పోటాపోటీగా.. కృష్ణా, గోదావరి 

22 Aug, 2020 05:30 IST|Sakshi
నాగార్జున సాగర్‌లో 15 క్రస్ట్‌ గేట్ల ద్వారా విడుదలవుతున్న నీరు

కృష్ణా వరద ఉధృతితో శ్రీశైలం, సాగర్‌ గేట్లు ఎత్తివేత 

ప్రకాశం బ్యారేజీలోకి వెల్లువెత్తుతున్న వరద 

ఉపనదులు పోటెత్తడంతో మళ్లీ మహోగ్రరూపం దాల్చిన గోదావరి 

ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ

సాక్షి, అమరావతి/విజయపురి సౌత్‌ (మాచర్ల)/అచ్చంపేట (పెదకూరపాడు)/శ్రీశైలం ప్రాజెక్ట్‌: పరీవాహక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా, గోదావరి వరద ఉధృతితో పోటెత్తుతున్నాయి. పులిచింతలకు దిగువన కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చడంతో ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తి 1,14,096 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. ఇక ఉపనదులు ఉరకలెత్తడంతో గోదావరి మళ్లీ మహోగ్రరూపం దాల్చింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్టు అధికారులు చెప్పారు. 

 శ్రీశైలం ప్రాజెక్టులోకి 3.93 లక్షల   క్యూసెక్కులు 
► ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర డ్యామ్‌ల నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి 3.93 లక్షల క్యూసెక్కులు చేరుతున్నాయి. 
► శ్రీశైలం స్పిల్‌ వేకు ఉన్న 12 గేట్లలో పది గేట్లను ఎత్తి కుడిగట్టు విద్యుత్కేంద్రం ద్వారా నాగార్జునసాగర్‌కు 3.44 లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు. అలాగే పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్, హంద్రీ–నీవాకు నీటిని విడుదల చేశారు. 
► నాగార్జునసాగర్‌లో నీటి నిల్వ 299.45 టీఎంసీలకు చేరుకుంది. గేట్లు ఎత్తి 1.38 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు.   n పులిచింతలలో నీటి నిల్వ 26.5 టీఎంసీలకు చేరుకుంది. శనివారం ఉదయానికి ప్రాజెక్టు నిండిపోతుంది. దీంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తేయనున్నారు. 
► వర్షాలతో మున్నేరు, కట్టలేరు, వైరా ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ప్రకాశం బ్యారేజీలోకి కృష్ణమ్మ పోటెత్తుతోంది. బ్యారేజీలోకి 1.27 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టాకు వదలగా మిగులుగా ఉన్న 1.14 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. 
► శుక్రవారం సాయంత్రం ఏడు గంటలకు గోదావరిపై ఉన్న ధవళేశ్వరం బ్యారేజీలోకి 18,68,370 క్యూసెక్కులు చేరుతున్నాయి. నీటిమట్టం 17.50 అడుగుల్లో ఉండటంతో రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు.

మరిన్ని వార్తలు