అపురూప దృశ్యం.. ఆవిష్కృతం 

22 Apr, 2021 11:11 IST|Sakshi
ఆలయంలోకి ప్రవేశిస్తున్న సూర్యకిరణాలు

చంద్రమౌళీశ్వరుని స్పృశించిన సూర్యకిరణాలు

దర్శించి తరించిన భక్తజనం

మొదటిసారిగా నగరిలో అద్భుతం 

నగరి (చిత్తూరు జిల్లా): నగరి మున్సిపల్‌ పరిధి కీళపట్టు పురాతన శ్రీచంద్రమౌళీశ్వరస్వామి ఆలయంలోని అరుణోదయ వేళ శివలింగాన్ని సూర్యకిరణాలు తాకిన అపురూప దృశ్యం మంగళవారం సాక్షాత్కరించింది. ఉదయం 6.30 నుంచి 6.45 గంటల వరకు భానుడు తన కిరణాలతో స్వామివారిని స్పృశించాయి. ఎన్నడూ లేని విధంగా ఆలయంలోకి సూర్యకిరణాలు శివలింగం వరకు ప్రసరించడం ప్రత్యకతను సంతరించుకుంది. ఈ విషయం తెలియడంతో  స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చేసి ఈ దృశ్యాన్ని తిలకించి పరవశించారు. కిరణాలు ఒక మార్గంలా వెళ్లి శివలింగంపై పడుతుండడంతో ఇది మహత్యమే అంటూ దర్శించేందుకు భక్తులు ఉత్సాహం చూపించారు.

ఆలయ నిర్వాహకుడు సుబ్రమణ్యంస్వామి మాట్లాడుతూ శతాబ్దాల కిందటే సూర్యకిరణాలు స్పృశించేలా తూర్పు ముఖంతో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోందని, పర్యవేక్షణ లేకపోవడంతో ఈ దృశ్యాన్ని గమనించేవారు లేకపోయారన్నారు. కొన్నేళ్లుగా భక్తుల చొరవతో ఆలయం మళ్లీ పూర్వవైభవం సంతరించుకుంటోందని, నిత్యపూజా కైంకర్యాలు బాగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. సూర్యోదయ సమయాన్నే కిరణాలు శివలింగాన్ని స్పృశించడాన్ని వీక్షించి తరించామని   వివరించారు. వారం రోజుల పాటు శివలింగాన్ని సూర్యకిరణాలు స్పృశించవచ్చని భావిస్తున్నామని తెలిపారు.

శివలింగాన్ని స్పృశిస్తున్న సూర్యకిరణాలు.. 
చదవండి:
‘మనకు మొహమాటం ఉన్నా.. కరోనాకు లేదు’ 
రెచ్చిపోతున్న ఆన్‌లైన్‌ మోసగాళ్లు..

మరిన్ని వార్తలు