రెండు గోడల మధ్య చిక్కుకున్న ఆరేళ్ల చిన్నారి

24 Jul, 2020 13:10 IST|Sakshi
గోడల మధ్య ఇరుక్కుపోయిన పాప ,సురక్షితంగా బయటకువచ్చిన మీనాక్షి  

బయటకు తీసేందుకు స్థానికుల విఫలయత్నం 

అగ్నిమాపక సిబ్బంది చొరవతో బాలిక సేఫ్‌ 

ఒంగోలు: ఆరేళ్లపాప రెండు గోడల మధ్య ఇరుక్కుపోయి దాదాపు రెండు గంటలకుపైగా తీవ్ర ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఫైర్‌ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో పాప సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేరింది. ఈ సంఘటన స్థానిక ఇందిరమ్మ కాలనీ మూడో లైనులో గురువారం జరిగింది. లక్కె ముద్దుల కృష్ణ, ఆ పక్కనే ఉన్న మరో వ్యక్తి పక్కపక్కనే ఇళ్లు నిర్మించుకున్నారు. రెండిళ్ల మధ్య సన్నని ఖాళీ వదులుకున్నారు. కనీసం అడుగు గ్యాప్‌ కూడా లేదు. కృష్ణ ఆరేళ్ల కుమార్తె మీనాక్షి ఆడుకుంటూ ఆ గ్యాప్‌లోకి వెళ్లి ఇరుక్కుపోయింది. కదల లేని స్థితిలో పాప కేకలు విని కుటుంబ సభ్యులతో పాటు చుట్టుపక్కల వారు వచ్చారు. ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి.

కొంతమంది పాపకు తాడు అందించి బయటకు తీసుకొద్దామని చేసిన యత్నం విఫలమైంది. మరికొంత మంది కర్ర సాయంతో బయటకు తీసేందుకు యత్నించగా అది కూడా విఫలమైంది. పాప తండ్రి అగ్నిమాపక శాఖ అధికారులకు ఫోన్‌ చేసి పరిస్థితిని వివరించాడు. జిల్లా ఫైర్‌ ఆఫీసర్‌ శ్రీనివాసరావుతో పాటు ఒంగోలు ఫైర్‌ ఆఫీసర్‌ వై.వెంకటేశ్వర్లు తమ సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు. లోపలకు వెళ్లేందుకు, బాలికను రక్షించేందుకు పరిస్థితిని అంచనా వేసి గోడలను పగలగొట్టక తప్పదని నిర్ణయించుకున్నారు. పాపకు దెబ్బ తగలకుండా గోడకు తమ వద్ద ఉన్న అధునాతన యంత్రాలతో రంధ్రం చేసి గోడను పాక్షికంగా ధ్వంసం చేశారు. అనంతరం పాపను సురక్షితంగా బయటకు తీశారు. అప్పటి వరకూ జరుగుతున్న తతంగాన్ని ఉగ్గబట్టి చూస్తున్న జనంతో పాటు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు