తులతో విచారణ జరిపిస్తే.. వారు స్వతంత్రంగా విచారణ జరపలేరేమోనన్నదే నా అభిప్రాయం. అందుకని ముగ్గురు రిటైర్డ్‌ న్యాయమూర్తులతో విచారణ జరిపించడం అవసరం.  

మరిన్ని వార్తలు